Abn logo
Aug 2 2021 @ 00:56AM

రూ. 4వేల కోట్లతో బందరు పోర్టు నిర్మాణం

 ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 1 : త్వరలో రూ.4వేల కోట్లతో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాలశౌరి మీడియాతో మాట్లాడారు. బందరు పోర్టు నిర్మాణానికి కావలసిన టెండర్లను సరళీకృతం చేశారని, అందువల్ల త్వరలో పోర్టు నిర్మాణానికి కావలసిన సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. రూ.1000 కోట్లతో కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల మచిలీపట్నం ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు. గుడివాడ సమీపంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేట్రాక్‌ సమీపంలో రూ.200 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నామన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మచిలీపట్నంలో హార్బర్‌ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పోర్టు పనులు ప్రారంభిస్తే వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. నాగాయలంక మండలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా డీఆర్‌డీవో మిసైల్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ను రూ.3 వేల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా నిర్మిస్తున్నామన్నారు. కొవిడ్‌ పరిస్థితుల వల్ల స్టేషన్‌ ప్రారంభోత్సవం ఆలస్యమయిందన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాఽధానం చెబుతూ తిరుపతి, విశాఖపట్నం వెళ్లే రైళ్లు పునరుద్ధరించేందుకు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బూరగడ్డ రమేష్‌ నాయుడు, ఉప్పాల రామ్‌ప్రసాద్‌, ఉప్పాల రాము పాల్గొన్నారు. నిడుమోలు నేషనల్‌ హైవే సమస్యను సీపీఎం నాయకులు మద్దుల బసవయ్య, అన్నపరెడ్డి నాగేశ్వరరావు ప్రస్తావించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంపీకి పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.