2 రోజులు.. 50 కోట్లు.. ‘అఖండ’ ఊచకోత మొదలైంది

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌లైన ఈ చిత్రం పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన రెండు రోజులలోనే ఈ చిత్రం రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత‌ను మొదలెట్టింది. చిత్రంలో బాలయ్య విశ్వరూపం చూసిన వారంతా.. జై బాలయ్యా అంటూ జేజేలు కొడుతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ఓవర్సీస్‌లో సైతం ‘అఖండ’ ప్రభంజనం సృష్టిస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం.. ‘అఖండ’ చిత్రం ఓవర్సీస్‌లో మ్యాజిక్ చేస్తుందని ట్వీట్ చేస్తూ.. అక్కడి కలెక్షన్ల వివరాలను తెలియజేశారు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. రూ. 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. శని, ఆది వారాల్లో ఈ చిత్రానికి మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశముందని చిత్రయూనిట్ సైతం భావిస్తోంది. 

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన స్టార్ హీరో తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేట్లు దారుణంగా ఉన్నా సరే.. సినిమాపై ఉన్న నమ్మకంతో ‘అఖండ’ టీమ్ వెనకడుగు వేయకుండా చెప్పిన డేట్‌కి సినిమాని విడుదల చేశారు. ఈ చిత్ర రిజల్ట్‌ కోసం బాలయ్య అభిమానులే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతగానో ఎదురుచూసింది. ఈ విజయంతో ఇండస్ట్రీకి బాలయ్య ఊపిరి పోశాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు బాలయ్య బాబు బాటలోనే మరికొందరు స్టార్ హీరోలు ధైర్యంగా ముందడుగు వేసేందుకు రెడీ అవుతున్నారంటే.. టాలీవుడ్‌పై ‘అఖండ’ ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. మ్యూజిక్ సంచలనం థమన్ సంగీతాన్ని అందించారు.


Advertisement