బాల్కనీ గార్డెనింగ్‌..

ABN , First Publish Date - 2021-01-10T17:09:02+05:30 IST

మొక్కలంటే ప్రాణం. గార్డెనింగ్‌ అంటే మహా ఇష్టం. ఆ రంగురంగు పూల మొక్కల మధ్య, పచ్చటి గడ్డిపైన కుర్చీలో కూర్చుని...

బాల్కనీ గార్డెనింగ్‌..

మొక్కలంటే ప్రాణం. గార్డెనింగ్‌ అంటే మహా ఇష్టం. ఆ రంగురంగు పూల మొక్కల మధ్య, పచ్చటి గడ్డిపైన కుర్చీలో కూర్చుని... ఆకాశంలో తేలిపోతున్న మేఘాలను తిలకిస్తూ.. వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తుంటే.. జీవితం ధన్యం అవుతుంది..!. మహానగరాల్లోని అపార్ట్‌మెంట్‌లలో రెండు పడగ్గదుల ఫ్లాట్స్‌లో ఉండే వాళ్లకు అంత అదృష్టమా? అనుకుంటాం. గార్డెనింగ్‌, వర్టికల్‌ డిజైనర్స్‌ అయితే... ఆ చిన్న బాల్కనీనే కనువిందైన ప్రదేశంగా తీర్చిదిద్దుతారు. ఇలాంటి చిన్న చిన్న బాల్కనీల్లో పచ్చదనం నింపేందుకు వచ్చిందే బాల్కనీ గార్డెనింగ్‌. ఇందులో రకరకాల ట్రెండ్స్‌ దూసుకొస్తున్నాయి. డిజైనర్లు తమ సృజనాత్మకతను జోడించి... వినియోగదారులను చూరగొంటున్నారు. 


ఇదొక పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతోంది. బొంబాయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు బాల్కనీలను సుందర ప్రదేశాలుగా మార్చేసుకున్నారు. మిద్దె తోటలకు అయితే లెక్కలేదు. భవనాలపైన కూరగాయలు పండించే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. బాల్కనీల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు చోటు ఉండదు కాబట్టి ఇక్కడ ఆ పని చేయలేం. నాలుగు కుర్చీలు వేసుకుని కూర్చునేంత ఆ చిన్న జాగాను అందంగా, పచ్చగా మలుచుకోవడానికి ఇష్టపడుతున్నారు జనం. సాధారణంగా బాల్కనీల్లో నాలుగు పూల కుండీలను ఏర్పాటు చేసుకోవడం ఏమంత కష్టం కాదు. కానీ, డిజైనర్లు చేసే అమరిక ప్రత్యేకంగా ఉంటుంది. బాల్కనీ లుక్కే మారిపోతుంది. నైపుణ్యవంతులైన బాల్కనీ డిజైనర్లు మాత్రమే ఇలా చేయగలరు. వాళ్ల దగ్గరున్న రకరకాల డిజైన్లను చూసి, మన అభిరుచులకు తగ్గట్టు ఎంపిక చేసుకోవచ్చు.


కుండీల ఆకారం, బరువు, రంగు, మొక్కల ఎంపిక... ఇవన్నీ పరిగణలోకి తీసుకోవచ్చు. బాల్కనీల సైజు చిన్నగానే ఉంటుంది కాబట్టి... కృత్రిమ గడ్డిని పరిస్తే మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ గడ్డి కూడా రకరకాల సైజుల్లో లభిస్తుంది. బాల్కనీని ఒక చిన్న తోటలా తీర్చిదిద్దుతారు వాళ్లు. ప్రస్తుతానికి బాల్కనీ గార్డెనింగ్‌ కొంత ఖరీదైనదే... పదివేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొక్కల నిర్వహణకు అత్యాధునిక పద్ధతులు వచ్చాయిప్పుడు. బ్లూటూత్‌ సాయంతో పనిచేసే డివైజ్‌ల సహాయంతో మొక్కలకు నీటిని సరఫరా చేయొచ్చు. మనమెక్కడున్నా మొబైల్‌ సహాయంతో ఆ పని చక్కబెట్టవచ్చు.

Updated Date - 2021-01-10T17:09:02+05:30 IST