బాల్కనీ మారథాన్‌

ABN , First Publish Date - 2020-03-30T09:55:13+05:30 IST

కరోనా మహమ్మారి దెబ్బకు దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌ అయ్యాయి. వారాలపాటు ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఇది ఎవరికైనా కష్టమే! ఉదయం

బాల్కనీ మారథాన్‌

దక్షిణాఫ్రికా దంపతుల వినూత్న ఆలోచన

దుబాయ్‌: కరోనా మహమ్మారి దెబ్బకు దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌ అయ్యాయి. వారాలపాటు ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఇది ఎవరికైనా కష్టమే! ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లాలన్నా భయపడుతున్న వైనం. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తున్న ఓ దక్షిణాఫ్రికా జంట తమ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలోనే మారథాన్‌ నిర్వహించింది. ఈ మారథాన్‌ను ఓ ప్రాజెక్టుగా చేపట్టాలని తలచి.. దీనిని ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టి లాక్‌డౌన్లో ఉన్న ప్రజలకు కాస్త ఊరట కలిగిస్తున్నారు. కోలిన్‌ అలిన్‌ (41), అతడి భార్య హిల్డా.. 42.2 కి.మీ. (26 మైళ్లు) మారథాన్‌ను 20 మీటర్ల పొడవైన తమ బాల్కనీలో అటు ఇటు 2,100సార్లు తిరగడం ద్వారా పూర్తి చేశారు. సమయం కోసం ఓ స్టాప్‌వాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 2100 సార్లు తిరిగేందుకు ఆ జంటకు ఐదు గంటల తొమ్మిది నిమిషాల 30 సెకన్లు పట్టింది. ‘మేం బాల్కనీ మారథాన్‌ను పూర్తి చేశాం’ అని అలిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ దంపతుల 10 ఏళ్ల కుమార్తె జీనా.. రేస్‌ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అంటే..స్టార్ట్‌, స్టాప్‌ సిగ్నల్స్‌ ఇవ్వడంతోపాటు తల్లిదండ్రులకు నీరు, స్నాక్స్‌ అందజేసి వారిని ఉత్సాహపరిచేలా మ్యూజిక్‌ వినిపించిందన్నమాట. ఉత్సాహం ఉన్నవారు మరిన్ని కిలోమీటర్లు కూడా రన్‌ చేయవచ్చని అలిన్‌ సూచించాడు. కరోనా ధాటికి ప్రపంచ క్రీడా రంగం సైతం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఒలింపిక్స్‌ కూడా ఏడాది వాయిదాపడగా..అథ్లెట్లకు ప్రాక్టీస్‌ కరువైంది. లాక్‌డౌన్‌ దరిమిలా.. ప్రజలు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఇండోర్‌లోనే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లోని టులూజ్‌ పట్టణానికి చెందిన 32 ఏళ్ల ఎలీషా నొకోమొవిట్జ్‌ ఏడు మీటర్ల పొడవైన తన బాల్కనీలో మారథాన్‌ నిర్వహించాడు. ఆరు గంటల 48 నిమిషాల్లో అతడు రేస్‌ను పూర్తి చేశాడు.

Updated Date - 2020-03-30T09:55:13+05:30 IST