బల్దియా.. దివాలా!

ABN , First Publish Date - 2021-08-01T08:12:27+05:30 IST

జీహెచ్‌ఎంసీ సాధారణంగా రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, వీది కుక్కల నియంత్రణ, స్పోర్ట్స్‌ ఆడిటోరియంల నిర్మాణం, క్రీడా శిక్షణా శిభిరాల ఏర్పాటు, వరద నీటి ప్రవాహ వ్యవస్థ మెరుగుదల వంటి పనులు చేపడుతుంది.

బల్దియా.. దివాలా!

  • ఖాళీ అయున జీహెచ్‌ఎంసీ ఖజానా.. 
  • రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు
  • ఏటా సంస్థకు వచ్చే ఆదాయం 2500 కోట్లు
  • సంస్థ చేస్తున్న ఖర్చు 3400 కోట్లకు పైనే
  • ఇప్పటికే రూ.4595 కోట్ల రుణభారం
  • మున్ముందు అప్పు పుట్టడమూ కష్టమే
  • వాయిదాల చెల్లింపు కూడా అసాధ్యమే!
  • పెండింగ్‌లో రూ.650 కోట్ల రోడ్ల బిల్లులు
  • క్రమేణా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి
  • ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కరువు
  • వాటాగా రావాల్సినవీ ఇవ్వని సర్కారు
  • ఆదాయం పెంచుకోవడానికీ స్వేచ్ఛ లేదు
  • ఇస్తామన్న అప్పునూ ఆపిన ఎస్‌బీఐ
  • జీహెచ్‌ఎంసీ వాటా ఖర్చు చేస్తేనే మిగతా
  • మొత్తం విడుదల చేస్తామని స్పష్టీకరణ
  • భారీ ప్రాజెక్టుల బాధ్యత వల్లే ఈ పరిస్థితి!
  • అదనపు ఆర్థిక భారంతో సంస్థ కుదేలు


హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఆర్థికంగా దివాలా దిశగా వెళ్తోంది. పెద్ద ఎత్తున ఆదాయ వనరులు ఉన్నా.. అప్పుల్లో కూరుకుపోతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేకపోతోంది. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకే నానా తంటాలు పడుతోంది. కాంట్రాక్టర్లకు చిన్నా, చితకా బిల్లులనూ పెండింగ్‌లో పెట్టి.. రోజువారీ ఆదాయాన్ని 20 రోజులపాటు ఖర్చు చేయకుండా కాపాడుకుంటే తప్ప.. 30 శాతం వేతనాల సొమ్మును సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉంది. సంస్థకు నెలకు రూ.250-270 కోట్ల చొప్పున ఏటా రూ.3000-3240 కోట్లు ఖర్చవుతుంటే.. ఆదాయం మాత్రం రూ.2300-2500 కోట్లే ఉంటోంది. ఏటా రూ.1000 కోట్ల అప్పులు చేయాల్సివస్తోంది.


బల్దియాకు చెప్పుకొనేందుకు రూ.6 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ ఉన్నా.. రూ.60 లక్షల బిల్లులను కూడా సకాలంలో చెల్లించలేని దైన్యం నెలకొంది. మొన్నటి వరకు సాఫీగా సాగిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం, లింక్‌ రోడ్ల పనుల బిల్లులూ గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. రుణాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు.. బల్దియా ఆర్థిక పరిస్థితిని చూసి మిగతా మొత్తం ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. 


జీహెచ్‌ఎంసీ ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి కారణమేంటి? ఏటేటా ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల రుసుము ఆదాయం పెరుగుతున్నా.. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారింది? అంటే.. బల్దియాపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం మోపడంతోపాటు సంస్థ స్వయంకృతాపరాధం, కొందరు అధికారుల అతి కూడా కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


హైదరాబాద్‌ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ సాధారణంగా రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, వీది కుక్కల నియంత్రణ, స్పోర్ట్స్‌ ఆడిటోరియంల నిర్మాణం, క్రీడా శిక్షణా శిభిరాల ఏర్పాటు, వరద నీటి ప్రవాహ వ్యవస్థ మెరుగుదల వంటి పనులు చేపడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఈ సంస్థకు కీలక బాధ్యతలు అప్పగించింది. రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ, రూ.1839 కోట్ల కాంప్రిహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం(సీఆర్‌ఎంపీ), రూ.1500 కోట్లతో చేపడుతున్న లింక్‌ రోడ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీకి కట్టబెట్టింది. కానీ, వీటికి నిధులను మాత్రం ప్రభుత్వం ఇవ్వడంలేదు. వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకోండి.. అంతా మేం చూసుకుంటామని హామీ ఇచ్చింది. వాస్తవానికి గతంలో నగరంలో వంతెనల నిర్మాణ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టేది. భూముల వేలం, ఇతరత్రా మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని ఈ ప్రాజెక్టుల కోసం వినియోగించేవారు. అయితే ఇప్పుడు భూముల వేలం ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా సర్కారే వినియోగించుకుంటోందని చెబుతున్నారు. దీంతో బల్దియాకు ఆదాయం లేక.. ఆర్ధిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తోంది. ఒకప్పుడు ఖర్చులు పోను ఏటా రూ.100-150 కోట్ల మిగులుతో ఉండే సంస్థ.. ఇప్పుడు ఏటా రూ.1000 కోట్ల నష్టంలో కొనసాగుతోంది. దీంతో అప్పులు భారీగా పెరిగిపోయి.. సంస్థ క్రెడిట్‌ రేటింగ్‌ దిగజారుతోంది. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని పరిశీలిస్తే మున్ముందు వాయిదాల చెల్లింపు కూడా కష్టం కావచ్చని సంస్థ ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు తీసుకున్న అప్పులకు వడ్డీయే ప్రస్తుతం రోజుకు రూ.కోటి దాకా చెల్లిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ వడ్డీ రోజుకు రూ.4-5 కోట్లకు పెరిగే అవకాశముందని ఆంటున్నారు. 


వందల కోట్లు పెండింగ్‌... 

గ్రేటర్‌ పరిధిలో గత ఆరు నెలలుగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసా కూడా చెల్లించలేదు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రూ.600-650 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు.. బిల్లులు చెల్లించే వరకు పనులు చేయబోమని ఇటీవల తేల్చి చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనుల బిల్లులు రూ.800 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర పనులకు సంబంధించిన బిల్లుల బకాయి రూ.150 కోట్ల వరకు ఉంది. మంత్రులు, కీలక అధికారులతో సిఫారసు చేయిస్తే తప్ప.. పెండింగ్‌ బిల్లుల్లో కొంత మొత్తం కూడా చెల్లించే పరిస్థితి లేదు. ఇటీవల రూ.3 కోట్లకు సంబంధించిన బిల్లు చెల్లింపునకు కీలక మంత్రి ఫోన్‌ చేసినా.. ఫైల్‌ పక్కన పెట్టారు. ఉద్యోగులకు వేతనాల చెల్లింపు పూర్తయ్యాక ఆగస్టు 10వ తేదీ తరువాత ఆ బిల్లు చెల్లించాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఎండార్స్‌ చేసినట్టు తెలిసింది. ప్రతి నెలా 10 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే.. అది కూడా రూ.15-16 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారు.  


రుణం నిలిపివేసిన ఎస్‌బీఐ... 

ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ పనుల్ని రూ.6 వేల కోట్లతో నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ఆదేశాలతో వివిధ సంస్థల నుంచి జీహెచ్‌ఎంసీ రుణం తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల ద్వారా రూ.495 కోట్లు తీసుకోగా, రూపీ టర్మ్‌లో భాగంగా రూ.2500 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.1100 కోట్లను ఎస్‌బీఐ ఇప్పటికే ఇచ్చింది. మొత్తంగా ఎస్‌ఆర్‌డీపీ కోసం ఇప్పటివరకు రూ.1700 కోట్ల వరకు ఖర్చు చేశారు. అయితే ఎస్‌బీఐ కొంతకాలంగా తదుపరి మొత్తాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగా ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 40 శాతాన్ని జీహెచ్‌ఎంసీ భరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు పైసా కూడా వెచ్చించలేదు. దీంతో మీ వాటా నిధులు ఖర్చు చేశాకే తదుపరి రుణం విడుదల చేస్తామంటూ ఎస్‌బీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో గత రెండు నెలలుగా ఎస్‌ఆర్‌డీపీకి సంబంధించి రూ.70 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. లింక్‌ రోడ్ల కోసం ఇదే రుణం నుంచి రూ.223 కోట్లు ఖర్చు చేశారు. వివిధ ప్రాజెక్టుల కోసం సంస్థ రూ.4595 కోట్ల అప్పులు చేసింది. 


పైసా ఇవ్వని ప్రభుత్వం.. 

రూ.వేల కోట్లతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల బాధ్యతల్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించిన ప్రభుత్వం.. నిధులు మాత్రం పైసా కూడా విడుదల చేయడంలేదు. వృత్తి పన్ను, వినోదపు పన్ను, మోటారు వాహనాల పన్నులో వాటాగా రావాల్సిన మొత్తంతోపాటు ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను వంటివి సైతం ఇవ్వడం లేదు. నగరంలోని వివిధ విభాగాల రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచి ఏటా రూ.120 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉండగా.. 2015 నుంచి పైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. వడ్డీతో కలిసి ఈ మొత్తం ఇప్పటికే రూ.1150 కోట్లకు చేరింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ భవనాల నుంచి రూ.200 కోట్ల వరకు బకాయి పేరుకుపోయింది. 2014-15 నుంచి వివిధ ప్రాజెక్టులు, పనుల కోసం రూ.10 వేల కోట్లకుపైగా ప్రతిపాదనల్ని జీహెచ్‌ఎంసీ పంపగా.. సర్కారు రూ.1992 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులోనూ కేవలం రూ.365 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2016-17 నుంచి జీహెచ్‌ఎంసీకి నిధుల విడుదల దాదాపుగా లేదు. 2017-18లో రూ.9.33 కోట్లు, 2018-19లో రూ.30 లక్షలు మాత్రమే ఇచ్చింది. పైగా ఆదాయ వనరులను మెరుగుపరచుకునే స్వేచ్ఛను కూడా జీహెచ్‌ఎంసీకి ఇవ్వడంలేదు.  రాజకీయ ప్రయోజనాలు, ఇతర అంశాలను బేరీజు వేసుకుంటున్న పాలకులు రాయితీలు ప్రకటిస్తూ.. సంస్థ ఆదాయానికి మరింత గండి కొడుతున్నారు. నగరంలో 16.80 లక్షల ఆస్తిపన్ను చెల్లింపుదారులుండగా.. ఇందులో 50 శాతం భవనాల మదింపులో వ్యత్యాసాలు ఉంటాయని అంచనా. 


పట్టణ ప్రగతి నిధులతో ఊరట..

జీహెచ్‌ఎంసీకి చెల్లించకపోయినా.. పట్టణ ప్రగతిలో భాగంగా మాత్రం ప్రభుత్వం ప్రతి నెలా రూ.78 కోట్లు ఇస్తోంది. ఏడాది కాలంగా ఈ నిధులు అందుతుండడం బల్దియాకు కాస్త ఊరటనిస్తోంది. వీటికి జీహెచ్‌ఎంసీ మరో రూ.32 కోట్లు కలిపి వేతనాలు, పెన్షన్‌లను చెల్లిస్తోంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఆమోదిస్తున్న బడ్జెట్‌కు, వాస్తవ ఖర్చుకు పొంతన ఉండడం లేదు. వివిధ రకాల వనరుల ద్వారా సమకూరే ఆదాయాన్ని బడ్డెట్‌లో చూపిస్తూ.. ప్రతిపాదిత పద్దులో 50-55 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు.


ఆగని దుబారా...

ఖజానాలో కాసులు లేకున్నా.. జీహెచ్‌ఎంసీ దుబారా ఆగడంలేదు. ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల ఆధునికీకరణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. కేంద్ర కార్యాలయంలో విభాగాధిపతుల చాంబర్ల ఆధునికీకరణకు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారు. బుద్ధ భవన్‌లోని రెండు అంతస్తుల్లో ఉన్న ఈవీడీఎం విభాగం కోసం రూ.3 కోట్లకుపైగా ఖర్చయ్యాయని ఓ అధికారి చెప్పారు. మరోవైపు డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారులకు ఉండే వాహన సదుపాయాన్ని అసిస్టెంట్‌ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకూ కల్పించారు. వాహనాల అద్దెకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. 


సోమేశ్‌ సమాచారం వల్లే!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పని చేసిన 2015 నాటికి సంస్థలో మిగులు నిధులు(ఎ్‌ఫడీలతో కలిపి) రూ.800 కోట్ల వరకు ఉండేవి. అయితే సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న సోమేశ్‌.. బల్దియాలో మిగులు ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ నుంచి ఏటా నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ రెండు దఫాలుగా రూ.340 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది. అదే సమయంలో ఎస్‌ఆర్‌డీపీ మొదటి విడత పనులు ప్రారంభించారు. దీంతో ఆ తరువాత ఆర్టీసీకి నిధులివ్వడం నిలిచిపోయింది. మిగులు నిధుల నుంచి పలు దఫాలుగా రూ.450 కోట్లు ఎస్‌ఆర్‌డీపీ కోసం సంస్థ ఖర్చు చేసింది. ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల కోసం రూ.45 కోట్లు, స్వచ్ఛ ట్రాలీల కోసం మరికొంత మొత్తాన్ని వెచ్చించారు. దీంతో సంస్థ ఖజానాలో ఉన్న డబ్బులతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లూ కరిగిపోయాయి.


బల్దియా ఆదాయ, వ్యయ వివరాలివీ

ఏటా సంస్థ ఆదాయం రూ.2300-2500 కోట్లు

ఆస్తిపన్ను వసూళ్లు- రూ.1300-1400 కోట్లు

భవన నిర్మాణ అనుమతుల ద్వారా - రూ.700-800 కోట్లు

ట్రేడ్‌ లైసెన్స్‌ ఆదాయం -రూ.50 కోట్లు

చేస్తున్న ఖర్చు -రూ.3000 కోట్లు

2021-22 బడ్జెట్‌ -రూ.6841 కోట్లు (అప్పులు, గ్రాంట్లు కూడా కలుపుకొని)


ప్రాజెక్టులు.. అప్పులు...

ఎస్‌ఆర్‌డీపీ అంచనా వ్యయం 29000 కోట్లు

ప్రారంభమైన పనులు - రూ.6000 కోట్లు

చెల్లించిన బిల్లులు - రూ.1691 కోట్లు

బాండ్ల ద్వారా రుణం- రూ.495 కోట్లు 

రూపీ టర్మ్‌లోన్‌ - రూ.2500 కోట్లు 

సీఆర్‌ఎంపీ - రూ.1839 కోట్లు

ఎస్‌బీఐ నుంచి రుణం - రూ.1460 కోట్లు 

చెల్లించిన బిల్లులు - రూ.450 కోట్లు

లింక్‌ రోడ్లు - రూ.1500 కోట్లు

చెల్లించిన బిల్లులు - రూ.223 కోట్లు

హడ్కో రుణం - రూ.140 కోట్లు


పెండింగ్‌ బిల్లులు..

రోడ్ల నిర్మాణం, నిర్వహణ- 600-700 కోట్లు

ఎస్‌ఆర్‌డీపీ - రూ.70 కోట్లు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు - రూ.800 కోట్లు

ఇతరత్రా బిల్లులు - రూ.100 కోట్లు

Updated Date - 2021-08-01T08:12:27+05:30 IST