బాలింత మృతి

ABN , First Publish Date - 2021-12-04T03:29:38+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో గురువారం రాత్రి పట్టణానికి చెం దిన రెహానా సుల్తానా (32)కు పురుడు పోయగా, శుక్రవారం వేకువ జామున సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

బాలింత మృతి
ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు

-డాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన 

-304ఎ సెక్షన్‌ కింద డాక్టర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

కాగజ్‌నగర్‌, డిసెం బరు 3: కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో గురువారం రాత్రి పట్టణానికి చెం దిన రెహానా సుల్తానా (32)కు పురుడు పోయగా, శుక్రవారం వేకువ జామున సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. దీంతో తమకు న్యాయం కావాలని కోరుతూ శుక్రవారం కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన మహిళకు డాక్టర్‌ జ్యోతి పురుడు పోసిందని అన్నారు. ఆడశిశువుకు జన్మనివ్వగా తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్టు పేర్కొందన్నారు. ఉదయం పూటనే సీటీస్కానింగ్‌కు అవ సరం ఉందని పంపించారని ఆ తర్వాతనే పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్‌ జ్యోతి సూచించినట్టు తెలిపారు. తాము అఘామేఘాల మీద మంచిర్యాలకు తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందినట్టు పేర్కొన్నారు. ప్రధానంగా నిండు బాలింతను పై అంతస్తు నుంచి కిందకు దుప్పట్లో తీసుకవచ్చే క్రమంలో పడిపోయిందని కుటుంబీకులు వాపోయారు. ఈ ఆస్పత్రిలో కనీస వసతులు లేవని పేర్కొన్నారు.  కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైపోయిందని వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. డీఎస్పీ కరుణాకర్‌, డీఎంహెచ్‌వో వచ్చి సమగ్ర విచారణ జరపాలని, డాక్టర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. డీఎస్పీ కరుణాకర్‌, సీఐ రవీందర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. బాధితులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్‌ జ్యోతిపై 304ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనను విరమించారు. ఈ విషయమై డాక్టర్‌ జ్యోతిని వివరణ కోరగా పురుడు పోసిన సమయంలో బాగానే ఉందని, ఆ తర్వాత బీపీ ఒక్క సారి 200/130 పెరిగిందని అన్నారు. దీంతో సీటీ స్కాన్‌కు పంపించామని అన్నారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇందులో తన నిరక్ష్యం ఏ మాత్రం లేదన్నారు. బాధితురాలికి న్యాయం కోసం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ముబీన్‌, కార్యకర్తలు, పట్టణంలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ విష యమై సీఐ రవీందర్‌ను వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్‌ జ్యోతిపై 304ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.

Updated Date - 2021-12-04T03:29:38+05:30 IST