Abn logo
Sep 24 2021 @ 01:49AM

సినీ సంగీత చరిత్రలో బాలు జీవితం ఓ మైలురాయి

  • ఆయన ఉచ్ఛారణ ఎంతో ఆనందాన్నిచ్చేది
  •  సంస్కారాన్ని పిల్లల్లో నాటారు
  • విశ్వగాన గంధర్వ అంతర్జాతీయ సంగీత సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఎంత ఎదిగినా ఒదిగేతత్వం, వినమత్ర ఆదర్శనీయం.. తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని,  ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో ఓ భాగంగా మారిపోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన స్వభావం తననెంతో ఆకట్టుకునేదని, ఆయనలోని వినమత్ర ఆదర్శనీయమని పేర్కొన్నారు. పిల్లలకు సంగీతంలో మెళకువలను నేర్పిస్తూ, వారి ప్రతిభకు సానపెడుతూ, వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన బాలు కృషిని తెలుగు జాతి, సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.


భారతీయ సంస్కృతిలో భాగమైన సంస్కారాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలని, పిల్లల్లో సంస్కార బీజాలను నాటేందుకు బాలు ప్రయత్నించారని చెప్పారు. ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలు, భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని 110 తెలుగు అసోసియేషన్ల  ఆధ్వర్యంలో గురువారం ‘విశ్వగాన గంధర్వ - 2021’ అంతర్జాతీయ సంగీత సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా వెంకయ్య ప్రసంగించారు. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపురూపమైనదని, గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా తన బహుముఖప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారని కొనియాడారు. 


గాయకుడిగా జన్మనిచ్చిన ఎస్పీ కోదండపాణి పేరిట రికార్డింగ్‌ థియేటర్‌ నెలకొల్పి, హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి, కేజే ఏసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాని చాటిన సంస్కారం బాలు సొంతమని కొనియాడారు. ఆయన తెలుగు ఉచ్ఛారణ ఎంతో ఆనందాన్నిచ్చేదని, మన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడమే బాలుకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.


బాలు కేవలం ఓ గాయకుడు మాత్రమే కాదని, గతానికి, ఆయన్ను భవిష్యత్తుకు మధ్య వర్తమాన స్వరాల సారఽథిగా, సంస్కార వారఽథిగా ఆయన్ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. కాగా ఎస్పీ బాలుపై ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని వెంకయ్య విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని కేౖలాశ్‌ ఖేర్‌ ఆలపించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు తనికెళ్ళ భరణి తదితరులు పాల్గొన్నారు.