Abn logo
Aug 30 2020 @ 00:12AM

ఈ యుగ గాయకుడు బాలు!

Kaakateeya

బాలుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగీత దర్శకుల్లో కోటి ఒకరు. బాలుతో తనకున్న అనుభవాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు. 


బాలు త్వరగా కోలుకోవాలని మీరు పూజలు చేయించారని తెలిసింది..

ఆయన ఆస్పత్రిలో చేరి.. క్రిటికల్‌ అని వార్తలొచ్చినప్పటి నుంచి నాకు మనసులో అదోలా ఉంది. కాశీ, మూగాంబిక, ధర్మస్థల, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు ఆయన వివరాలు పంపి పూజలు చేయించా. మా ఇంట్లో ఆయన పేరు మీద హోమం, అభిషేకం చేయించా. పూజలు చేయించా. నాకు తెలిసిన పండితులతో ఆశీర్వచనలు ఇప్పించా. మొన్న ఒక జ్యోతిషుడు ‘ఆయనకు రెండు గ్రహాలు బాలేవు. అందుకే, క్రిటికల్‌గా ఉంది. కేతువు-రవికి జపాలు చేయించాలి’ అన్నారు. గ్రహదోషాలకు జపాలు చేయించా. పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేయడం లేదు. ఇప్పటి దాకా ఎవరికీ చెప్పలేదు కూడా! ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నవారెందరో! అందరి ప్రార్థనలు ఫలించి ప్రమాదం నుంచి బయటపడతారనే నమ్మకం నాకుంది. 


సంగీత దర్శకుడిగా బాలును మీరు కష్టపెట్టిన సందర్భాలేమైనా ఉన్నాయా?

ఏ పాటనైనా పాడగల గాత్రం ఆయనది. చిరంజీవిగారి నూరో చిత్రం ‘త్రినేత్రుడు’ సినిమాలో  ‘పాప్పా.. ఓ పాప్పా’ అంటూ వెస్ట్రన్‌ బీట్‌తో సాంగ్‌ కంపోజ్‌ చేశాం. సాధారణ గాయకుడికి హై రేంజ్‌లో ఆ పాట పాడడం కష్టమే. బాలుగారికి కూడా మొదట పట్టు దొరకలేదు. కాసేపు సాధన చేసి, అద్భుతంగా పాడారు. ఎలాంటి పాట అయినా నేర్చుకుని పాడేవారు. పాట నేర్చుకున్న తర్వాత వాయిస్‌ రూమ్‌లోంచి మమ్మలందరినీ బయటకు వెళ్లిపోమ్మనేవారు. పది పదిహేను నిముషాలు ఆయన్ని ఒంటరిగా వదిలేస్తే పక్కాగా రెడీ అయి మైక్‌ దగ్గరకు వచ్చేవారు. కొన్ని వేల కచేరీలలో హిందీ, తమిళ, తెలుగు పాటలు పాడిన అనుభవం ఆయనది. అందుకే ఏ పాటను ఎలా పాడాలో ఆయనకు తెలుసు. ఒక దశలో ఆలిండియా రేడియోలో ఏ భాషలో విన్నా ఆయన పాటలే వినిపించేవి. అందుకే కొందరు సరదాగా-  ‘ఆలిండియా రేడియో కాదు.. బాలిండియా రేడియో’ అనేవారు. ఆ మాట విన్న వెంటనే ఆయనకు కోపం వచ్చేది  కానీ అది క్షణిక కాలమే. ఆ తర్వాత చిన్నపిల్లాడిలా సిగ్గు పడుతూ నవ్వేసేవారు.  బాలు బహుముఖ గాయకుడే కాదు.. ఈ యుగ గాయకుడు కూడా! 


వ్యక్తిగతంగా... సంగీత పరంగా... బాలుగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి? 

ఓర్పు.. సహనం.. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం.. నెమ్మదిగా మాట్లాడటం... ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. మొదట్లో మేము చాలా హడావిడిగా.. స్పీడుగా ఉండేవాళ్లం. నెమ్మదితనం నేర్పింది ఆయనే! నా కెరీర్‌లో మొదటి పాట పాడింది ఆయనే.  అది ఆర్కెస్ట్రాతో కలసి పాడాల్సిన పాట. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ  మధ్యాహ్నం 12.45కి  స్టూడియోకు వచ్చి  ట్యూన్‌ నేర్చుకుని 2..30కి రికార్డింగ్‌ పూర్తి చేశారు. కోదండపాణి స్టూడియోలో నా కంపోజింగ్‌ రూమ్‌ పూజకు వచ్చి..  నా పక్కన కిందే కూర్చుని నా  కుడికాలుని ఆయన చేత్తో తట్టి ‘నువ్వు ఇక్కడ చక్రం తిప్పు కోటి! నీకు అన్నీ కలిసొస్తాయి. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది’ అని మనస్ఫూర్తిగా  ఆశీర్వదించారు. అప్పుడు ఒకేసారి ఐదారు సినిమాలకు పని చేసేవాణ్ణి.  చాలా బిజీగా ఉండేవాణ్ణి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలుగారు నాకు ఓ బ్రదర్‌లా సపోర్ట్‌ చేశారు.  


హీరో కృష్ణ, బాలు మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు వాళ్లిద్దరిని కలపడానికి ప్రయత్నించిన కీలక వ్యక్తి మీరు. ఆ ప్రయత్నం ఎందుకు చేశారు?

కృష్ణగారు భోళా మనిషి.  ఏదీ మనసులో పెట్టుకోరు. అలాగే బాలుగారు మంచి మనిషి. వాళ్లిద్దరి మధ్య చిన్న విభేదం వచ్చింది. దాంతో కృష్ణగారు రాజాసీతారాం చేత పాడించేవారు. మేం కూడా రాజా సీతారాం చేత నా పిలుపే ప్రభంజనం సినిమాలో పాడించాం. కానీ ఆయన వాయిస్‌ కృష్ణ గారికి సూట్‌ అయ్యేది కాదు. ఆ తర్వాత రౌడి నెంబర్‌ 1 సినిమాకు అవకాశం వచ్చింది. పాటలన్నీ బాలుగారే పాడితే బావుండునని మాకు అనిపించింది. బాలు గారి దగ్గరకు వెళ్లి పాడమని అడిగాం. ‘నాకేం లేదయ్యా. నేనేం మనసులో పెట్టుకోను’ అని ఆయన కూల్‌గా చెప్పారు. వేటూరిగారి దగ్గరకు వెళ్లాం. ఆయన కూడా ‘బాలు పాడితే బావుంటుందయ్యా’ అన్నారు. వేటూరిగారి అభిప్రాయాన్ని కృష్ణగారికి చెప్పాం. ఆయన ‘నేను ఏం అనుకోను. రమ్మను. సమస్యేం లేదు’ అన్నారు. కృష్ణగారి దగ్గరకు బాలును తీసుకువెళ్లాలనుకున్నాం. ఆయన అంగీకరించారు. పద్మాలయా స్టూడియో ఆఫీసులో వారిద్దరూ కలిసారు. కృష్ణగారు ఆయనను చూసిన వెంటనే-  ‘బాలూ! ఎలా ఉన్నావ్‌’ అని పలకరించారు. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మేం ‘హమ్మయ్యా’ అనుకున్నాం. కథ సుఖాంతమయింది. 


యువగాయకులు బాలు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి?

సంగీతపరంగా ఆయన ఒక మేరు శిఖరం. అంతకన్నా ముఖ్యంగా-  మనిషి ఎలా నడుచుకోవాలి? భాషను ఎంత గౌరవించాలి? అనేవి ఆయనను చూస్తే తెలుస్తుంది. తెలుగెంత అందంగా మాట్లాడతారో.. కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌.. అన్ని భాషలు అంతే అందంగా మాట్లాడతారు. అంత బహుముఖ ప్రజ్ఞాశాలైనా- ఎంతో వినయంగా ఉంటారు. సింపుల్‌గా కనిపిస్తారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమే ఆయన గొప్పతనం. 


చెన్నైలో ‘పాడుతా తీయగా’ ఫైనల్స్‌ జరుగుతున్నప్పుడు ‘ఒరేయ్‌ నాన్నగారిని ఒకసారి తీసుకురా’ అని వాసు అన్నయ్యను బాలు అడిగారట. అప్పటికే నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దన్నాం. కానీ అన్నయ్య మమల్ని ఒప్పించి ఆయనను ఆ కార్యక్రమానికి తీసుకువెళ్లాడు. నాన్నతో నేను వెళ్లా. ఆ రోజు బాలు నాన్నపై చూపించిన ప్రేమను ఇప్పటికీ మరిచిపోలేను. సాలూరు రాజేశ్వరరావు అంటే ఏమిటో ఆ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు బాలు. అంతేకాదు బాలు చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ నాన్న ప్రస్తావన ఎక్కడో ఒకచోట ఉంటుంది. నాన్నగారికి కూడా బాలు అంటే ఎంతో ఇష్టం.

- వినాయకరావు 

ఇవి కూడా చదవండిImage Caption

పాడుతూ ఉండాలి తియ్యగా...బాలూ అంటే.. ఎందుకింత అభిమానం?

Advertisement
Advertisement