Sep 25 2021 @ 12:33PM

ఆ సింగర్స్ అంతా ‘బాలు’ పాఠశాల నుంచి వచ్చిన వాళ్లే..

దశాబ్దాలుగా స్వరరాగ గంగా ప్రవాహంలో సంగీత ప్రియులను తన్మయత్వంలో ఓలలాడించిన బాలు, తన సుస్వరాల తోటలో ఎన్నో కమ్మని గొంతులను విరబూయించారు. చిట్టి పాదాలతో అడుగులు వేసేందుకు ప్రయత్నించే బుడుగును వేలు పట్టుకొని నడిపించినట్లు.. అప్పుడే మొలకెత్తిన విత్తుకు పాదుకట్టి నీరు పోసి.. మొక్కయి శాఖలుగా విస్తరించేలా చేసినట్లు ఎందరో యువగాయకులకు ఆయన ఊతమయ్యారు. బంగారానికి సాన పెడితేనే మెరుపు వచ్చినట్లు.. ఔత్సాహిక గాయనీ గాయకులకు చిత్ర సీమలో వెలుగొందేందుకు కావాల్సిన జిలుగులు అద్దారు. పాటల పోటీ అంటే ప్రథమ, ద్వితీయ బహుమతులు కాదు.. సినీ ప్రపంచంలోకి ఘనమైన స్వాగతం లభించేలా బంగారు బాటలు పరిచారు.


ప్రయోక్త, న్యాయ నిర్ణేతగా మాత్రమే కాకుండా ఓ మార్గదర్శిగా.. శ్రేయోభిలాషిగా 1996 నుంచి ఆయన నిరంతరాయంగా కృషి చేశారు. స్వర సేద్యంలో చిగురులు తొడిగిన గొంతులెన్నో ఇప్పుడు సినీ తోటలో మంచి మంచి పాటలతో గుబాళిస్తున్నాయి. బాలు స్కూల్‌ అయిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సక్సెస్‌ అయ్యారు. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. వీరిలో నంది అవార్డులు అందుకున్న ఉష, గోపికా పూర్ణిమ.. వందకు పైగా పాటలు పాడిన పార్థసారథి, మల్లికార్జున్‌, అంజనా సౌమ్య సహా ఎంతో మంది గాయకులు ఉన్నారు.

24 ఏళ్ల క్రితం పాడుతా తీయగా మొట్టమొదటి సిరీస్‌ ద్వారానే ఉషను, పార్థసారథిని సినీ ప్రపంచానికి అందించారు బాలు. తొలి సిరీ్‌సలో రన్నర్‌పగా నిలిచిన కె.రామాచారి, ప్రస్తుతం సంగీత పాఠశాల ద్వారా ఎంతో మంది పిల్లలకు శిక్షణనిస్తున్నారు. గాయకులుగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాళవిక, కారుణ్య కూడా పాడుతా తీయగా విజేతలే!