కలిసొచ్చిన ‘కర్పూర’

ABN , First Publish Date - 2021-10-27T06:47:24+05:30 IST

అరటి ఉత్పత్తులకు డిమాండు పెరుగుతోంది. ఉత్పత్తులు డిమాండుకు తగ్గట్టుగా లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమ య్యాయి.

కలిసొచ్చిన ‘కర్పూర’
రావులపాలెంలో అరటి మార్కెట్‌

కర్పూర అరటికి అనూహ్యమైన డిమాండు

కానీ జిల్లాలో తగ్గుతున్న అరటి ఉత్పత్తులు

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేస్తున్న వ్యాపారులు 

వరదలు, వర్షాలతో సాగుకు దూరంగా రైతులు

కార్తీక మాసంలో మరింత పెరగనున్న ధరలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

అరటి ఉత్పత్తులకు డిమాండు పెరుగుతోంది. ఉత్పత్తులు డిమాండుకు తగ్గట్టుగా లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమ య్యాయి. ఇటీవలకాలంలో సంభవించిన వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు, గోదావరికి పలుమార్లు వరదలు వంటి విపత్తుల కారణంగా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలి తంగా దిగుబడులు తగ్గాయి. దీనికితోడు పండుగలు, వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు తద్దెలు వంటి వరుస వేడుకల వల్ల ముఖ్యంగా కర్పూర అరటి గెలలకు అనూ హ్యమైన డిమాండు ఏర్పడింది. బహిరంగ విపణిలో కర్పూర అరటి రకం డజను రూ.40 నుంచి రూ.50 ధర పలకడాన్ని బట్టి వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండు ప్రస్ఫుటమవుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ అరటి మార్కెట్లలో గతంకంటే దిగు బడులు తగ్గాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనే అతిపెద్ద అరటి మార్కెట్‌ అయిన రావులపాలెం, అంబాజీపేట, ఏలేశ్వరం, తుని వంటి మార్కెట్ల నుంచి అరటి గెలలు వివిధ రాష్ర్టాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే కర్పూరకు డిమాండు పెరగ డంతో నాణ్యమైన సరుకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోందని అరటి వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులోని మద్రాసు నుంచి కర్పూర రకం మన ప్రాంతానికి భారీగా దిగుమతి అవుతోంది. ప్రస్తుతం కర్పూర రకం గెల రూ.250 నుంచి రూ.350 మధ్య నాణ్యతను బట్టి ధర పలుకుతోంది. గతంలో రూ.100 నుంచి రూ.200 ఉండేది. జిల్లాలో ఉత్పత్తి అయ్యే కర్పూర రకం నాణ్యత లేకపోవడంతో ఇతర రాష్ర్టా ల నుంచే కర్పూర గెలలను దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కార్తీకమాసంలో మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుపు చక్రకేళీ గతంలో రూ.150 నుంచి రూ.250 వరకు ఉండే ధర స్వల్పంగా తగ్గి రూ.150 నుంచి రూ.225 మధ్య ధర పలుకుతోంది. ఎర్ర చక్రకేళీ రూ.180 నుంచి రూ.200 ఉండేది. ఇప్పుడు అదే ధర పలుకుతోంది. అమృతపాణి రకానికి డిమాండు పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గడం వల్ల ధరల పెరుగుదల ఆశాజన కంగా ఉన్నాయి. గతంలో రూ.200 వరకు పలికే అమృతపాణి గెల ధర ఇప్పుడు రూ.300 వరకు పలుకుతోంది. రావులపాలెం మార్కెట్‌ నుంచి ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అరటి ఉత్పత్తులు ముఖ్యంగా ఒడిశా, భువనేశ్వర్‌, కటక్‌, తెలంగాణాతోపాటు తమిళనాడు రాష్ర్టా నికి ఎగుమతి అవుతున్నాయి. కర్పూర రకం గెలలు తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల అరటి పంటలు దెబ్బతినడంతో పాటు పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం వల్ల కొబ్బరి తోటల్లో అం తర పంటగా అరటి సాగుచేసే విధానానికి ఫుల్‌స్టాప్‌ పడింది. దాంతో అరటి ఉత్పత్తులు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.



Updated Date - 2021-10-27T06:47:24+05:30 IST