విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు

ABN , First Publish Date - 2021-03-06T06:41:39+05:30 IST

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు

ఆటోనగర్‌, మార్చి 5 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన  రాష్ట్రబంద్‌లో భాగంగా జవహర్‌ ఆటోనగర్‌లో బంద్‌ శుక్ర వారం విజయవంతమైంది.  రాష్ట్ర చిన్న పరిశ్రమల సంఘం, ఇండస్ట్రీ యల్‌ ఎస్టేట్‌ మాన్యుఫ్యాక్చర్స్‌ సంఘం, జేఆర్డీ టాటా ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని వివిధ సంఘాలు నిరసన ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్‌, రాష్ట్ర చిన్న పరిశ్రమల సంఘం గౌరవాధ్యక్షుడు బామన వెంకట్రావ్‌, అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, జేఆర్డీ ఐలా చైర్మన్‌ టి.వినోద్‌బాబు, ఆటో ఎలక్ర్టికల్‌ సంఘం అధ్యక్షుడు అబ్దుల్‌ కలాం  పాల్గొన్నారు.

విజయవాడ రూరల్‌ మండలంలో..

ఫ విజయవాడ రూరల్‌ : విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ రూరల్‌ మండలంలో రాష్ట్ర బంద్‌ శుక్రవారం విజయవంతమైంది. మండలంలోని ప్రధాన గ్రామాలలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నున్నలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వామపక్ష, తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రధాన రహదారులపై నిర్వహించిన ప్రదర్శనలో నినాదాలు చేశారు.     

బాపులపాడు మండలంలో..

హనుమాన్‌జంక్షన్‌  : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  శుక్ర వారం విశాఖ ఉక్కు పరిరక్షణ  రాష్ట్ర వ్యాప్త బంద్‌ పిలుపులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బంద్‌ విజయ వంతమైంది. టీడీపీ, సీపీఎం, వైసీపీ, సీఐటీయూ ఇతర కార్మిక సంఘా లు బంద్‌ను నిర్వహించాయి. హనుమాన్‌ జంక్షన్‌లోని నాలుగు రోడ్ల కూడలిలో మోటారు సైకిల్‌ ర్యాలీలు, రాస్తారోకోలు జరిపారు. వర్తక, వ్యాపార సంస్థలు, పాఠశాలలు,  కాలేజిలు, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి.  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వై.నరసింహారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు  ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.  టీడీపీ బాపుల పాడు మండల అధ్యక్ష, కార్యదర్శులు దయాల రాజేశ్వరరావు,  పుట్టా సురేష్‌, తెలుగు రైతు మండల అధ్యక్షులు  మొవ్వా  వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా నేత  మూల్పూరి  సాయికళ్యాణి తదితరులు పాల్గొన్నారు. 

ఫ హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ :  రాష్ట్ర బంద్‌కు మద్దతుగా శుక్ర వారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మండలంలో  ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

పెనమలూరులో..

పెనమలూరు  : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం పెనమలూరులో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ప్రజా నాట్యమండలి తదితర సంఘాల నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, బ్యాంకులు, హోటల్స్‌ను మూసివేయించారు. కార్యక్రమంలో ఏపీ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమరయ్య శాస్ర్తి, ప్రజా నాట్యమండలి తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాసీం,  తాడంకి నరేష్‌, పుసులూరి పాతాళ లక్ష్మి,  భవానీ,  శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.   

ఉయ్యూరులో..

ఉయ్యూరు : నగర పంచాయతీ పరిధిలో బంద్‌ విజయవంతమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణ సమితి, పలు  రాజకీయ పార్టీల రాష్ట్రవ్యాప్తబంద్‌  పిలుపు మేరకు శుక్రవారం ఉయ్యూ రులో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి మధ్యాహ్నం వరకు బస్సులు బయటకు రాలేదు. బ్యాంకులు, విద్యా, వ్యాపారసంస్థలు, బంద్‌ పాటించాయి. మండల సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. కోసూరి శివనాగేంద్రం, కొండలు, కే వైకె రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఐ నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. 

కంకిపాడులో..

కంకిపాడు :విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పంచకర్ల రంగారావు డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుదిమళ్ల రవీంద్ర, కొండా నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు జి. కుమారి, ఏ ఉషారాణి, సీపీఐ నాయకులు మెరుగ విజయ్‌ కుమార్‌, బండి ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

ఉంగుటూరులో..

ఉంగుటూరు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ,సీపీఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన  బంద్‌ ఉంగుటూరు మండలంలో విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు ఉంగుటూరు, తేలప్రోలు, పొట్టిపాడు, మానికొండ. నందమూరు. ఇందుపల్లి తదితర గ్రామాలలో టీడీపీ, సీపీఎం. ప్రజాసంఘాల నేతలు రోడ్లపైకి చేరి విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. 

యువజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో.. 

రామలింగేశ్వరనగర్‌  : కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ బడా బాబులకు దోచిపెట్టేందుకు కేంద్రం ప్రైవేటీకకరణను తెరపైకి తెచ్చిందని యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బెజవాడ నజీర్‌ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో యువజన చైతన్య వేదిక సభ్యులు శుక్రవారం ఇనుము గోడౌన్‌లలో ముఠా పని చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటా అయ్యప్ప, బలివాడ గోవింద్‌, దన్నాన రాము, సాయి, సతీష్‌, ఎర్రంశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T06:41:39+05:30 IST