Abn logo
Sep 28 2021 @ 00:05AM

బంద్‌ ప్రశాంతం

  1. మూతపడిన వాణిజ్య సముదాయాలు
  2. ఆర్టీసీ డిపో ఎదుట వామపక్షాల ధర్నా
  3. పాలన చేతగాకుంటే గద్దె దిగిపో
  4. ప్రధాని మోదీకి వామపక్షాల అల్టిమేటం


కర్నూలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి)/న్యూసిటీ: కిసాన్‌ మోర్చా, దేశ వ్యాప్త కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, దేశీయ విదేశీ కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని వామపక్షాలు, టీడీపీ, వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఉదయం నుంచే బంద్‌ ప్రభావం జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల నాయకులు బైఠాయించారు. ఆటో యూనియన్లు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం తర్వాత బస్సులు యథాతథంగా తిరిగాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. నంద్యాలలో టీడీపీ, సీపీఎం నాయకులు దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆదోనిలో నిరుద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ, రైతు సంఘాలు బంద్‌ చేపట్టాయి. బనగానపల్లెలో పెట్రోల్‌బంక్‌ కూడలి వద్ద సీఐటీయూ, ఏపీటీఎఫ్‌, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డోన్‌లో తెల్లవారుజాము నుంచే అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు హోటళ్లు, వ్యాపార సముదాయాలను బంద్‌ చేయించారు. 4వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించారు. నందికొట్కూరులో  సీపీఐ నాయకులు మెడలో కూరగాయలు వేసుకుని.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ స్టవ్‌ నెత్తిన పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.


కర్నూలులో..


పరిపాలన చేతగాకపోతే ప్రధాని పదవి నుంచి మోదీ గద్దె దిగాలని వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాల నాయకులు అన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు భారత్‌ బంద్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 


సీపీఎం ఆధ్వర్యంలో పూల బజార్‌, కొత్త బస్టాండు నుంచి రెండు భారీ ప్రదర్శనలు జిల్లా పరిషత్‌ వరకు చేరుకున్నాయి. అక్కడి నుంచి అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు, వామపక్షాలు ఉమ్మడిగా భారీ ప్రదర్శనతో కలెక్టరేట్‌ వరకు వెళ్లారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశాయ్‌ ప్రసంగించారు. మోదీ అధికారంలోకి వచ్చాక, ఏడేళ్లుగా ఏటా ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా బంద్‌లు, సమ్మెలు నిర్వహిస్తున్నారని అన్నారు. 


 ప్రధాని మోదీ పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. మోదీ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని రక్షించుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్ప వేరే మార్గం లేదని, అలాంటి పోరాటాలకు ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


బంద్‌లో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకుడు నరసింహులు, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు మహ్మద్‌ రఫి, బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల నాయకులు నాగరాజు, విద్యుత్‌ ఉద్యోగుల సంఘం నాయకులు క్రిష్ణయ్య, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంఘం మహేష్‌, భాస్కర్‌ రెడ్డి, యూటీఎఫ్‌ నాయకులు సుధాకర్‌, డీటీఎఫ్‌ నాయకులు తిప్పన్న, ఏపీటీఎఫ్‌ నాయకులు హృదయరాజు, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు రఘుబాబు, సునీయ కుమార్‌, డిజే ప్రసాద్‌, చిన్నరామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం


కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 27: బంద్‌ ప్రభావంతో కర్నూలు రీజియన్‌ వ్యాప్తంగా ఆర్టీసీకి రూ.50లక్షల ఆదాయం కోల్పోయిందని రీజనల్‌ మేనేజర్‌ టి.వెంకటరామం తెలిపారు. అన్నిడిపోల నుంచి రోజూ సరాసరి రూ.90లక్షల ఆదాయం వచ్చేదన్నారు. సాయంత్రం 5గంటలకు 749 సర్వీసులు తిరగాల్సి ఉండగా సోమవారం 282 సర్వీసులు మాత్రమే తిరిగాయన్నారు. మధ్యాహ్నం 12.30గంటల తర్వాత పోలీసుల సహకారంతో బస్సులు నడిపామన్నారు.టీడీపీ ఆధ్వర్యంలో..


భారత్‌ బంద్‌కు టీడీపీ సంఘీభావం ప్రకటించింది. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ర్యాలీ చేపట్టారు. గిట్టుబాటు ధర లభించక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని సోమిశెట్టి ధ్వజమెత్తారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత హెచ్చరించారు. రైతులు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని ధ్వజమెత్తారు.