Abn logo
Sep 27 2021 @ 23:42PM

బంద్‌ ప్రశాంతం

గాంధీ చౌక్‌లో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

జిల్లాలో సోమవారం  బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.  వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.  ప్రభుత్వ కార్యాలయాలు,  వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.  


నంద్యాల/నంద్యాలటౌన్‌, సెప్టెంబరు 27: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నంద్యాలలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు తిరగలేదు. డిపోకు పరిమితం అయ్యాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. 


టీడీపీ ఆధ్వర్యంలో : ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి మూల్యం తప్పదని నంద్యాల టీడీపీ నాయకులు హెచ్చరించారు. సోమవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పలువురు టీడీపీ నాయకులు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. గాంధీ చౌక్‌లో ధర్నా చేశారు. మున్సిపల్‌ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాబువలి, కౌన్సిలర్‌ నాగార్జున, మాజీ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు మణియార్‌ ఖలీల్‌, 10వ వార్డు ఇన్‌చార్జి గోవిందనాయుడు, నాయకులు దస్తగిరి, బుజ్జి, నవీన్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల తిమ్మయ్య బంద్‌లో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు బంద్‌ చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమే్‌షకుమార్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌, నాయకులు తోటమద్దులు, సద్దాంహుసేన్‌, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి మహమ్మద్‌గౌస్‌, పట్టణ పౌరసమాఖ్య కన్వీనర్‌ నరసింహ, డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ, మోటార్‌వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పట్టణంలో సీపీఐ నియోజకవర్గ కన్వీనర్‌ ఎస్‌.బాబాఫకృద్దీన్‌, ప్రసాద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ కూడళ్లలో మానవహారం, ధర్నా నిర్వహించారు. 


గోస్పాడు: మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సీపీఎం నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, అంగళ్లు, బ్యాంకులు, వ్యాపారసంస్థలను మూసివేయించారు. బస్టాండు ఆవరణలో రోడ్డుపై ధర్నా చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చెన్నయ్య, మార్క్‌, బాలచెన్నయ్య, గోకారి, నడిపి చెన్నయ్య, జిలానిబాషా పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, రైతు సంఘాలు సోమవారం చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. పట్టణంలో బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు శంషుల్‌ హక్‌, పుల్లయ్య, మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌ రమే్‌షరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు హుసేన్‌, వెస్లీ, సంజీవకుమార్‌, పవన్‌శంకర్‌, రైతు సంఘం నాయకుడు హనుమంతరెడ్డి పాల్గొన్నారు. 


శిరివెళ్ల: మండలంలో సీఐటీయూ, సీపీఐ ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ నాయకులు శిరివెళ్లలో సోమవారం బంద్‌ నిర్వహించారు. బ్యాంకులు, వాణిజ్య సముదాయాలను మూసివేయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలను సహించబోమన్నారు. ఆటో యూనియన్‌ ప్రతినిధులు మాబు, సికిందర్‌, రఫి, బాసులాల్‌, జాకీర్‌ పాల్గొన్నారు. 


చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలో సోమవారం ప్రజా సంఘ నాయకులు తలపెట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు మూసి వేయించారు. గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సీఐటీయూ జిల్లా నాయకుడు ఉసేన్‌బాషా, హమాలీ యూనియన్‌ సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పాపాజీ, సహార సంఘ నాయకులు ఉసేన్‌బిలాల్‌, రఫి, అబ్దుల్లా, పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నాయకులు ఖలీల్‌, వీఆర్‌ఏ సంఘ నాయకులు నరసింహ, టీడీపీ నాయకులు సుబ్బరాయుడు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉసేన్‌బాషా మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రో, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 


ఓర్వకల్లు: ఓర్వకల్లులో సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. టీడీపీ, సీపీఎం, సీపీఐ, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు శ్రీధర్‌, కేవీపీఎస్‌ జిల్లా నాయకుడు ఏఎస్‌ సత్యం, సీపీఎం మండల కన్వీనర్‌ నాగన్న, టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో షాజహాన్‌, ముర్తుజావలి, చంద్రబాబు నాయుడు, అబ్దుల్లా, మహేశ్వరరెడ్డి, నాగరాజు, అల్లాబాబు, డప్పు కళాకారులు, ఆటో కార్మికులు, అంగన్‌వాడీలు, హమాలీలు, రైతులు పాల్గొన్నారు. 


పాణ్యం: దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుందని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. భారత్‌ బంద్‌లో భాగంగా సోమవారం పాణ్యం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్‌ పాటించాయి. స్థానిక జాతీయ రహదారి ప్రధాన కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి పెరుగు శివకృష్ణ యాదవ్‌, సీపీఎం నాయకుడు భాస్కర్‌, రైతు సంఘం నాయకుడు చిన్నకాశిం, ఆర్‌వీఎఫ్‌ నాయకుడు ప్రతాప్‌, ఎఫ్‌బీపీ కార్యదర్శి వెంకటాద్రి, గురునాథ్‌, సీఐటీయూ, ఆటో, హామాలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


గడివేముల: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గడివేములలో సోమవారం సీఐటీయూ, సీపీఎం నాయకులు బంద్‌ నిర్వహించారు. మండలంలోని వ్యాపార సముదాయాలను, ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూసి వేయించారు. అనంతరం సీపీఎం నాయకులు ఎల్ల సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోకార్సా, ఆటోయూనియన్‌ నాయకులు రాంబాబు, ఖలీల్‌, మాచర్లు పాల్గొన్నారు.