Abn logo
Sep 27 2021 @ 23:47PM

బంద్‌ సక్సెస్‌

మైదుకూరులో రోడ్డులో ఉరితో వినూత్న రీతిలో వామపక్షాల నిరసన

కదంతొక్కిన టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష, ప్రజా, విద్యార్థి సంఘాలు

మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ 

కడపలో చట్టాలకు పాడె కట్టి దహనం చేసిన రైతు సంఘాలు

మంగంపేటలో ముగ్గురాయి తవ్వకాలు నిలిపివేసి బంద్‌కు మద్దతు 

మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు, ధర్నాలు 

కబడ్డీ... క్రికెట్‌ ఆడుతూ నిరసన 

మూతబడ్డ విద్య, వాణిజ్య సంస్థలు 

మధ్యాహ్నం తరువాత రోడ్డెక్కిన బస్సులు

ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం


రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ జాతీయ రైతు సంఘాల పిలుపుమేరకు సోమవారం నిర్వహించిన భారత్‌బంద్‌ జిల్లాలో సక్సెస్‌ అయింది. రైతులను నట్టేట ముంచేలా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ వ్యక్తులకు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. రైతు ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదన్నారు. చట్టాలు రద్దు చేయకపోతే మోదీ ప్రభుత్వం పతనం అవుతుందని హెచ్చరించారు.


కడప, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భారత్‌ బంద్‌ సందర్భంగా సోమవారం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఆర్టీసీ మధ్యాహ్నం వరకు బస్సులను ఆపేసింది. టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్సీపీ, ప్రజా, విద్యార్థి, ఉపాధ్యాయ, అంగన్‌వాడీ, కార్మిక, వివిధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలతో హోరెత్తించారు. 

కడపలో టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ నేతలు అమీర్‌బాబు, శివ కొండారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసులు, విష్ణుప్రీతమ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎన్‌ రాజా, రాయలసీమ విద్యార్థి సమైఖ్య రాష్ట్ర కార్యదర్శి మల్లే జగదీష్‌, పలు సంఘాల నేతృత్వంలో బంద్‌ జరిగింది. సీపీఐ శ్రేణులు తెల్లవారుజామున 4.30 గంటలకే ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు నిరసన వ్యక్తం చేసి ర్యాలీగా వెళ్లారు. టీడీపీ నేతలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో కబడ్డీ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కోటిరెడ్డి సర్కిల్‌ చేరుకొని అక్కడ క్రికెట్‌ ఆడి నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా నేత చంద్ర ఆధ్వర్యంలో సీపీఐ, టీడీపీ నేతలు, పలువురు రైతులు ప్రధానిమోదీ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తయారు చేసి పాడెకట్టి కోటిరెడ్డి సర్కిల్‌లో దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఇలాంటి తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయని అన్నారు.

మంగంపేటలో కార్మికులు ముగ్గురాయి తవ్వకాలను నిలిపివేసి బంద్‌కు మద్దతు ప్రకటించారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. ఓబులవారిపల్లెలో రోడ్డుపై అరటిగెలలు, మామిడికాయలు వేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

వేంపల్లెలో జరిగిన ర్యాలీలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి వీల్‌చైర్‌లో కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు.

రాజంపేటలో ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఉపాధ్యాయ, ఎన్జీవో సంఘాలు పాల్గొన్నాయి.

రైల్వేకోడూరులో రాజకీయ పార్టీలు, వామపక్షాల ఆధ్వర్యంలో మెయిన్‌ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు.

బద్వేల్‌లో టీడీపీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా చేశారు. టీడీపీ రాజశేఖర్‌ ఆఽధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాశినాయనలో జరిగిన బంద్‌లో టీడీపీ మహిళా పార్లమెంట్‌ అధ్యక్షురాలు కె.శ్వేతారెడ్డి పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వేర్వేరుగా ర్యాలీ నిర్వహించి వాణిజ్య సంస్థలను మూతవేయించారు. సీపీఐ ఆధ్వర్యంలో శివాలయం సెంటర్‌ నుంచి బంగారు అంగళ్లు, గాంధీరోడ్డు ప్రాంతాల్లో ర్యాలీ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కొరపాడు రోడ్డులో శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు శివాలయం సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. 

జమ్మలమడుగులో టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూతవేయించారు. 

మైదుకూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వల్లూరు, కమలాపురం, పెండ్లిమర్రి, చె న్నూరు, సీకేదిన్నె మండలాల్లో బంద్‌ నిర్వహించారు. 


ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం

భారత్‌బంద్‌ కారణంగా ఆర్టీసీ మధ్యాహ్నం వరకు బస్సులు తిప్పలేదు. మధ్యాహ్నం నుంచి బస్సులు తిరిగాయి. ఆర్టీసీ మొత్తం 789 బస్సులు ఉండగా సగం మాత్రమే రోడ్డెక్కాయి. దీంతో ఆర్టీసీకి సుమారు రూ.50 లక్షలు నష్టం సంభవించింది. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కడపలో టీడీపీ బైక్‌ ర్యాలీ