Abn logo
Jul 7 2020 @ 21:31PM

‘సరిలేరు నీకెవ్వరు’లో చేసినందుకు తిట్టారు: బండ్ల గణేష్

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అయితే ఒక్క వారంలోనే ఆయన రికవరీ అవ్వడంతో పాటు, టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా రికవరీ అయ్యారో లేదో.. అప్పుడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు బండ్ల గణేష్ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్ గురించి, ఏపీ సీఎం జగన్ పరిపాలన గురించి, తనకు కరోనా వచ్చినప్పుడు చిరంజీవిగారు చేసిన ఫోన్ గురించి ఇలా అనేక విషయాలను ఆయన తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియో ఇంకా టెలికాస్ట్ కాలేదు కానీ ప్రోమో మాత్రం వదిలారు. 


అయితే ఈ ప్రోమోలో బాగా హైలెట్ అవుతున్నది మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆయన చేసిన పాత్ర గురించి, ఆ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలే. చాలా గ్యాప్ తర్వాత ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘సరిలేరు నీకెవ్వరులోని పాత్ర నాకు మంచి పేరు తీసుకురాలేదు. ఆ పాత్ర నాకు తృప్తినివ్వలేదు. నా ఆప్తులందరూ ఎందుకు చేశావని తిట్టారు నన్ను. నేను అట్లాంటి వేషాలు చేయకూడదు. ఇకపై నేను యాక్టింగ్ చేయదలుచుకోలేదు..’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరి ఫుల్ ఇంటర్వ్యూ విడుదలైన తర్వాత ఆయన చేసిన ఈ కామెంట్స్ మరింత రచ్చరేపడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Advertisement
Advertisement
Advertisement