సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నేత బండ్రు నర్సింహులు కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-23T08:57:48+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నాయకుడు బండ్రు నర్సింహులు(106) శనివారం తుదిశ్వాస విడిచారు.

సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నేత బండ్రు నర్సింహులు కన్నుమూత

ప్రజా ఉద్యమంలో 80 ఏళ్లు పేదల పక్షాన అవిశ్రాంత పోరాటం 

హైదరాబాద్‌ సిటీ, యాదాద్రి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నాయకుడు బండ్రు నర్సింహులు(106) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 21న డిశ్చార్జి అయిన ఆయన హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేట్‌లోని తన పెద్ద కుమారుడు ప్రభాకర్‌ నివాసంలో శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య నర్సమ్మ, ఐదుగురు సంతానం... ప్రభాకర్‌, భాస్కర్‌, అరుణ, జయ, విమలక్క (విమలక్క భర్త జనశక్తి నేత అమర్‌) ఉన్నారు. ఆయన కోడలు శోభారాణి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. నర్సింహులు భువనగిరి జిల్లా ఆలేరులో 1915 అక్టోబరు 2న జన్మించారు. పేదల పక్షాన.. భూస్వామ్య, దోపిడీ వర్గాలు, దొర, పటేల్‌, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర కీలకమైంది. 1944లో భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్రమహాసభ సమావేశంలో వలంటీర్‌గా సేవలు అందించారు.


అదే సమయంలో మహాసభలో తలెత్తిన సైద్ధాంతిక చీలికలతో రావి నారాయణ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ సాయుధ పోరాటం వైపు మళ్లారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీని వీడి సీపీఐ(ఎంఎల్‌)లో తరిమెల నాగిరెడ్డి నాయకత్వంతో పనిచేశారు. 8దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమంలో పని చేస్తూ అనేక ఆటుపోట్లను, నిర్బంధాలను, దాడులను ఎదుర్కొని, అనేకసార్లు జైలు శిక్షలు కూడా అనుభవించారు. కాగా, 1948లో కొలనుపాక ఎదురు కాల్పుల్లో అరెస్టయి, నాలుగేళ్లు నల్లగొండ, చంచల్‌గూడ జైళ్లలో ఉన్న సమయంలో అప్పటి వరకు అక్షరజ్ఞానం లేని ఆయన జైలు గోడల మధ్య తోటి పోరాట యోధుల సహకారంతో తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. అనంతర కాలంలో సీపీఐ (ఎంఎల్‌) అనుబంధ పక్ష పత్రిక ‘ప్రజా విమోచన’కు సంపాదకుడిగానూ పనిచేశారు. తాను ఆంధ్రజ్యోతికి అభిమానిని అని ఆరునెలల కిందట ఒక ఇంటర్వ్యూలో నర్సింహులు చెప్పారు. నర్సింహులుకు వందేళ్లు నిండిన సందర్భంగా 2015 అక్టోబరు 2న ‘నూరేళ్ల సభ-నూటొక్క పాట’ పేరిట జన్మదిన వేడుకలను నిర్వహించారు. నర్సింహులు విప్లవ జీవితం ఆదర్శనీయమని జనశక్తి నాయకుడు అమర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సింహులు మృతికి స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, సీపీఐ(ఎంఎల్‌) ప్రతినిధులు సంతాపం తెలిపారు. కాగా, సామ్యవాద సిద్ధాంతానికి నిబద్ధుడైన నర్సింహులు మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు. తన భౌతిక కాయాన్ని మెడికల్‌ కాలేజీకి రాసిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించారు. 

Updated Date - 2022-01-23T08:57:48+05:30 IST