Abn logo
Sep 25 2021 @ 03:21AM

చెన్నై..అదే జోరు

బెంగళూరుపై ఘనవిజయం

పడిక్కళ్‌, కోహ్లీ శ్రమ వృథా

షార్జా: మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతోంది. ముందుగా బ్యాటింగ్‌లో దూసుకెళుతున్న ప్రత్యర్థిని బౌలర్లు కట్టడి చేయగా.. ఆ తర్వాత సీఎస్‌కే బ్యాటర్స్‌ సమష్ఠి ఆటతో తడాఖా చూపించారు. దీంతో శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 14 పాయింట్లతో పట్టికలోనూ టాప్‌నకు చేరిం ది. అటు యూఏఈ గడ్డపై ఆర్‌సీబీకిది వరుసగా ఏడో పరాజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (70), కోహ్లీ (53) అర్ధసెంచరీలతో రాణించారు. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. టాప్‌-4 బ్యాటర్స్‌ గైక్వాడ్‌ (38), డుప్లెసి (31), రాయుడు (32), మొయిన్‌ అలీ (23) రాణించగా చివర్లో రైనా (17 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించాడు. హర్షల్‌కు రెండు వికెట్లు దక్కాయి. 3 వికెట్లు తీసిన బ్రావో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


కలిసికట్టుగా...:

ఛేదనలో సీఎ్‌సకే కలిసికట్టుగా కదం తొక్కింది. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసి మెరుగైన ఆరంభాన్నిచ్చారు. ఆర్‌సీబీ బౌలర్ల నుంచి వీరికి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. నాలుగో ఓవర్‌లో రుతురాజ్‌ 4,6 బాదగా.. ఆరో ఓవర్‌లో డుప్లెసి మరింత చెలరేగి 6,4,4తో పవర్‌ప్లేలో స్కోరును 59కి చేర్చాడు. అయితే తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాక ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. రుతురాజ్‌ను చాహల్‌ అవుట్‌ చేయగా ఆ వెంటనే డుప్లెసి.. సైనీకి చిక్కాడు. అయితే ఈ సంతోషం వారికెంతో సేపు నిలవలేదు. రాయుడు, మొయిన్‌ అలీ ఆ తర్వాత రెండో వికెట్‌కు 30 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని వీరు సిక్సర్లతో చెలరేగారు. 14వ ఓవర్‌లో అలీ అవుట్‌ కాగా.. 16వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో జోరు చూపిన రాయుడు అదే ఓవర్‌లో డివిల్లీర్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి 22 బంతుల్లో 22 రన్స్‌ అవసరమయ్యాయి. 17వ ఓవర్‌లో రైనా 4,6తో 11 పరుగులు రాబట్టగా.. మరుసటి ఓవర్‌లో ధోనీ రెండు ఫోర్లతో విజయాన్ని ఖాయం చేశాడు.


ఆరంభం బాగున్నా..:

కోల్‌కతాపై 92 పరుగులకే కుప్పకూలి విమర్శలెదుర్కొన్న ఆర్‌సీబీ.. చెన్నైపై ఆరంభం నుంచే జోరు చూపింది. ఓపెనర్లు కోహ్లీ, దేవ్‌దత్‌ దూకుడుకు స్కోరు  సునాయాసంగా 200 దాటుతుందనిపించింది. కానీ డెత్‌ ఓవర్లలో సీన్‌ మారింది. చివరి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 25 పరుగులే చేసింది. అంతకుముందు ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన కోహ్లీ ఫుల్‌ జోష్‌లో కనిపించాడు. ఐదో ఓవర్‌లో అద్భుత సిక్సర్‌తో అలరించాడు. అటు దేవ్‌దత్‌ సైతం బ్యాట్‌ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో బెంగళూరు 55 పరుగులు చేసింది. ఈ జోడీ అలవోకగా ఓవర్‌కో బౌండరీ చొప్పున బాదడంతో స్కోరు రాకెట్‌ వేగంగా దూసుకెళ్లింది. ఈ జోరుతో 35 బంతుల్లో దేవ్‌దత్‌.. 36 బంతుల్లో కోహ్లీ తమ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. అయితే 14వ ఓవర్‌లో కోహ్లీని బ్రావో అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చెన్నైపై ఏ వికెట్‌కైనా ఈ జట్టుకిదే అత్యుత్తమం. అలాగే 2013 తర్వాత చెన్నైపై తొలి వికెట్‌కు 50+ పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఇక కోహ్లీ నిష్క్రమణతో ఆర్‌సీబీ ఒక్కసారిగా తడబడింది. 17వ ఓవర్‌లో శార్దూల్‌ వరుస బంతుల్లో దేవ్‌దత్‌, డివిల్లీర్స్‌ (12)లను పెవిలియన్‌కు చేర్చగా, భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న టిమ్‌ డేవిడ్‌ (1) మూడు బంతులకే పరిమితమయ్యాడు. చివరి ఓవర్‌లో బ్రావో 2 పరుగులకు మ్యాక్స్‌వెల్‌ (11), హర్షల్‌ (3) వికెట్లను తీయడంతో బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) జడేజా (బి) బ్రావో 53; దేవ్‌దత్‌ (సి) రాయుడు (బి) శార్దూల్‌ 70; డివిల్లీర్స్‌ (సి) రైనా (బి) శార్దూల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (సి) జడేజా (బి) బ్రావో 11; డేవిడ్‌ (సి) రైనా (బి) దీపక్‌ చాహర్‌ 1; హర్షల్‌ (సి) రైనా (బి) బ్రావో 3; హసరంగ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 156/6; వికెట్ల పతనం: 1-111, 2-140, 3-140, 4-150, 5-154, 6-156; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-35-1; హాజెల్‌వుడ్‌ 4-0-34-0; శార్దూల్‌ 4-0-29-2; జడేజా 4-0-31-0; బ్రావో 4-0-24-3.


చెన్నై:

రుతురాజ్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 38; డుప్లెసి (సి) సైనీ (బి) మ్యాక్స్‌వెల్‌ 31; మొయిన్‌ అలీ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 23; రాయుడు (సి) డివిల్లీర్స్‌ (బి) హర్షల్‌ 32; రైనా (నాటౌట్‌) 17; ధోనీ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.1 ఓవర్లలో 157/4; వికెట్ల పతనం: 1-71, 2-71, 3-118, 4-133; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-23-0; సైనీ 2-0-25-0; హసరంగ 4-0-40-0; హర్షల్‌ పటేల్‌  3.1-0-25-2; యజ్వేంద్ర చాహల్‌ 4-0-26-1; మ్యాక్స్‌వెల్‌ 2-0-17-1.