Advertisement

పాట హృదయం చెదిరిపోయింది..బంగార్రాజు పాట ఆలస్యం..

"సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది"..అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీవ్ర నష్ఠాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్దలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులందరూ కన్నీరు కార్చారు. ఏ ఒక్కరి నోట మాటరాక ఇది నిజమా కలా అనే దిగ్భాంతిలోనే ఇంకా ఉన్నారు. ఈ నేపథ్యంలో నటీ నటులు, దర్శకులతో పాటు ప్రతీ ఒక్కరు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో నాగార్జున కూడా "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది"..అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన హీరోగా నటిస్తున్న 'బంగార్రాజు' సినిమాలోని పాట ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా, సీతారామశాస్త్రి అకాల మృతి కారణంగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా నుంచి 'బంగార్రాజు నీకోసం' అనే సాంగ్ టీజర్‌ను డిసెంబర్ 2వ తేదీన ఉదయం గం 10:08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 


Advertisement