నిధుల స్వాహా కేసులో బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-25T06:53:32+05:30 IST

నిధుల స్వాహా కేసులో పోలీసులు పీలేరు ఆంధ్రాబ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ను అరెస్టు చేశారు.

నిధుల స్వాహా కేసులో బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ అరెస్టు
విశ్వనాథం అరెస్టు చూపుతున్న పోలీసులు

పీలేరు, జనవరి 24: నిధుల స్వాహా కేసులో పోలీసులు ఓ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ను అరెస్టు చేశారు. పీలేరు అర్బన్‌ ఇన్‌చార్జి సీఐ తులసీరాం, ఎస్‌ఐ తిప్పేస్వామి కథనం మేరకు.. పీలేరు ఆంధ్రాబ్యాంకు(ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు) అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన దార్ల విశ్వనాఽథం గతంలో తన భార్య, ఇద్దరు స్నేహితుల పేరిట వేర్వేరుగా రూ.5.42 లక్షల గోల్డ్‌ లోన్‌ తీసుకున్నారు. ఇందుకుగాను ఆయన తాను పనిచేస్తున్న బ్యాంకు అప్రైజర్‌ సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టారు. దీంతోపాటు ఇదే బ్యాంకు ఖాతాదారులుగా ఉన్న కృష్ణవేణికి చెందిన ఖాతా నుంచి రూ.3లక్షలు, జమాలాబాషా ఖాతా నుంచి రూ.2.02 లక్షలు, పీలేరు మండల పరిషత్‌ కార్యాలయ ఖాతా నుంచి రూ.15లక్షలు మొత్తం రూ.24.17 లక్షల నగదు అక్రమంగా డ్రా చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న ఆంధ్రాబ్యాంకు తిరుపతి రీజనల్‌ కార్యాలయ జనరల్‌ మేనేజర్‌ పి.డి.ఇ.శర్మ విచారణ నిర్వహించారు. దీంతో తాను అవినీతికి పాల్పడినట్లు అసిస్టెంట్‌ మేనేజర్‌ విశ్వనాఽథం ఒప్పుకుని, స్వాహా చేసిన నిధులను బ్యాంక్‌కు జమచేశారు. అనంతరం బ్యాంకు ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేసి, అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఫోర్జరీకి కూడా పాల్పడినట్లు తేలడంతో సోమవారం అసిస్టెంట్‌ మేనేజర్‌ విశ్వనాథంను అరెస్టు చేసినట్లు పీలేరు అర్బన్‌ ఇన్‌చార్జి సీఐ తులసీరాం తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 409, 467, 468, 471, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. 

Updated Date - 2022-01-25T06:53:32+05:30 IST