Abn logo
Oct 19 2020 @ 00:16AM

బంగారు ఆభరణాలు లేకుండా రుణాలు మంజూరు

ఎస్‌బీఐ సమనస బ్రాంచి క్యాష్‌ ఆఫీసర్‌ శర్మ అరెస్టు చూపిస్తున్న డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషాKaakateeya

 అమలాపురం రూరల్‌, అక్టోబరు 18: రొయ్యల సాగు కలిసిరాలేదు. రూ.55 లక్షల నష్టం వచ్చింది. తెలిసినకాడికల్లా అప్పు చేశాడు. ఇక ఎక్కడా అప్పు పుట్టలేదు. దీంతో తాను పనిచేసే బ్యాంకు గుర్తుకు వచ్చింది. బంగారు ఆభరణాలు లేకుండా రుణాలు మంజూరు చేయించే టెక్నిక్‌ కనుగొన్నాడు. మొత్తం రూ.కోటి వరకు లాగేశాడు. చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. ఇదీ సమనస బ్యాంకులో క్యాష్‌ ఆఫీసర్‌ శర్మ అక్రమ రుణాల బాగోతం..అమలాపురం డీఎస్పీ మసూమ్‌బాషా ఆదివారం విలేకర్లకు స్కామ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన బులుసు వీరవెంకట సత్యసుబ్రహ్మణ్యశర్మ భారతీయ స్టేట్‌ బ్యాంకు సమనస బ్రాంచిలో క్యాష్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. 2015  నుంచి శర్మ ఆక్వా సేద్యం ప్రారంభించారు. భారీగా నష్టాలు వచ్చాయి. అందరి దగ్గర అప్పులు చేశాడు. దీంతో అప్పుల చెల్లింపులకు ఒత్తిళ్లు పెరిగిపోయాయి. చేసేదిలేక పనిచేస్తున్న బ్యాంకులోనే గోల్డ్‌లోన గోల్‌మాల్‌కు తెరదించాడు. 
కుటుంబ సభ్యుల పేరిటే బ్యాంకు రుణాలు..
ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వచ్చినప్పుడు లాకర్‌ రూమ్‌లో వారి ఆభరణాలతో పాటు పక్కనున్న వేరే వారి ఆభరణాలు కూడా బయటకు తెచ్చేవాడు.  ఆ ఆభరణాలతో బంధువుల పేరిట గోల్డ్‌లోన ఖాతా ఓపెన చేయించి డబ్బును బదిలీ చేయించేవాడు. 2019 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 24వ తేదీ వరకు అలా 25 నకిలీ ఖాతాలను తెరిచి మొత్తం రూ.99.56 లక్షలు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 14 నాటికి ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.1.05 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు 24న జరిగిన బ్యాంకు ఇంటర్నల్‌ ఆడిట్‌లో ఈ వ్యవహారం బయటపడడంతో సెప్టెంబరు 14న శాఖాపరమైన విచారణ నిర్వహించారు. అభియోగాలు రుజువు కావడంతో అదేరోజున శర్మను సస్పెండ్‌ చేశారు. ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ కోలా జగదీశ్వరరావు ఫిర్యాదు చేయడంతో వన్నె చింతలపూడిలో ఆక్వా చెరువుల వద్దనున్న శర్మను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్‌ఐ సీహెచ.రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement