రిటైల్ రుణాలపై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-06-12T06:34:51+05:30 IST

కోవిడ్‌-19తో జీతాల కోత, ఉద్యోగ నష్టంతో ప్రజల ఆదాయాలకు గండి పడుతోంది. మరోవైపు ఖర్చులు పెరిగి పోతున్నాయి. ఈ భారం తట్టుకునేందుకు అప్పు చేద్దామన్నా, బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు...

రిటైల్ రుణాలపై అప్రమత్తం

  • బ్యాంకులను  వెంటాడుతున్న ఎగవేతల భయం


ముంబై: కోవిడ్‌-19తో జీతాల కోత,  ఉద్యోగ నష్టంతో ప్రజల ఆదాయాలకు గండి పడుతోంది. మరోవైపు ఖర్చులు పెరిగి పోతున్నాయి. ఈ భారం తట్టుకునేందుకు అప్పు చేద్దామన్నా, బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఉద్యోగాల్లో ఉన్నన్ని రోజులు లోను కావాలా బాబూ అంటూ ఫోన్లతో  మరీ విసిగించిన బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. చెల్లింపుల భయంతో రిటైల్‌ లోన్లకు సారీ చెబుతున్నాయి. పరపతి సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌’ తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. 


హోమ్‌ లోన్లే ముద్దు: ప్రస్తుతం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులకు డిమాండ్‌ పెరిగింది. కాని చెల్లింపుల భయం ఎక్కువ కావడంతో బ్యాంకులు రిటైల్‌ రుణాలకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. బదులు చెల్లింపులకు పెద్దగా ఢోకా లేని హోమ్‌ లోన్లు, వాహన రుణాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఆదాయాలు పడిపోవడంతో గృహ రుణాలకూ పెద్దగా డిమాండ్‌ లేదు. గృహాల ధరలు కొండెక్కి కూర్చోవడమూ ఇందుకు దోహదం చేస్తోంది. 


పడకేసిన డిమాండ్‌: వినియోగదారుల్లో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. దీంతో వినియోగ డిమాండ్‌, ఖర్చులు బాగా పడిపోయినట్టు ఆ నివేదిక పేర్కొంది. అన్ని రకాల రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐ ఈ ఏడాది ఆగస్టు వరకు మారిటోరియం(విరామం)కు వీలు కల్పించింది. రిటైల్‌ రుణ చెల్లింపుదారుల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ఈ అవకాశం ఉపయోగించుకున్నారు. అయితే ఆగస్టు తర్వాత పరిస్థితి ఏమిటనే భయం బ్యాంకుల్ని వేధిస్తోంది.


గోల్డ్‌ లోన్స్‌కు ఓకే: వ్యక్తిగత రుణాలకు సవాలక్ష కొర్రీలు పెడుతున్న బ్యాంకులు గోల్డ్‌ లోన్స్‌కు మాత్రం వెంటనే ఓకే చెబుతున్నాయి. దీంతో చాలా మంది ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు గోల్డ్‌ లోన్లను ఆశ్రయిస్తున్నారు. చెల్లింపులకు ఢోకా లేకపోవడంతో బ్యాంకులు కూడా ఈ రుణాలను ప్రోత్సహిస్తున్నాయి. పెద్దగా డాక్యుమెంట్లు పూర్తి చేయాల్సిన అవసరం లేకపోవడం, గంట లేదా రెండు గంటల్లోనే లోన్‌ మంజూరు కావడంతో, చాలా మంది పసిడి రుణాలను ఆశ్రయిస్తున్నారు. 


Updated Date - 2020-06-12T06:34:51+05:30 IST