Abn logo
Sep 17 2021 @ 02:36AM

బ్యాంకుల పండగ బొనాంజా

  • 6.70% వడ్డీకే ఇంటి రుణం : ఎస్‌బీఐ 
  • 0.25% తక్కువ వడ్డీకే రుణం : బీఓబీ


ముంబై: రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది. 


ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లు ఎంత రుణం తీసుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా 6.70 శాతం వడ్డీ రేటుకే రూ.75 లక్షల వరకు ఇంటి రుణం తీసుకోవచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. ఇప్పటివరకు రూ.75 లక్షలకు పైబడి రుణం తీసుకున్న వారు 7.15 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆఫర్‌ వల్ల్ల 30 ఏళ్ల కాలానికి రూ.75 లక్షలు రుణం తీసుకున్న వారికి రూ.8 లక్షలకు పైగా ఆదా అవుతుంది. అలాగే ఇంటి రుణాలు తీసుకునే వారిపై గతంలో విధించిన వృత్తి అనుసంధానిత వడ్డీ ప్రీమియం విధానం తొలగించింది. ఇప్పటివరకు వేతన జీవులతో పోల్చి తే ఇతర వృత్తుల్లోని వారు 0.15 శాతం అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇంటి రుణా లు తీసుకునే వారెవరి పైనా వృత్తి అనుసంధానిత వడ్డీ ప్రీమియం విధించరు. అంటే కొత్తగా రుణాలు తీసుకునే వారికి 0.15 శాతం వడ్డీ ఆదా అవుతుంది.  కాగా కొత్త రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును బ్యాంక్‌ ఇప్పటికే ఎత్తివేసింది.  

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కస్టమర్ల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించిన కొత్త ఆఫర్‌ ప్రకారం సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీ రేటుకే ఇంటి రుణాలు, వాహన రుణాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంటి రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది. దీంతో వడ్డీ రేట్లు ఇంటి రుణంపై 6.75 శాతం నుంచి, వాహన రుణంపై 7 శాతం నుంచి ప్రారంభమవుతాయి.