బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దే వద్దు..

ABN , First Publish Date - 2021-12-17T17:57:13+05:30 IST

జాతీయబ్యాంకులను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని జాతీయస్థాయిలో బ్యాంకుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోనూ పెద్దపెట్టున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దే వద్దు..

బెంగళూరు: జాతీయబ్యాంకులను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని జాతీయస్థాయిలో బ్యాంకుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోనూ పెద్దపెట్టున నిరసనలు వ్యక్తం అయ్యాయి. బెంగళూరులోని ఫ్రీడంపార్కులో గురువారం జరిగిన ధర్నాలో వందలసంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. శుక్రవారం కూడా ధర్నా కొనసాగనుంది. బ్యాంకు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు రాజధాని బెంగళూరుతోపాటు అన్ని జిల్లాకేంద్రాలలోనూ సాగాయి. యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ యూనియన్‌ కన్వీనర్‌ ఎస్‌కే శ్రీనివాస మీడియాతో మాట్లాడుతూ నిరసనకు అ నూహ్య స్పందన లభించిందన్నారు. ఇప్పటికే బీమా రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు బ్యాంకులను టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. బ్యాంకులను జాతీయం చేయడంతో అణగారిన వర్గాల ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించారని పేర్కొన్న ఆయన బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వేలసంఖ్యలో ఉద్యోగులు వీధిన పడడంతో పాటు ఇక సామాన్యులకు బ్యాంకుల సేవలు గగనం అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రతిపాదనలు తక్షణం నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2021-12-17T17:57:13+05:30 IST