ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన బ్యాంకులు

ABN , First Publish Date - 2021-12-17T13:52:44+05:30 IST

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య పిలుపుమేరకు రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగులు గురువారం సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ

ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన బ్యాంకులు

- రాష్ట్రంలో 6500 శాఖల మూత 

- ఏటీఎంలలో నగదు ఖాళీ


చెన్నై: అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య పిలుపుమేరకు రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగులు గురువారం సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ బ్యాంకుఉద్యోగులు ఈనెల 16, 17 తేదీల్లో సమ్మెలో పాల్గొ నాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. స్థానిక వళ్లువర్‌కోట్టం వద్ద బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకారణంగా రాష్ట్రమంతటా 6500 బ్యాంకు బ్రాంచీలు మూతపడ్డాయి. సుమారు రూ.500 కోట్లమేరకు ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. కోట్లాది రూపాయల విలువ చేసే చెక్కులు సకాలంలో బట్వాడా కాలేని పరిస్థితులు దాపురించాయి. సామాన్య ప్రజలు తమ పొదుపు ఖాతాలలో డబ్బులు డ్రా చేయలేక నిరాశతో తిరుగుముఖం పట్టారు. ఈ సమ్మె గురించి భారత స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం చెన్నై రీజిన్‌ ప్రధాన కార్యదర్శి ప్రభాకరన్‌ మీడియాతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తమ న్యాయమైన కోర్కెల సాధన నిమిత్తం రెండురోజులపాటు సమ్మె చేస్తున్నారని తెలిపారు. బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకారణంగా సుమారు రూ.500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు స్తంభించాయని తెలిపారు. ఇదిలా వుండగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె చేస్తుండటంతో ఏటీఎంల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వందల సంఖ్యలో ఖాతాదారులు బారులు తీరారు. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు ఏటీఎంల వద్ద స్థానికులు నగదు డ్రా చేసుకునేందుకు నిలిచారు. పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఇప్పటికే నగదు ఖాళీ అయింది. శుక్రవారం సమ్మె కొనసాగినా, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవుదినాలు కనుక మూడు రోజులపాటు ఏటీఎంలలో నగదును నింపే అవకాశం లేదని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కారణంగా ఖాతాదారులు ఏటీఎంల నుంచి నగదును డ్రా చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. 



Updated Date - 2021-12-17T13:52:44+05:30 IST