ఫండ్లకు రూ.3.5 లక్షల కోట్ల డిఫాల్ట్‌ ముప్పు

ABN , First Publish Date - 2020-05-05T05:30:00+05:30 IST

కరోనా కల్లోలంలో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) రంగం సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు జారీ చేసిన రుణ పత్రాల్లో ఎంఎ్‌ఫలు లక్షల కోట్ల రూపాయల...

ఫండ్లకు రూ.3.5 లక్షల కోట్ల డిఫాల్ట్‌ ముప్పు

  • డిసెంబరుకల్లా పూర్తికానున్న 1000 రుణపత్రాల కాలపరిమితి


న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) రంగం సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు జారీ చేసిన రుణ పత్రాల్లో ఎంఎ్‌ఫలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. అందులో 1000కి పైగా రుణ పథకాల కాలపరిమితి ఈ 8 నెలల్లో (మే-డిసెంబరు) పూర్తి కానుంది. వీటిల్లోని ఫండ్ల పెట్టుబడులు రూ.3.5 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కోవిడ్‌ దెబ్బకు కుదేలైన కార్పొరేట్లు.. ఈ రుణ పత్రాలపై సొమ్మును తిరిగి చెల్లించే అవకాశాలు కన్పించడం లేదని విశ్లేషకులంటున్నారు. అదే గనక జరిగితే డెట్‌ ఫండ్‌ పథకాలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని వారన్నారు.


50శాతం పెరగనున్న డిఫాల్ట్‌లు, డౌన్‌గ్రేడ్‌లు: క్రిసిల్‌ 

దేశీయ పరపతి రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌.. ఆయా రంగాలకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలపై అధ్యయనం జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పలు రుణ పథకాల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌, డిఫాల్ట్‌లు 50 శాతం పెరగవచ్చని అంటోంది. ముఖ్యంగా విద్యుత్‌ రంగంపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని క్రిసిల్‌ పేర్కొంది. ఈ రంగంలో డిఫాల్ట్‌లు, డౌన్‌గ్రేడ్‌లు 13 రెట్లు పెరగవచ్చని అంచనా వేసింది. రాబడిపై తీవ్ర ప్రభావం పడిన ఆటోమొబైల్‌ విడిభాగాలు, రియల్‌ ఎస్టేట్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, ఎయిర్‌లైన్స్‌, పౌలీ్ట్ర, టెక్స్‌టైల్‌, నిర్మాణం, విద్యుత్‌, ప్యాకేజింగ్‌, చక్కెర ఉత్పత్తి రంగ కంపెనీల పరపతి రేటింగ్‌ తగ్గేందుకు అధిక అవకాశాలున్నాయని క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. 


పీఎ్‌సబీలకు రూ.1.12 లక్షల కోట్లు: బోఫా 

కరోనా సంక్షోభంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) మొండి బకాయిలు (ఎన్‌పీఏ)  2-4 శాతం మేర పెరగవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బోఫా) అంచనా వేసింది. దాంతో  పీఎ్‌సబీలకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్ల డాలర్ల (రూ.1,12,500 కోట్లు)  మూలధనం సమకూర్చాల్సి రావచ్చని అంటోంది. బోఫా ఇంకా ఏమందంటే.. 

  • కరోనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పాటు పన్ను వసూళ్లు, డిజిన్వె్‌స్టమెంట్‌ ఆదాయం తగ్గడంతో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనా కంటే కనీసం 2 శాతం అధికంగా నమోదుకావచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు మూలధనం సమకూర్చేందుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్‌ బాండ్లు జారీ చేయడం లేదా  ఆర్‌బీఐ వద్దనున్న 12,700 కోట్ల డాలర్ల భారీ నిల్వలు సైతం ఉపయోగపడతాయి. 

రుణాల వన్‌టైమ్‌ రీస్ట్రక్చర్‌ : ఆర్‌బీఐకి ఎన్‌బీఎఫ్‌సీల వినతి

వచ్చే ఏడాది మార్చి వరకు అన్ని రుణాల ఏక కాల పునర్వ్యవస్థీకరణ (వన్‌టైమ్‌ రీస్ట్రక్చర్‌)కు అనుమతించాలని ఎన్‌బీఎ్‌ఫసీలు ఆర్‌బీఐని కోరాయి. లాక్‌డౌన్‌తో తమ రుణగ్రహీతలునిధులకు తీవ్ర కొరత ఎదుర్కొంటున్నారని, ఈ దృష్ట్యా రుణాల పునర్‌ వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. అంతేకాదు, ఆర్‌బీఐ రుణ మారటోరియంను తమకూ వర్తింపజేయాలని కోరాయి. ప్రొవిజనింగ్‌ నిబంధనల్లో సడలింపులు, రీఫైనాన్స్‌ మెకానిజం ద్వారా సిడ్బీ, నాబార్డు నుంచి అదనపు ఫండింగ్‌ను సైతం కల్పించాలని డిమాండ్‌ చేశాయి. 




మొండి బకాయిలు డబుల్‌!?

వచ్చే మార్చి నాటికి   18-20 శాతం

ప్రస్తుతం 9.1 శాతానికి పరిమితం 


లాక్‌డౌన్‌ కారణంగా కార్పొరేట్‌ కంపెనీల రుణ చెల్లింపుల సామర్థ్యం పూర్తిగా బలహీనపడిందని, తత్ఫలితంగా బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) రెట్టింపు కావచ్చన్న అంచనాలున్నాయి. 2019 సెప్టెంబరు నాటికి దేశీయ బ్యాంకింగ్‌ రంగంలోని మొండి బకాయిలు రూ.9.35 లక్షల కోట్లు. అంటే, మొత్తం రుణాల్లో వీటి వాటా 9.1 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి  మొండిపద్దుల వాటా 18-20 శాతానికి ఎగబాకవచ్చని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

నిధులకు కటకట : చాలా కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా కన్పించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాల్లో ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉండనుంది. ఒకవైపు రాబడి నిలిచిపోయింది. మరోవైపు నిధులు అడుగంటిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కన్పించడం లేదు. మొత్తం రుణాల్లో ఈ విభాగ కంపెనీల వాటానే 20 శాతం వరకు ఉంటుందని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల రుణ డిఫాల్ట్‌లు మున్ముందు నెలల్లో భారీగా పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. కంపెనీల మొత్తం రుణ బకాయిల్లో 20-25 శాతం వరకు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-05-05T05:30:00+05:30 IST