సన్మానం చేద్దాం.. చందాలివ్వండి!

ABN , First Publish Date - 2020-12-04T05:42:34+05:30 IST

గుంటూరు, నరసరావుపేట డివిజన్‌ల పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి.

సన్మానం చేద్దాం.. చందాలివ్వండి!

ఉన్నతాధికారులను సన్మానించుకుందాం.. ఘనమైన బహుమతులిస్తే మన పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయి. అందుకోసం పెద్ద పంచాయతీలు, ఈవో అండ్‌ ఆర్‌డీల వరకు చందాలు వేసుకుందాం. ఒక్కొక్కరు రూ.10వేలు ఇవ్వండి’.. ఇదీ ప్రస్తుతం తెనాలి డివిజన్‌లో జరుగుతున్న వసూళ్ల తంతు. ఈ నెల 5న జరిగే తెనాలి డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశంలో సన్మానాలు, బహుమానాలు దండిగా ఇచ్చేందుకు లోపాయకారి ఏర్పాట్లకు సిద్ధమైనట్లు సమాచారం. ఎవరో డాబుకోసం మేము ఎందుకు రూ.10వేలు ఇవ్వాలంటూ కొందరు మదనపడుతూ ఆవేదన వెళ్లగక్కటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 



5న తెనాలి డివిజన్‌ కార్యదర్శుల సమావేశం 

పై అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వసూళ్లు 

85 మంది నుంచి రూ.8 లక్షలకుపైగా... 

బిల్లులు మంజూరు చేయించుకునేందుకేనా..? 

420 మంది కార్యదర్శులతో సమీక్షా సమావేశం 

కరోనా సమయంలో ఇంతమంది ఒకేచోట..? 


 తెనాలి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గుంటూరు, నరసరావుపేట డివిజన్‌ల పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. కరోనా దృష్ట్యా ఈ రెండు సమావేశాలకు కేవలం ఈవో అండ్‌ ఆర్‌డీలను మాత్రమే పిలిచి, కార్యదర్శులు జూమ్‌ ద్వారా పాల్గొనేలా నిర్ణయించారు. కానీ తెనాలి డివిజన్‌ స్థాయి కార్యదర్శుల సమావేశం ఈ నెల 5న భారీగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  దీనికితోడు ఈ నెల 7 నుంచి 15 రోజులపాటు జరుగుతున్న వార్‌ ఆన్‌ వేస్ట్‌ కార్యక్రమంలో పంచాయతీల కార్యదర్శులు బిజీగా ఉన్నారు. అయినా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని  మౌఖిక ఆదేశాలిచ్చారు. వరుస వాయుగుండాలు, తుపాన్‌ల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య పనుల్లో కొంచెం కూడా తీరికలేకుండా ఉన్న సిబ్బందిని దీనికోసం పిలవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


 ఒక్కొక్కరు రూ.10 వేలివ్వండి..

ఈ సమీక్ష సమావేశం కోసం కార్యదర్శులు,  ఈవో అండ్‌ ఆర్‌డీ ఒక్కొక్కరు రూ.10వేలు ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశాలను జారీ చేసేశారనేది కొందరు కార్యదర్శుల ఆరోపణ.  తెనాలి డివిజన్‌లో 67 మేజర్‌ పంచాయతీలు, 353 మైనర్‌ పంచాయతీలు ఉన్నాయి. కార్యదర్శులు, ఈవో అండ్‌ ఆర్‌డీలు కలిపి 438 మంది సమావేశానికి హాజరు కావలసి ఉంది. కరోనా నేపథ్యంలో ఇంతమందిని ఒక ఏసీ హాలులో సమావేశపరిస్తే తర్వాత పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. మొత్తం 85 మంది నుంచి రూ.8.5 లక్షలు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారనేది సమాచారం. అయితే మిగిలిన 353 మైనర్‌ పంచాయతీల కార్యదర్శులను వదిలేశారు. 


బిల్లులు చేయించుకునేందుకేనా?

కొవిడ్‌ సమయంలో బ్లీచింగ్‌, ఇతర ద్రావణాల కొనుగోళ్లు, సరఫరాలో జిల్లా స్థాయిలోనే బంధువుల ద్వారా పనిచేయించేందుకు పావులు కదిపిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తెనాలి మండలం కొలకలూరు మేజర్‌ పంచాయతీలోనూ విజిలెన్స్‌ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు.  ఈ కుంభకోణం బయటపడటంతో వాటి కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను జిల్లా అధికారులు ఆపేశారు.  తాజాగా వీటికి సంబంధించిన బిల్లులే చిన్న మార్పులుచేసి బ్లీచింగ్‌ పేరులేకుండా ద్రావణం పేరుతో మంజూరు చేయించుకున్నారనే ఆరోపణ కూడా ఉంది. వీటితోపాటు, ప్రస్తుతం తెనాలి డివిజన్‌లో వరదలకు కృష్ణాతీరంలోని పంచాయతీల్లో చేసిన ఖర్చులు, మొన్నటి తుఫాన్‌ కారణంగా, గత వర్షాల కారణంగా ముంపు నీటి మళ్లింపులు, పారిశుధ్య కార్యక్రమాలకు ఇతర కొనుగోళ్లను చూపి వాటి బిల్లులు పొందాల్సి ఉంది. జిల్లా అధికారులతో వీటన్నిటినీ తేలికగా చేయించుకోవచ్చనే ఆలోచనతోనే ఈ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 


 రెండేళ్ల నుంచి ఇన్‌ఛార్జ్‌ల చేతుల్లోనే..

జిల్లా పంచాయతీ అధికారి పోస్టు రెండేళ్ల నుంచి ఇన్‌ఛార్జ్‌ల చేతుల్లోనే సాగుతోంది. ఫుల్‌టైమ్‌ డీపీవో లేకపోవటంతో అనేక కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. మరోపక్క జిల్లాలోనే మేజర్‌ పంచాయతీలు ఎక్కువగా ఉన్న తెనాలి డివిజన్‌లోనూ డీఎల్‌పీవో పోస్టు కూడా ఒక మండల ఈవోఅండ్‌ ఆర్‌డీకే ఇన్‌ఛార్జ్‌ కింద బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు కీలక పోస్టులకు శాశ్వత అధికారిని నియమించకపోవటంపై ఇటీవల జరిగిన బ్లీచింగ్‌ కుంభకోణం సమయంలోనూ విమర్శలు బహిరంగంగానే వినిపించాయి.



 వసూళ్ల విషయం నా దృష్టికి రాలేదు..

 సమీక్ష సమావేశానికి ప్రభుత్వమే నిధులిస్తుంది. దీనికోసం కిందిస్థాయి సిబ్బంది నుంచి వసూళ్ళు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బు ఇవ్వమని వత్తిడి చేస్తున్నట్టు నా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే సమావేశం నిర్వహిస్తున్నాం. దీనిలో సన్మానాలు, సత్కారాలకు తావులేదు.

- కొండయ్య, ఇన్‌ఛార్జ్‌ డీపీవో, గుంటూరు 

Updated Date - 2020-12-04T05:42:34+05:30 IST