Abn logo
Oct 2 2020 @ 00:29AM

కవిత్వంలో బాపూ తత్త్వం

సత్యం, త్యాగం, అహింస. ఈ త్రిమూర్తాత్మకమైన గాంధేయ విధానమే ఇప్పటికే ప్రపంచమంతటా ‘గాంధీతత్త్వం’ (Gandhian Philosophy)గా ప్రచారంలోకి వచ్చింది. ఈ గాంధీతత్త్వం ఎంత శక్తివంతమైనదంటే దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ సారథి నెల్సన్ మండేలా వంటివారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ‘గాంధీతత్త్వం’లోని అనేక ఇతర పార్శ్వాలను కూడా ఒంట పట్టించుకున్నవాళ్ళు తెలుగు సాహితీవేత్తలు, వాళ్ళ రచనల్లో గాంధీజీ తపన, ఆరాటం, ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇప్పటికీ మనలో ఆలోచనలు రగిలిస్తాయి. గాంధీజీ ప్రతిపాదించిన సిద్ధాంతాలకు ప్రభావితులయి అనేక మంది కవులు తెలుగు దేశంలో హరిజనోద్యమానికి తమ గళాలను వినిపించారు. వీరిలో తుమ్మల సీతారామామూర్తి చౌదరి, వెంకట పార్వతీశ కవులు, పురిపండా అప్పల స్వామి మొదలైనవారు ఉన్నారు. 


ఆనాటి మద్యపాన నిషేధంపై వచ్చిన గరిమెళ్ళ సత్యనారాయణ ‘‘కల్లు త్రాగబోకు..- కడుపు మాడ్చుకోకు. కల్లు మానండోయ్ -బాబు.. కళ్ళు తెరవండోయ్’’ వంటి గీతాలు ఎంతో ప్రాచుర్యాన్నిపొందాయి. బసవరాజు అప్పారావు రచించిన ‘‘కొల్లాయి గట్టితేనేమి’’ అన్న పాట ఆనాడు ఆబాల గోపాలమును, పండిత పామరులను పరవశులను చేసింది. గాంధీజీని గూర్చి, రాట్నాన్ని గూర్చి, స్వరాజ్యమును గూర్చి ప్రచారస్థాయిలో గేయాలు, పద్యాలు రాశారు ఆనాటి కవులు. బలిజేపల్లి లక్ష్మికాంతంగారి ‘స్వరాజ్య రథము’, ‘స్వరాజ్య సమస్య’ అనే ఖండ కావ్యాలు బాలగంగాధర తిలక్, గాంధీ మొదలైన దేశ నాయకులు నడిపిన స్వరాజ్యోద్యమం ప్రభావంతో వచ్చినవే. మాధవ పెడ్డి బుచ్చి సుందరరామశాస్త్రి ‘‘అంటరానివారెవరో కారు. మావెంట రానివారె’’ అనే సుప్రసిద్ధ గేయాన్ని రచించారు.


ముప్పయికోట్ల ప్రజలు రాంభజన- పంజర బంధమైనారు/ బంధాలు త్రెంపుకొని రాంభజన -అవతల పడాలి/ గాంధీ మంత్ర మిదేను రాంభజన -స్వరాజ్య మంత్రం/ ఒక్కటే మంత్రం రాంభజన -మేలైన యంత్రం’’- –ఈ విధంగా చమత్కార ధోరణిలో సాగే ‘‘రాంభజన’’ కీర్తనలను దుగ్గిరాల గోపాల కృష్ణయ్యగారు రచించారు. 


జాస్తి వేంకట నరసయ్య, ధూళిపాళ వేంకట సుబ్రహ్మణ్యం కలిసి 1946లో వ్రాసిన ‘‘జయభేరి’’ అనే ఖండకావ్యం నిజంగా స్వరాజ్య రథోత్సవానికి జయభేరి వంటిది– ‘‘ఖాధీపరిశ్రమగావింపవలె వృద్ధి/ మద్యపానంబును మాన్పవలెను/ హిందూ ముస్లిముల కింపోందజేయుము మైత్రి/ అంటరానితనంబు మంటగలుపు/ మహిళామణుల హక్కు మన్నింపగావలె/ ఆరోగ్యబోధ జేయంగవలెను/ గ్రామ పరిశ్రమల్గడు వృద్ధి గావింపు/ పారిశుద్ధ్యంబునకు బాటుపడుము/ వృత్తి విద్య వయోజన విద్యగణపు/ మమత నేర్పు హిందూస్థానీ మాతృభాష/ విడువకు మార్థిక సమత గావింపవలయు/ కుష్ఠురోగుల నిలయముల్ గూర్చవలయు’’ – ఇలా సాగే ఈ పద్యంలో గాంధీ తత్త్వ సారాంశమంతా ఇమిడి ఉండి. ఖాదీ పరిశ్రమలను అభివృద్ధి చేయటం, ప్రజలు మద్యపానాన్ని మానివేయటం, హిందూ ముస్లిములు మైత్రీభావంతో మెలగటం, అంటరానితనాన్ని పారద్రోలటం, మహిళల హక్కులను గౌరవించటం, విద్యా ప్రాముఖ్యతను వివరించటం, అస్పృశ్యతను రూపుమాపటం, ఆర్థిక వ్యత్యాసాలు లేని సమతా రాజ్యాన్ని సాధించటం... ఇవి గాంధీజీ ఆశయాలు. వానిని తెలుగు కవులు ఎందరో తమ రచనల ద్వారా ఆవిష్కరించారు.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్

Advertisement
Advertisement