బస్తీ ఎవరికి దోస్తీ..!

ABN , First Publish Date - 2020-11-28T06:35:21+05:30 IST

అసెంబ్లీ.. పార్లమెంట్‌.. జీహెచ్‌ఎంసీ..

బస్తీ ఎవరికి దోస్తీ..!

గ్రేటర్‌ ఎన్నికల్లో కీలకంగా బస్తీ ఓటర్లు

డబ్బు, మద్యంతో అభ్యర్థుల ప్రసన్నం

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ.. పార్లమెంట్‌.. జీహెచ్‌ఎంసీ.. ఎన్నికలేవైనా పార్టీలు విజయం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంటాయి. ఈ క్రమంలో తమకు ఎక్కడ ఓట్లు పడతాయి, ఎవరి మద్దతు పొందితే గెలుపు సాధ్యం, అన్న దానిపై నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తారు. గ్రేటర్‌కు సంబంధించి బస్తీల ఓట్లు కీలకంగా మారనున్నాయి. వారి ఆదరణ ఉన్న వారే చాలా ప్రాంతాల్లో గెలుపు బాటలో పయనిస్తారు. కాలనీ ప్రజలు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణం. ఈ అంశాన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అర్ధ, అంగ బలంతో ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి. నగరంలో 40-45 శాతం ఓటింగ్‌ నమోదవుతుండగా.. అందులో దాదాపు 30 శాతం ఓట్లు బస్తీవాసులవే. ఈ క్రమంలో బస్తీలను గంపగుత్తగా తమ వైపునకు తిప్పుకునేందుకు పార్టీలు బేరసారాలు మొదలుపెట్టాయి. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరో వైపు తాయిలాల ఎర చూపి రహస్య మంతనాలు జరుపుతున్నాయి. గతంలో బస్తీల ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్‌, టీడీపీలకు అనుకూలంగా ఉండగా తదనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత గ్రేటర్‌ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతోన్న నేపథ్యంలో వారి ఆదరణ ఎవరికి..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

ప్రభావం చూపనున్న డబ్బు, మద్యం...

మాస్‌ ఓటర్లు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది డబ్బు, మద్యం. వందలాది కాలనీలు, బస్తీల్లో ఈ రెండూ అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. వివిధ పార్టీల నేతలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు ప్రలోభ పర్వాలు మరింత ఊపందుకునే అవకాశముంది. గ్రేటర్‌ పరిధిలో 2వేల పై చిలుకు బస్తీలు ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు వివిధ బస్తీల్లో తమ అనుచరులను రంగంలోకి దింపారు. ప్రత్యర్థులకు ఓట్లు పడకుండా.. బస్తీ వాసులను తమ వైపునకు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బస్తీ సంఘాల నాయకులతో మంతనాలు జరుపుతూ లక్షల రూపాయలు ఆఫర్‌ చేస్తున్నారు.  

Updated Date - 2020-11-28T06:35:21+05:30 IST