మావి అంటరాని బతుకమ్మలా?

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

దురాజ్‌పల్లిలో 300 మందితో కూడిన దళిత గూడెం మాది. అందరితో సమానంగా బతుకమ్మ పండగ జరుపుకోవడం మాలో కొందరి అలవాటు. అలా నవంబరు ఆరో తేదీ నాడు, 20 మంది తోటి ....

మావి అంటరాని బతుకమ్మలా?

బతుకమ్మతో పాటు అంటరానితనం కూడా కలకాలం బతుకుతూనే ఉంటుందా? అలాగైతే ఆ వివక్షను ఎదిరించే దళిత గళం కూడా మోగుతూనే ఉంటుందని నిరూపించింది దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన దళిత మహిళ ఇరువు రమణ. బతుకమ్మలకు అంటరానితనం అంటగట్టిన గ్రామస్థులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన రమణ నవ్యతో పంచుకున్న అనుభవం ఇది!


‘‘దురాజ్‌పల్లిలో 300 మందితో కూడిన దళిత గూడెం మాది. అందరితో సమానంగా బతుకమ్మ పండగ జరుపుకోవడం మాలో కొందరి అలవాటు. అలా నవంబరు ఆరో తేదీ నాడు, 20 మంది తోటి దళిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆటకు బయల్దేరి వెళ్లాం. బతుకమ్మల కోసం అది ప్రభుత్వం కేటాయించిన చోటు. అయితే అక్కడ అప్పటికే పేర్చి ఉన్న బతుకమ్మల పక్కనే మా బతుకమ్మలను ఉంచాం. అంతే.... వెంటనే అగ్రకులస్థులందరూ ఆగ్రహంతో ఊగిపోతూ మాతో గొడవకు తెగబడ్డారు. మేం దళితులం కాబట్టి మా బతుకమ్మలను దూరంగా ఉంచాలని గొడవ చేశారు. ఆ సమయంలో నాతో నా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిగతా దళిత మహిళలూ, వాళ్ల పిల్లలు కూడా ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయారు. బతుకమ్మలకు కూడా కుల వివక్ష ఉంటుందనేది మేం ఊహించని విషయం. మేం అంటరానివారం అయినంత మాత్రాన మా బతుకమ్మలు కూడా అంటరానివైపోతాయా? అంటూ అగ్రకులస్థులను నిలదీశాం. అందుకు వాళ్లు పూర్వం నుంచీ లేని కొత్త పద్ధతులను ఇప్పుడెందుకు అనుసరిస్తున్నారు? అంటూ మమ్మల్ని అవమానించడమే కాకుండా మా మీద దాడికి దిగారు. 


పిల్లలనూ ఆడనివ్వలేదు

అందరం సమానమేనంటూ, కుల వివక్ష కూడదంటూ ఉపన్యాసాలిచ్చే పెద్దలందరూ పండగ విషయానికొచ్చేసరికి వేరు చేసి మాట్లాడడం ఎంత వరకూ సమంజసం? ‘దళితులు బతుకమ్మ పండగ జరుపుకునే ఆచారం ఎక్కడైనా ఉందా?’ అంటూ గ్రామస్థులు మమ్మల్ని చులకనగా మాట్లాడారు. అందరూ సమానమైనప్పుడు పండగ జరుపుకోవడంలో వివక్ష అవసరమా? ఆఖరుకు మా పిల్లలు బతుకమ్మ ఆడడానికి వీలు లేకుండా పాటలు కూడా ఆపేయడం మమ్మల్నెంతో బాధకు గురిచేసింది. మనసు చిన్నబుచ్చుకున్న పిల్లల్ని సముదాయించుకుని, అగ్రకులస్థులు చెరువులో బతుకమ్మలను వదిలేవరకూ ఆగి, ఆ తర్వాత మా బతుకమ్మలను వదిలి, బరువెక్కిన గుండెలతో ఇళ్లకు తిరిగొచ్చాం. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, మా పిల్లలు పెరిగి పెద్దయ్యేటప్పటికి ఇంకెలా ఉంటుందో అనే ఆలోచన నాలో మొదలైంది. మా పిల్లలు కూడా అందరు పిల్లల్లాగే బతుకమ్మలు ఆడే రోజులు రావాలంటే, ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. 


వెనక్కి తగ్గను

అందుకోసం ఎవరో ఒకరు వివక్షకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. అది నేనే ఎందుకు కాకూడదు అనిపించింది. అలా ఆ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. కొందరు నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేసినప్పటికీ పట్టుదలగా ఫిర్యాదు నమోదు చేయించాను. ఆ తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అగ్రకులస్థుల నుంచి నాకు ఒత్తిడి మొదలైంది. మా గూడెం వాళ్లు కూడా ‘‘ఎందుకొచ్చిన గొడవ, కాంప్రమైజ్‌ అయిపోదాం’’ అంటూ నన్ను నీరుగార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఊర్లో ఏర్పాటు చేయిస్తే, నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని షరతు విధించాను. అందుకు కూడా అగ్రకులస్థులు అంగీకరించలేదు. అలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, ఈ గొడవ సంగతి వాళ్ల పిల్లలందరికీ తెలిసిపోతుందనేది వాళ్ల భయం. అయితే నా షరతుకు అంగీకరించి విగ్రహం ఏర్పాటుకు ఒప్పుకుంటే, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనేది నా ఆలోచన. అలా కాని పక్షంలో న్యాయం జరిగేవరకూ పోరాడాలనే నిర్ణయించుకున్నా!


దళిత ఐకమత్యం అవసరం

ఫిర్యాదు చేసిన ప్రారంభంలో నన్న మెచ్చుకున్న సాటి దళితులు ఇప్పుడు భయంతో వెనక్కి తగ్గడం బాధ కలిగించే విషయం. రోజూ భయపడుతూ బ్రతికే బదులు, కుల వివక్ష కోసం పోరాడిన వాళ్లంగా గుర్తింపు తెచ్చుకుని మరణించినా చాలు అనేది నా ఆలోచన. నిజానికి మాలో ఐకమత్యమే ఉంటే, ఇలాంటి వివక్షలనేవి ఎప్పుడో అంతరించి ఉండేవి. కనీసం ఇప్పటికైనా కులమతభేదం లేని సమసమాజ నిర్మాణం కోసం కలిసికట్టుగా ప్రయత్నిస్తే, మా ముందు తరాల్లోని పిల్లలందరూ అన్ని పండగలనూ అగ్రకులాలతో సమానంగా ఆనందంగా జరుపుకోగలుగుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నా నమ్మకం. 


- గోగుమళ్ల కవిత

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST