సంబరాల సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-13T04:30:29+05:30 IST

తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల్లో బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ఏరోజుకు ఆరోజే ప్రత్యేకం. వీటిలో సద్దుల బతుకమ్మ మరెంతో వేడుకగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ రోజు మహిళలు, యువతులు, బాలికలు నూతన దుస్తులు ధరించి సంప్రదాయంగా కనిపిస్తారు.

సంబరాల సద్దుల బతుకమ్మ
సద్దుల బతుకమ్మ కోసం సిద్ధం చేసిన పూలు

నేడు, రేపు జిల్లాలో వేడుకలు

ఏర్పాట్లు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు

తాండూర్‌, అక్టోబరు 12: తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల్లో బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ఏరోజుకు ఆరోజే ప్రత్యేకం. వీటిలో సద్దుల బతుకమ్మ మరెంతో వేడుకగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ రోజు మహిళలు, యువతులు, బాలికలు నూతన దుస్తులు ధరించి సంప్రదాయంగా కనిపిస్తారు. తీరుతీరు పూలను సేకరించి పోటాపోటీగా బతుకమ్మలు పేర్చుకుని సాయంత్రం ఆటకు వైభవంగా వెళ్తారు. ఈసారి ఈనెల 6న ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 14న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. కొంతమంది తిథుల ప్రకారం 13న కూడా సద్దుల బతుకమ్మ వేడుకను నిర్వహించుకుంటున్నారు. 

కళకళలాడుతున్న గ్రామాలు

గతేడాది కరోనా పరిస్థితులతో బతుకమ్మ పండుగ కొద్దిగా కళ తప్పింది. అయితే ఈసారి ఎక్కడెక్కడో ఉన్న వారంతా వారివారి స్వగ్రామాలకు చేరుకున్నారు.  ఈనెల 6 నుంచే పిల్లలకు సెలవులు రావడంతో మహిళలు, పిల్లలు గ్రామాలకు చేరుకున్నారు. చివరి రోజున బంధుమిత్రులతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఈసారి అంబరాన్ని అంటనున్నాయి. 

సహజత్వం.. శాస్త్రీయత.. సంప్రదాయం

పూల పండుగ బతుకమ్మ ఆద్యంతం సహజత్వం, శాస్త్రీయతలను మేళవించుకుని ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టి మంచు కురిసే రోజుల్లో ఈ పండుగ వస్తుంది. బతుకమ్మలో ఉపయోగించే ప్రతీ పువ్వులోనూ ఔషధ గుణాలుంటాయి. వీటిని జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటికి, ప్రకృతికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా నీటికి ఔషధ గుణాలు కూడా కలిసిపోతాయి.  సద్దుల బతుకమ్మ రోజున కూడా ప్రత్యేకంగా ఇళ్లలోనే ప్రసాదాలు తయారు చేస్తారు. పలు రకాల సత్తు పిండి, పిండి వంటలు తయారుచేస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు ఒకరికొకరు వైనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. 

ప్రత్యేక ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మ కోసం ప్రతీ పట్టణం, గ్రామంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవరి వాడలో వారు ఆట వద్ద విద్యుద్దీపాలతో అలంకరించుకోగా, ఆయా ప్రాంతాల్లోని జలాశయాల వద్ద మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ రోజున సాయంత్రం ప్రారంభమయ్యే వేడుకలు అర్ధరాత్రి వరకు సాగుతాయి. కొన్ని గ్రామాల్లో తెల్లవారే వరకు కూడా ఆటపాటలతో మహిళలు ఉత్సాహంగా వేడుక నిర్వహించుకుంటారు. 

సద్దుల బతుకమ్మపై సందిగ్ధం

మందమర్రిటౌన్‌: సద్దుల బతుకమ్మపై సందిగ్ధత నెలకొంది. ఈ పండగ రెండు రోజులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహిస్తుండగా మందమర్రి, రామకృష్ణాపూర్‌, కాసిపేట తదితర ప్రాంతాల్లో గురువారం నిర్వహించనున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-10-13T04:30:29+05:30 IST