బాతిక్‌ బ్రహ్మ బాలయ్య

ABN , First Publish Date - 2020-12-31T06:16:44+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ‘బాతిక్‌’ బాలయ్యగా కీర్తి ప్రతిష్ఠలు పొంది ఇద్దరు గురువులైన పద్మశ్రీ లక్ష్మాగౌడ్‌, డా. కాపు రాజయ్యలకు తగ్గ శిష్యుడనిపించుకున్న యాసాల బాలయ్య...

బాతిక్‌ బ్రహ్మ బాలయ్య

లేపాక్షిని సందర్శించి అక్కడి చిత్రాలు చూసి ముగ్ధుడై, బాతిక్‌ పద్ధతిలో లేపాక్షి చిత్రాలకు ప్రతిరూపాలు చిత్రించి ‘శభాష్‌’ అనిపించుకొన్నారు బాలయ్య. తెలంగాణ ప్రజల జీవన చిత్రాలు గీయడంలో బాలయ్య తనకంటూ ఒక విశిష్ట స్థానం పొందారు.


తెలుగు రాష్ట్రాల్లో ‘బాతిక్‌’ బాలయ్యగా కీర్తి ప్రతిష్ఠలు పొంది ఇద్దరు గురువులైన పద్మశ్రీ లక్ష్మాగౌడ్‌, డా. కాపు రాజయ్యలకు తగ్గ శిష్యుడనిపించుకున్న యాసాల బాలయ్య మృతి తెలుగు చిత్రకళా రంగానికి తీరని లోటు. చిత్రకళా రంగంలో ఉన్న ఎన్నో ప్రక్రియల్లో బాతిక్‌ ఒకటి. ఇది అత్యంత ప్రాచీనకళ. జావాలో పుట్టిన ఈ కళ. ఈజిప్టు పర్షియాల్లో వర్ధిల్లింది. క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి ఈ కళ మనదేశంలో వ్యాప్తి చెందినట్టు ఆధారాలున్నాయి. బందరు కలంకారీ పద్ధతిని పోలి ఉంటుంది. నేరుగా వస్త్రాలపై రంగులు వేయడం కుదరదు. తెల్లని వస్త్రంపై మైనంతో బొమ్మగీయాలి. ఆ తర్వాత ఆ వస్త్రంపై కావాల్సిన రంగులు అద్దాలి. ఎన్ని రంగులు కావాలంటే, అన్నిసార్లు మైనంతో గీసుకుని రంగులు అద్దాలి. ఆ తర్వాత వేడి నీటిలో వస్త్రం ముంచితే మైనం కరిగిపోతుంది. ఆ ఖాళీస్థలంలో కావాల్సిన రంగులు వేసుకోవాలి. వీటికి నెఫ్తాలీ రంగులు వాడాలి. ఈ ప్రక్రియతో తయారైనదే బాతిక్‌ చిత్రం అంటారు. ఈ పద్ధతిలో చిత్రం వేయడానికి కళాకారుడికి శ్రద్ధ, ఓపిక, సహనం, ఏకాగ్రత అవసరం. ఈ చిత్రాలు గృహాలంకరణకు, ప్రజలు ధరించే బట్టలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘బాతిక్‌’ కళను గురించి చెప్పాలంటే తెలంగాణకు చెందిన సిద్ధిపేటకు సమీపంలోనున్న ఇబ్రహీంపూర్‌లో జన్మించిన యాసాల బాలయ్య గురించి ముందుగా చెప్పడం సమంజసం. చిత్రకళలో బాలయ్య ఆసక్తిని గమనించి, ప్రముఖ జానపద చిత్రకారుడు డా. కాపు రాజయ్య ఆయనను చేరదీసి, ఆ కళలో మెళకువలు నేర్పారు. అనంతరం ప్రముఖ చిత్రకారులు, శిల్పి పద్మశ్రీ లక్ష్మాగౌడ్‌ వద్ద ఈ బాతిక్‌ కళను నేర్చుకొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ ఉపకార వేతనంతో ప్రముఖ చిత్రకళోపన్యాసకులు విద్యాభూషన్‌ వద్ద ప్రత్యేక చిత్రకళా శిక్షణ పొందారు.

సిద్ధిపేటలో చిత్రకళోపాధ్యాయ బాధ్యతలు చేపట్టాక, 1957 నుంచి పత్రికల్లో రేఖాచిత్రాలు గీసి, చిత్రకారునిగా గుర్తింపు పొందారు. 1964 నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పాల్గొని బాలయ్య అనేక బహుమతులు, ప్రశంసా పత్రాలు పొందారు. 1970లో లేపాక్షిని సందర్శించి అక్కడి చిత్రాలు చూసి ముగ్ధుడై, బాతిక్‌ పద్ధతిలో లేపాక్షి చిత్రాలకు ప్రతిరూపాలు చిత్రించి ‘శభాష్‌’ అనిపించుకొన్నారు. తెలంగాణ ప్రజల జీవన చిత్రాలు గీయడంలో బాలయ్య తనకంటూ ఒక విశిష్ట స్థానం పొందారు.
బాలయ్య చిత్రాలు ఎ.పి రాష్ట్ర మ్యూజియం, సాలార్‌జంగ్‌ మ్యూజియం, అమెరికాలో గల లాస్‌ ఏంజెల్స్‌ మ్యూజియం, రాష్ట్ర లలితకళా అకాడమీ, అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. వీరి ప్రతిభ గుర్తించి, నాటి రాష్ట్రపతి డా. శంకర్‌దయాళ్‌ శర్మ జాతీయ ఉత్తమ చిత్రకళోపాధ్యాయుని అవార్డు అందజేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ హస్తకళావైభవం’’ పేరుతో దూరదర్శన్‌ వీరి చిత్రాల్ని ప్రసారం చేసింది.

బాలయ్య బాతిక్‌ చిత్రాలతో పాటు అనేక నీటి, నూనె రంగుల చిత్రాలు చిత్రించారు. వీటిలో కొన్ని గ్రీటింగ్‌ కార్డులు గాను, క్యాలెండర్లుగా మరికొన్ని వచ్చాయి. సినారె, జ్వాలాముఖి, డా. ఎన్‌. గోపి వంటి పెద్దలెందరో వీరి చిత్రాలు చూసి ప్రశంసించారు. బాతిక్‌ కళపై ఒక సమగ్ర గ్రంథాన్ని కూడా ఆయన వెలువరించారు. బాలయ్య మృతి తెలుగు చిత్రకళా రంగానికి తీరని వెలితి. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.

సుంకర చలపతిరావు

Updated Date - 2020-12-31T06:16:44+05:30 IST