బట్టేల్‌గుట్ట.. ఇక బ్యూటీఫుల్‌..!

ABN , First Publish Date - 2021-03-01T13:13:35+05:30 IST

ఒకప్పుడు రాళ్లు రప్పలు, పిచ్చి మొక్కలు, పొదలతో ఎవరూ పట్టించుకోని పాత గుట్ట.

బట్టేల్‌గుట్ట.. ఇక బ్యూటీఫుల్‌..!

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : ఒకప్పుడు రాళ్లు రప్పలు, పిచ్చి మొక్కలు, పొదలతో ఎవరూ పట్టించుకోని పాత గుట్ట. అదే ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. సందర్శకులను కట్టి పడేసే పచ్చదనం, అందమైన పూల మొక్కలు.., ఆకట్టుకునే బెంచీలు... ధ్యానముద్రలో స్వాగతం పలికే బుద్ధుడి విగ్రహం.. ఇవీ ప్రస్తుతం ఆ గుట్టపై కనపడుతున్న ఏర్పాట్లు. నిజాం కాలంలో సరిహద్దు రక్షణ కోసం పోలీసు పహరా నిమిత్తం నిర్మించిన వృత్తాకారపు రక్షణకోట ఈ గుట్టకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని 30వవార్డు సుబ్రహ్మణ్యకాలనీలో, కార్పొరేషన్‌ కార్యాలయం పక్కనే ఏర్పాటవుతున్న పార్కు ప్రత్యేకత ఇది.


ప్రహరీ గోడకే రూ.40లక్షలు..

ఈ గుట్ట ఎంత ఏటవాలుగా ఉండేదంటే, దీనిపై పార్కుని అభివృద్ధి చేయడానికిగాను ముందుగా చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి వచ్చింది. దానిని మట్టితో పూడిస్తేనే ఇతర పనులు చేయడానికి వీలు కలిగింది. దాంతో ఇంజనీరింగ్‌ అధికారులు రూ.40లక్షల అంచనాతో ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదన కౌన్సిల్‌లో ఆమోదం పొందడంతో గోడ కట్టి లారీల కొద్దీ మట్టి తెచ్చి నింపేశారు. అనంతరం పార్కు పనులు చేపట్టి వేగంగా చేయిస్తున్నారు. మరో రూ.25 లక్షల వరకు వెచ్చిస్తే అందమైన పార్కు అందుబాటులోకి వస్తుందని మునిసిపల్‌ డీఈఈ అశోక్‌రెడ్డి చెప్పారు. గుట్ట చుట్టూ అంచుల వెంట రోడ్డులా తవ్వి వాటిని వాకింగ్‌ ట్రాక్‌లుగా మారుస్తున్నారు. 


సదరు ట్రాక్‌ల మధ్య ఉండే ఏటవాలు ప్రదేశాన్ని కార్పెట్‌ గ్రాస్‌తో నింపుతున్నారు. ఇక గుట్టపై కొంతభాగంలో 1995లో నిర్మించిన మంచినీటి ట్యాంకు ఉండేది. పార్కు అభివృద్ధిలో భాగంగా ఆ ట్యాంకును పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం పెట్టనున్నారు. అక్కడక్కడా విభిన్న ఆకృతుల్లో ఉన్న సిమెంటు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. బట్టేల్‌ గుట్టపై పార్కు అభివృద్ధి కోసం  అవసరమైతే ఇంకా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి చెప్పారు. మంత్రి సబితారెడ్డి సహకారం, సలహాలకు అనుగుణంగా పార్కును తయారు చేస్తున్నామని కార్పొరేటర్‌ బీమిడి స్వాప్నాజంగారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-03-01T13:13:35+05:30 IST