ఈవీలకు బ్యాటరీ కష్టాలు

ABN , First Publish Date - 2021-10-24T08:52:26+05:30 IST

దేశీయ వాహన కంపెనీలకు ఈ ఏడాది పండగ సీజన్‌ అంతగా కలిసొచ్చేలా కన్పించడం లేదు. చిప్‌ సెట్ల కొరత కారణంగా భారత్‌లోని సంప్రదాయ ఇంధన (పెట్రోల్‌, డీజిల్‌)

ఈవీలకు బ్యాటరీ కష్టాలు

  • కంపెనీల వద్ద అడుగంటుతున్న నిల్వలు.. 
  • సరఫరాలో జాప్యం.. కొనుగోళ్లకూ సవాళ్లు 


దేశీయ వాహన కంపెనీలకు ఈ ఏడాది పండగ సీజన్‌ అంతగా కలిసొచ్చేలా కన్పించడం లేదు. చిప్‌ సెట్ల కొరత కారణంగా భారత్‌లోని సంప్రదాయ ఇంధన (పెట్రోల్‌, డీజిల్‌) కార్ల కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. తత్ఫలితంగా గత నెల విక్రయాలూ తగ్గాయి. ఈ నెలలో మరింత క్షీణించవ్చన్న అంచనాలున్నాయి. కాగా, విద్యుత్‌ వాహన (ఈవీ) తయారీదారులకు బ్యాటరీల బెడద మొదలైంది. సరఫరా జాప్యాలు, అవాంతరాల కారణంగా ఈవీ కంపెనీల వద్ద లిథియం అయాన్‌ బ్యాటరీల నిల్వలు అడుగంటుకుపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని బ్యాటరీల కొనుగోలులోనూ దేశీయ కంపెనీలకు పలు ఇబ్బందులెదురవుతున్నాయి. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో బ్యాటరీల ధరలు గణనీయంగా పెరిగాయి. 


ఇందుకు తోడు, బ్యాటరీ సెల్స్‌ తయారీదారులు మెరుగైన ధర లభించే అమెరికా, యూరప్‌ మార్కెట్లకు సరఫరాపైనే దృష్టి సారించాయి. సరుకు రవాణాకు అవసరమైన కంటైనర్ల కొరత, విద్యుత్‌ కోతల కారణంగా చైనాలో తగ్గిన బ్యాటరీ సెల్స్‌ ఉత్పత్తి కూడా మన  ఈవీ కంపెనీలపై  ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాంతో చైనా తదితర దేశాల నుంచి బ్యాటరీ సెల్స్‌ ఆర్డర్ల సరఫరా 10-15 రోజుల వరకు జాప్యమవుతోందని బ్యాటరీ అసెంబ్లింగ్‌ కంపెనీలంటున్నాయి. 


‘ఈవీ’ల ధరలు పెరిగే చాన్స్‌

మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రెండేళ్లు పట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఇబ్బందులను అధిగమించి బ్యాటరీలను సేకరించేందుకు అధికంగా వెచ్చించాల్సి రావచ్చని, దాంతో కంపెనీలు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ధరలను పెంచే అవకాశాలు లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


 దిగుమతులే ఆధారం

ప్రస్తుతం భారత కంపెనీలు ఈ బ్యాటరీల సెల్స్‌ కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ప్రధానంగా చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశంలోకి రూ.9,000 కోట్ల విలువైన లిథియం అయాన్‌ బ్యాటరీ సెల్స్‌ దిగుమతయ్యాయి. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో ఎలక్ట్రిక్‌ టూవీలర్లు, కార్లకు డిమాండ్‌ కూడా శరవేగంగా పెరుగుతోంది. కానీ, బ్యాటరీల కొరత కారణంగా పెరుగుతున్న గిరాకీకి తగ్గట్టుగా వాహనాలను సరఫరా చేయడం కంపెనీలకు కష్టమే. 

Updated Date - 2021-10-24T08:52:26+05:30 IST