అసోం-మిజోరం మధ్య రణరంగం

ABN , First Publish Date - 2021-07-27T06:50:29+05:30 IST

అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు

అసోం-మిజోరం మధ్య రణరంగం

  • అసోం పోలీసులపై కాల్పులు.. ఆరుగురి మృతి
  • మిజోరం జంట వెళ్తున్న కారుపై దాడి
  • స్థానికులపై విరిగిన లాఠీ.. గుడిసెలు దహనం
  • ట్విటర్‌లో సీఎంల మాటల తూటాలు
  • ఇరు రాష్ట్రాల సీఎంలకు అమిత్‌షా ఫోన్‌


 గువాహటి/ఐజ్వాల్‌, జూలై 26: అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. సోమవా రం జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందారని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ వెల్లడించారు. కచార్‌ ఎస్పీ నిబంల్కర్‌ వైభవ్‌ చంద్రకాంత్‌ సహా 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఇది సంఘవిద్రోహక శక్తుల పనేనని అసోం పోలీసులు చెబుతుండగా.. నిరాయుధులైన పౌరులపై అసోం పోలీసులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో తమవాళ్లూ ఎదురు కాల్పులకు దిగారని మిజోరం హోం మంత్రి లాల్‌చమిలియానా పేర్కొన్నారు.


రెండు రాష్ట్రాల మధ్య కచార్‌(అసోం), కొలాసిబ్‌(మిజోరం) జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. పక్షం రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలున్నాయి. మరోవైపు 200 మందికి పైగా అసోం పోలీసులు సీఆర్పీఎఫ్‌ పోస్టును దాటుకుని వచ్చి వైరెంగ్టే-లైలాపూర్‌ మధ్యలో పౌరులపై లాఠీలతో విరుచుకుపడ్డాని, దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారని మిజోరం సీఎం జోరామ్‌థాంగ్‌ ట్వీట్‌ చేశారు. ఓ జంట ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విటర్‌ వేదికగా వాగ్యుద్ధానికి దిగారు.


‘‘అమిత్‌షా గారూ.. చూస్తున్నారు కదా? మీరు కల్పించుకుని, ఉద్రిక్తతలను నిలిపివేయండి’’ అని మిజోరం సీఎం జోరామ్‌థాంగా ట్వీట్‌ చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిపై అమిత్‌షాను ట్యాగ్‌ చేస్తూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ‘‘జోరామ్‌థాంగ్‌ గారు.. కోలాసిబ్‌(మిజోరం) ఎస్పీ మా పోలీసు పోస్టుల్ని తొలగించాలంటున్నారు. లేదంటే మీ పౌరులు మాట వినరని, హింసను తాము ఆపలేమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వా న్ని ఎలా నడుపుతాం? మీరు త్వరగా కల్పించుకోండి’’ అని రీట్వీట్‌ చేశారు. ఆ వెంటనే జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయిన విషయాన్ని ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇరు రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతను అదుపు చేసి, శాంతి నెలకొల్పాలని సూచించారు.



ఏమిటీ వివాదం?


మిజోరాంతో పాటు మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు అసోంతో సరిహద్దు వివాదాలున్నాయి. అసోం-మిజోరాం మధ్య లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవులు ఉన్నందున ఇరు రాష్ట్రాల సరిహద్దులను కచ్చితంగా గుర్తించలేదు. హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన చట్టం-1971 ప్రకారం లుషాయ్‌ కొండలను అసోం నుంచి విడదీసి మిజోరాం కేంద్రాపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. 1972లో మిజోరాం రాష్ట్ర హోదా పొందింది. సరిహద్దులను నిర్ణయించకపోవడంతో అక్కడి వారు ఇక్కడి భూముల్లో.. ఇక్కడి వారు అక్కడి భూముల్లో వ్యవసాయాలు చేసుకోవడం సాధారణంగా మారింది. బ్రిటిష్‌ పాలకులు విడుదల చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఇప్పుడు ఘర్షణకు దిగుతున్నాయి.




1875లో బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం లుషాయ్‌ కొండలు, కచర్‌ మైదాన ప్రాంతాల సరిహద్దులను నిర్ణయించారు. 1933లో మణిపూర్‌-లుషాయ్‌ కొండల సరిహద్దులను నిర్ణయి స్తూ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాన్ని అసోం అనుకూలంగా మలచుకుంటూ పలు ప్రాంతాలు తమ పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది. మిజోరాం స్థానికులు మాత్రం మ్యాపుల రూపకల్పన సమయంలో అధికారులు తమ అభిప్రాయం తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఈ ఘర్షణలకు కారణమని ఆరోపిస్తున్నారు.


1994లోనూ ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2006లోనూ ఈ ఘర్షణలతో 306వ జాతీయ రహదారి 12 రోజులపాటు మూతపడింది. పక్షం రోజుల క్రితం మళ్లీ ఘర్షణలు మొదలవ్వడం.. ఐఈడీలు పేలడంతో కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా కచ్చితమైన పరిష్కారం సూచించలేదు. ఇది జరిగిన రెండు రోజులకే కాల్పుల ఘటన సంచలనం రేపింది.


Updated Date - 2021-07-27T06:50:29+05:30 IST