బతుకునిచ్చే తల్లి!

ABN , First Publish Date - 2020-10-09T07:48:38+05:30 IST

ప్రకృతినే పరాశక్తిగా ఆరాధించే వేడుక బతుకమ్మ పండుగ. రోజుకో తీరుగా సాగే పూల సంబురం ఇది. వందల ఏళ్ళ చరిత్ర ఉన్న బతుకమ్మ వేడుక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకూ, ప్రకృతితో మమేకమైన పల్లె ప్రజల జీవన విధానానికీ ఘనమైన ప్రతీక.

బతుకునిచ్చే తల్లి!

ప్రకృతినే పరాశక్తిగా ఆరాధించే వేడుక బతుకమ్మ పండుగ. రోజుకో తీరుగా సాగే పూల సంబురం ఇది. వందల ఏళ్ళ చరిత్ర ఉన్న బతుకమ్మ వేడుక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకూ, ప్రకృతితో మమేకమైన పల్లె ప్రజల జీవన విధానానికీ ఘనమైన ప్రతీక.

 

  • ఈ నెల 16 నుంచి బతుకమ్మ సంబురాలు


బతుకమ్మ సంబురం తెలంగాణ జానపదుల పండుగ. వర్షాకాలం ముగిసి, శీతకాలం ప్రారంభమయ్యే సమయంలో, ప్రకృతిని శోభాయమానంగా మార్చే పూలతో జరుపుకొనే వేడుక ఇది. కాకతీయుల కాలం నాటికే బతుకమ్మ పండుగ బహుళ ప్రచారంలో ఉందనడానికి ఆధారాలున్నాయి. ఈ పండుగలో ప్రధాన ఆరాధ్య దేవత బతుకమ్మ సాక్షాత్తూ గౌరీ దేవి అనీ, ఆమెకూ శ్రీ మహాలక్ష్మికీ అబేధమనీ చెబుతారు. విశ్వాన్ని చల్లగా చూసి, అందరినీ బతికించే తల్లి కాబట్టి గౌరీ దేవి ‘బతుకమ్మ’ అయిందన్నది పెద్దల మాట.  

బతుకమ్మ పాటల్లో ప్రసిద్ధమైన... శ్రీలక్ష్మి నీమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మభారతీదేవివై బ్రహ్మకిల్లాలివై - పార్వతీదేవివై పరమేశురాణివై పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ - భార్యవైతివి హరికినీ గౌరమ్మ ... అనే గీతాన్ని గమనిస్తే ముగ్గురమ్మల స్వరూపమే బతుకమ్మ అని స్పష్టమవుతుంది.


ఎన్నెన్నో కథలు...

బతుకమ్మ పండుగ ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది.  చోళరాజ్యాన్ని ధర్మాంగుడనే రాజు పాలించేవాడు. అతని భార్య సత్యవతి, ఆమె నూరు నోములు నోచింది, వాటి ప్రభావంతో ఆ దంపతులకు వందమంది సంతానం కలిగారు. అయితే వారందరూ శత్రువుల చేతిలో మరణించారు. రాజ్యం శత్రువుల వశమైపోయింది. పుత్రశోకాన్ని భరించలేని ధర్మాంగుడు, సత్యవతి అడవికి వెళ్ళి, శ్రీ మహాలక్షి కోసం తపస్సు చేశారు. వారికి లక్ష్మీ దేవి ప్రత్యక్షమయింది. వరం కోరుకోమంది. తమకు కూతురుగా పుట్టాలని ఆ దంపతులు కోరుకున్నారు. వారి కోరికను తీర్చడానికి సత్యవతి గర్భాన లక్ష్మీ దేవిజన్మించింది. భూలోకంలో వెలసిన లక్ష్మిని చూడడానికి వచ్చిన వశిష్టుడు తదితర మునులు ఆ బిడ్డను ‘బతుకమ్మా!’ అని దీవించారట! ఆ పేరే ఆ బిడ్డకు శాశ్వతం అయిందని చెబుతారు. ఆ తరువాత చక్రాంగుడు అనే పేరుతో మహావిష్ణువు మానవుడిగా జన్మించి, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. శత్రు రాజులను జయించి ధర్మాంగుణ్ణి తిరిగి రాజుగా చేస్తాడు. 


ఆనాటి కాలాన ఉయ్యాలో - ధర్మాంగుడను రాజు ఉయ్యాలో

ఆ రాజు భార్యయు ఉయ్యాలో - అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో

నూరు నోములు నోమి ఉయ్యాలో - నూరుమందిని కాంచె ఉయ్యాలో...  అనే పాటలో ఈ కథ కనిపిస్తుంది.


దక్షయజ్ఞం జరిగినప్పుడు, తన తండ్రి దక్షుడి చేతిలో భర్త మహా శివుడు పొందిన అవమానాన్ని భరించలేని సతీదేవి ఆత్మార్పణ చేస్తుంది. అప్పుడు సమస్త లోకం తల్లడిల్లిపోయి ‘బతుకమ్మా’ అని రోదించిందనీ, ఆ విధంగా అమ్మవారికి ‘బతుకమ్మ’ అనే పేరు వచ్చిందనీ మరో కథ. ఇలా బతుకమ్మ సంబరం చుట్టూ పూల మాలల్లా అల్లుకున్న కథలు అనేకం ఉన్నాయి.


అందర్నీ చల్లగా చూడాలని...

బతుకమ్మ సంబురాలు ప్రతి యేటా భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య నాడు మొదలవుతాయి. ఈ ఏడాది ఆశ్వయుజ మాసం అధికమాసం కాబట్టి ఆశ్వయుజ అమావాస్య రోజున (ఈనెల 16న) ఈ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఇవి ఆశ్వయుజ శుద్ద నవమి... అంటే శరన్నవరాత్రుల్లోని మహర్నవమితో ముగుస్తాయి. ఖరీఫ్‌ సీజన్‌ పంటలు ఇంటికొచ్చే కాలం కూడా ఇదే కావడంతో పల్లెలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. చెరువులూ, కుంటలూ నిండి ఉంటాయి. రకరకాల పువ్వుల్తో నేలంతా ముస్తాబవుతుంది. తమకు బతుకునిచ్చే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా ప్రజలు భావించి ఆరాధిస్తారు. మహిళలు రోజుకో తీరుగా పూలను పేర్చి ‘బతుకమ్మ’గా కొలుస్తారు. వాటిని వృత్తాకారంలో అమరుస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ ఉయ్యాల పాటలు పాడుతారు.


‘ఎంగిలి పూల బతుకమ్మ’గా పిలిచే మొదటి రోజు మొదలు ‘సద్దుల బతుకమ్మ’గా పిలిచే ఆఖరి రోజు వరకూ... రకరకాల నైవేద్యాల్ని బతుకమ్మకు సమర్పిస్తారు. ఆపదల నుంచి కాపాడమనీ, చక్కటి బతుకును ఇవ్వమనీ, తమ కుటుంబాలను చల్లగా చూడమనీ బతుకమ్మను వేడుకుంటారు. ఆఖరి రోజున నీటి వనరుల దగ్గరకు ఊరేగింపుగా వెళ్ళి, ఆటపాటలతో బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మలను నిమజ్జనం చేసి ‘వెళ్ళిరా.. బతుకమ్మ. మళ్ళి రావమ్మా’ అంటూ వీడ్కోలు చెబుతారు.

Updated Date - 2020-10-09T07:48:38+05:30 IST