ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2021-10-15T04:44:51+05:30 IST

చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
నారాయణఖేడ్‌ పట్టణంలో మహిళకు బహుమతిని అందజేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జయశ్రీరెడ్డి దంపతులు

చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/నిజాంపేట/శివ్వంపేట/వెల్దుర్తి/తూప్రాన్‌, తూప్రాన్‌(మనోహరాబాద్‌)/తూప్రాన్‌ రూరల్‌, అక్టోబరు 14 : చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను సమీప ఆలయాల వద్దకు తీసుకొచ్చి మహిళలు ఆడిపాడారు. ఈ వేడుకల్లో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, సర్పంచ్‌ బందెల జ్యోతి పాల్గొన్నారు. పెద్దశంకరంపేట మండలంలోని రామాలయంతో పాటు ఆయా ప్రధాన కూడళ్లలో, పలు కాలనీల్లో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. అనంతరం బతుకమ్మకుంట తిరుమలాపూర్‌ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. నిజాంపేట మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. శివ్వంపేట మండలంలోని దొంతి, పోతులబోగుడ, కొంతాన్‌పల్లి, గుండ్లపల్లి తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్లలో ఒక్కచోటకు తీసుకొచ్చి ఆడిపాడారు. మండల కేంద్రమైన వెల్దుర్తితో పాటు ఆయా గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తూప్రాన్‌ పట్టణంలో సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం పెద్ద చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. పెద్దచెరువు వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌, కమిషనర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మనోహరాబాద్‌ మండలంతో పాటు కాళ్లకల్‌, కూచారం, ముప్పిరెడ్డిపల్లి, రామాయపల్లి తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తూప్రాన్‌ మండలంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. సర్పంచుల ఆధ్వర్యంలో కిష్టాపూర్‌, వెంకటాయపల్లి దాతర్‌పల్లి, ఇస్లాంపూర్‌, నాగులపల్లి, వెంకటరత్నాపూర్‌ కోనాయపల్లిపీబీ, మల్కాపూర్‌ తదితర గ్రామాల్లో వేడుకలు కొనసాగాయి. మహిళలు, యువతులు బతుకమ్మలను గ్రామ కూడలి వద్ద ఉంచి ఆడిపాడారు. 

సంగారెడ్డి జిల్లాలో

కల్హేర్‌/కంది/పుల్కల్‌/నారాయణఖేడ్‌, అక్టోబరు 14 : కల్హేర్‌ మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కంది మండల పరిధిలోని చిమ్నాపూర్‌లో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిమ్నాపూర్‌లోని పాత చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌ను రంగురంగుల విద్యుత్‌దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రుద్రారం ప్రమీలాప్రకాష్‌, ఎంపీటీసీ నందకిషోర్‌, నాయకులు కృష్ణాగౌడ్‌, భుజేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఉమ్మడి పుల్కల్‌ మండలంలోని వెంకటకిష్టాపూర్‌తో పాటు హున్నాపూర్‌, ఉప్పరిగూడెం, బద్రిగూడెం, శేరిరాంరెడ్డి తదితర గ్రామాల్లో వేడుకలు జరిగాయి. వెంకటకిష్టాపూర్‌ సర్పంచ్‌ బస్వాపురం స్వరూపశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ నిర్వహించారు. నారాయణఖేడ్‌ పట్టణ శివారులోని బతుకమ్మకుంటలో బుధవారం రాత్రి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీరెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం అందంగా బతుకమ్మలను పేర్చిన పలువురు మహిళలకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జయశ్రీరెడ్డి బహుమతులను అందజేశారు. 

Updated Date - 2021-10-15T04:44:51+05:30 IST