ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు

ABN , First Publish Date - 2022-01-19T06:00:27+05:30 IST

కొవిడ్‌ ఆపత్కాలంలో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు బతుకమ్మ చీరలు జవసత్వాలను నింపుతున్నాయి. కరోనా మహమ్మారితో అనేక పరిశ్రమలు చితికి పోయినా ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని అందించాయి.

ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు

- ఆపత్కాలంలో మరమగ్గాల పరిశ్రమకు భరోసా 

-  మీటరుకు రూపాయి తగ్గింపుపై అసంతృప్తి 

   (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కొవిడ్‌ ఆపత్కాలంలో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు బతుకమ్మ చీరలు జవసత్వాలను నింపుతున్నాయి. కరోనా మహమ్మారితో అనేక పరిశ్రమలు చితికి పోయినా ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని అందించాయి. తాజాగా థర్డ్‌వేవ్‌లో లాక్‌డౌన్‌ భయం వెంటాడుతున్న క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించేందుకు నిర్ణయించింది. 4.48 కోట్ల మీటర్ల ఆర్డర్లు రావడంతో నేత పరిశ్రమకు ఊరట లభించినట్లయ్యింది. అయితే  2020 నాటి కూలీనే ఇవ్వడంతో  అసంతృప్తి నెలకొంది. 2020లో ఒక మీటరుకు రూ.32 చెల్లించారు. 2021 బతుకమ్మ చీరల ఆర్డర్లలో డిజైన్లు మారడంతో ఒక రూపాయి పెంచి రూ.33 అందించారు. ఈ సారి 2020 తరహాలోనే బ్లాక్‌ రోటో వార్ప్‌ వినియోగించడం ద్వారా రేటులో రూపాయి తగ్గించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని పారిశ్రామికులు కోరుతున్నారు. 

ఏటా డిజైన్లలో కొత్తదనం 

రాజన్న సిరిసిల్ల జిల్లా మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో బతుకమ్మ చీరలు కొత్త సొబగులతో తయారై బ్రాండ్‌ ఇమేజ్‌గా నిలుస్తున్నాయి. బతుకమ్మ చీరల తయారీని కూడా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. 2022 సంవత్సరానికి బతుకమ్మ చీరల్లో మరిన్ని డిజైన్లతో మార్పులు తెచ్చారు. సిరిసిల్లలో 35 వేల మరమగ్గాలు ఉండగా 16 వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుతోంది. ఈ సారి సిరిసిల్లలో 136 మ్యాక్స్‌ సొసైటీలు, 136 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు 4.48 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల ఆర్డర్లును ముందస్తుగానే అందిస్తున్నారు. గతేడాది వార్ప్‌, వెప్ట్‌ రెండు రంగుల్లో ఉండడంతోపాటు జాకార్డ్‌, డాబీ, బార్డర్లతో బ్లౌజును కలిపి అందించారు. ఈ సారి డాబీ డిజైన్లను బ్లౌజ్‌ పీసులకు కేటాయించారు. చీర డిజైన్లలో మార్పులు తీసుకొచ్చారు. 5.50 మీటర్ల చీరతోపాటు 80 సెంటీమీటర్ల బ్లౌజ్‌పీసును విడిగా అందించనున్నారు. ప్రస్తుతం 29.31 లక్షల మీటర్ల బ్లౌజ్‌ పీస్‌ ఆర్డర్లను విడిగా అందించారు. ప్రస్తుతం మ్యాక్స్‌ సొసైటీలకు 2.95 కోట్ల మీటర్లు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు 1.52 కోట్ల మీటర్ల ఆర్డర్లను సిద్ధం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి డిజైన్లతో ఆర్డర్లను ఇవ్వనున్నారు. 

నేతన్నలకు బతుకునిస్తున్న చీరలు 

ఆత్మహత్యలు, ఆకలిచావులతో విలవిల్లాడిన నేత కుటుంబాలకు బతుకమ్మ చీరలు బతుకు నిస్తున్నాయని భావించవచ్చు. 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలను సారెగా అందిస్తోంది. దీంతో  సిరిసిల్ల కార్మికులకు ఉపాధి లభిస్తోంది. 2017లో రూ.225 కోట్లు వెచ్చించి 94 లక్షల చీరలతో శ్రీకారం చుడితే ప్రస్తుతం ఆర్డర్లు రూ.350 కోట్ల వరకు వెళ్లాయి. 2018లో రూ.280 కోట్లతో 98 లక్షల చీరలు 80 రంగుల్లో ఉత్పత్తి చేశారు. 2019లో రూ.320 కోట్లతో వంద రంగుల్లో జరీ అంచులతో తయారు చేశారు. 2020లో రూ.330 కోట్లతో 225 రంగుల్లో కోటి చీరలను వెండి జరీ అంచుల్లో ఉత్పత్తి చేశారు. 2021 సంవత్సరంలో రూ.350 కోట్లతో డాబీ, జాకార్డ్‌లతో దాదాపు 300 వెరైటీలతో చీరలను తయారు చేసి మరోసారి సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ ప్రత్యేకంగా నిలిపారు. మళ్లీ ఈసారి కూడా కొత్త హంగులతో దాదాపు 80 లక్షల చీరల వరకు తయారు చేయనున్నారు. త్వరలోనే కొత్త డిజైన్లు ఖరారు కానున్నాయి. ఈ సారి కార్మికులపై భారం పడకుండా రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.  


Updated Date - 2022-01-19T06:00:27+05:30 IST