ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-10T06:03:01+05:30 IST

షియా ముస్లింలు జరుపుకొనే మొహర్రం ఊరేగింపు, మాతం కార్యక్రమాలు శాంతియుతంగా జరిగాయి.

ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు
అంబారీకి పూలు సమర్పిస్తున్న సీపీ

హైదరాబాద్‌ సిటీ / చార్మినార్‌ ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): షియా ముస్లింలు జరుపుకొనే మొహర్రం ఊరేగింపు, మాతం కార్యక్రమాలు శాంతియుతంగా జరిగాయి. మొహర్రం మాసంలో పదవ రోజు జరిగే ఈ కార్యక్రమంలో హాజరైన షియా సోదరులు హజ్రత్‌ ఇమామే హుస్సేన్‌ను స్మరిస్తూ మాతం నిర్వహించారు. చారిత్రాత్మక బీబీకా ఆలంను ప్రత్యేక ప్రార్థనల అనంతరం వజ్ర వైడూర్యాలతో అలంకరించి అంబారీపై ప్రతిష్ఠించి ఊరేగింపును ప్రారంభించారు. నల్లని వస్త్రాలు ధరించిన షియాలు సంతాప గీతాలు ఆలపిస్తూ దారి పొడవున భక్తులు బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించా రు. బీబీకా ఆలావా నుంచి షేక్‌ ఫైసీ కమాన్‌, బడాబజార్‌, యాకుత్పురా, మజీదే ఇత్తేబార్‌ చౌక్‌, ఆలీజా కోట్ల, సర్దార్‌ మహల్‌ మీదు గా చార్మినార్‌ వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంది. చార్మినా ర్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అదనపు కమిషర్‌ డీఎస్‌ చౌహాన్‌, దక్షిణమండలం డీసీపీ సాయిచైతన్య బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించారు. చార్మినార్‌ నుంచి ఊరేగింపు గుల్జార్హౌజ్‌, ఖద్మే రసూల్‌ అషుర్ఖానా వద్దకు చేరుకుంది. పంజేషా, ఎతెబార్చౌక్‌, మీరాలం మండి, దారుల్షిఫా మీదు గా చాదర్ఘట్‌ వరకు సాగింది. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరాలం మండి వద్ద బీబీకా ఆలం ఊరేగింపు వద్దకు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యా దవ్‌, గాజుల అంజయ్య బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు శర్బత్తుతో పాటు మంచినీటిని పంపిణీ చేశారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు అన్నదానాలు చేశారు. మసీదులలో ముస్లిం మత పెద్దలు కర్భాల మైదానంలో ఇమామే హుస్సేన్‌ న్యాయం కోసం పోరడుతూ వీరమరణం పొంద టంతో పాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు అర్పించిన విషయాన్ని తమ ప్రసంగాల ద్వారా వివరించారు.



Updated Date - 2022-08-10T06:03:01+05:30 IST