బీసీ ‘సంక్షోభం’

ABN , First Publish Date - 2021-09-29T05:01:35+05:30 IST

జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు రెండేళ్లు బాడుగలు చెల్లించడం లేదు.

బీసీ ‘సంక్షోభం’
కమిటీ చైర్మన కృష్ణమూర్తిని కలిసిన జేసీ రోజ్‌మండ్‌, డీఆర్వో చిన ఓబులేశు

కష్టాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ

అద్దె భవనాల్లోనే 37 హాస్టళ్లు

రూ.2 కోట్ల వరకు బాడుగ బకాయి

సిబ్బంది కొరతతోనూ అవస్థలు

రెండేళ్లుగా అందని స్వయం ఉపాధి నిధులు

‘నవరత్నాల’కే నిధుల మళ్లింపు

నేడు అధికారులతో శాసనసభ బీసీ కమిటీ సమీక్ష


నెల్లూరు (వీఆర్సీ) సెప్టెంబరు 28 : జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు రెండేళ్లు బాడుగలు చెల్లించడం లేదు. ఉన్నవి కూడా చాలీచాలని గదుల్లో విద్యార్థులు కాలం నెట్టుకు వస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఉన్నా సరియైున భవన సదుపాయం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బీసీ కార్పొరేషన ఈడీ పోస్టు సైతం డిప్యుటేషనపై నియమిస్తుండటంతో జవాబుదారీతనం కొరవడుతోంది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటికి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఇలా అనేక సమస్యలతో ఉన్న ఆ శాఖ పనితీరు, సంక్షేమ పథకాల అమలును శాసనసభ బీసీ కమిటీ బుధవారం కలెక్టర్‌లో సమీక్షించనుంది. మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్న  ఆ కమిటీ చైర్మన జంగా కృష్ణమూర్తికి జేసీ (ఆసరా) కేఎం రోజ్‌మండ్‌, డీఆర్వో చిన ఓబులేశు ఏపీ టూరిజం హరిత హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు టూరిజం హోటల్‌లో బీసీల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలో నెలకొన్ని ప్రధాన సమస్యలపై కమిటీ స్పందించాలని పలువురు కోరుతున్నారు.


37 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే..


జిల్లావ్యాప్తంగా ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు 79, కళాశాల హాస్టళ్లు 20 ఉన్నాయి. వీటిలో 62 ప్రభుత్వ భవనాలలో ఉండగా, 37 అద్దె భవనాలలో నడుస్తున్నాయి. రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించకపోవడంతో రూ.2 కోట్ల బకాయి ఉంది. భవన యజమానుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక సిబ్బంది, అధికారులు తలపట్టుకుంటున్నారు. అయితే వీటన్నిటికీ సొంత భవనాలు నిర్మిస్తే ప్రభుత్వంపై అద్దెభారం తగ్గుతుంది. మరోవైపు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం, సహాయ సంక్షేమ అధికారులకు  కార్యాలయం లేదు. ఇటీవల మరో శాఖలకు చెందిన భవనాలలో ఆ శాఖ సిబ్బంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.


వేదిస్తున్న సిబ్బంది కొరత


బీసీ సంక్షేమ శాఖలో 99 వసతిగృహాలు ఉండగా కేవలం 35 మంది మాత్రమే వార్డున్లు ఉన్నారు. ఒక్కో వార్డెనకు రెండు లేదా మూడు హాస్టళ్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు.  దీంతో వార్డెన్లు అక్కడ, ఇక్కడ ఉండక ఇతర వ్యవహారాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవలే కొంతమంది నాల్గవ తరగతి  ఉద్యోగులకు అడహక్‌ పదోన్నతులు కల్పించారు. ఖాళీగా ఏర్పడిన వీరిస్థానంలోనూ కొత్తవారి నియామకం జరగలేదు.  బీసీ సంక్షేమ వసతిగృహాలలో జరుగుతున్న అవినీతి బాగోతంపై 2019లో అవినీతి నిరోధక శాఖ వరుసగా దాడులు నిర్వహించి అనేక అవకతవకలను వెలుగులోకి తెచ్చింది. అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.


బీసీ భవన పూర్తి ఎప్పటికో..


నెల్లూరు నగరంలోని కొండాయపాళెం గేటు సెంటర్‌లోని బీసీ భవన నిర్మానానికి ఇప్పుడిప్పుడే పునాదులు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నత్తతో పోటీపడేలా జరుగుతున్నాయి. 


నిధులు లేని కుల కార్పొరేషన్లు


బీసీ కులాలకు 53 కార్పొరేషన్లు ఉండగా రెండేళ్ల నుంచి ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు అందక నిరుద్యోగ యువత, చేతివృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. సంక్షేమ నిఽధులు దారిమళ్లి నవరత్నాలుగా మారిపోయాయి. దీంతో స్వయం ఉపాధికి అందించే సబ్సిడీ రుణాలు అందడం లేదు.  


Updated Date - 2021-09-29T05:01:35+05:30 IST