10 జట్లకు ఆమోదం

ABN , First Publish Date - 2020-12-25T09:30:42+05:30 IST

విశ్వవాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరింతగా విస్తరించనుంది. ఊహించినట్టుగానే ఈ లీగ్‌లో ఇక నుంచి 10 జట్లు పాల్గొనబోతున్నాయి...

10 జట్లకు  ఆమోదం

  • 2022 ఐపీఎల్‌ నుంచి అమలు
  • మహిళల క్రికెట్‌లో టెస్టులు
  • ఒలింపిక్స్‌లో క్రికెట్‌పై ఆచితూచి
  • బీసీసీఐ ఏజీఎం

అహ్మదాబాద్‌: విశ్వవాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరింతగా విస్తరించనుంది. ఊహించినట్టుగానే ఈ లీగ్‌లో ఇక నుంచి 10 జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే ఈ మార్పు 2022 నుంచే అమల్లోకి వస్తుంది. గురువారం జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు. బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ సహా రాష్ట్రాల క్రికెట్‌ సం ఘాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌, మహిళల క్రికెట్‌లో టెస్టులు.. ఆటగాళ్లకు నష్టపరిహారం ఇలా పలు విషయాలపై ఏజీఎంలో చర్చ సాగించింది.


ఇక నుంచి భారీ లీగ్‌

ఐపీఎల్‌లో అదనపు జట్ల చేరికే ప్రధాన ఎజెండాగా 89వ ఏజీఎం సాగింది. యూఏఈలో లీగ్‌ విజయవంతం కాగానే, వచ్చే సీజన్‌ను 9 జట్లతో నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ మరో నాలుగు నెలల్లోపే 14వ సీజన్‌ ఆరంభం కావాల్సి ఉంది. ఇంత తక్కువ సమయంలోనే టెండర్ల ప్రక్రియ, మ్యాచ్‌ల సంఖ్యను పెంచడం, విదేశీ ఆటగాళ్ల షెడ్యూల్‌ను సర్దుబాటు చేయడం కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే వచ్చే ఏడాది ఐపీఎల్‌ను 8 జట్లతోనే ఆడించి, ఆ తర్వాత అదనపు జట్లను చేర్చాలని బోర్డు భావించింది. ఈమేరకు ఐపీఎల్‌ పాలక మండలికి అధికారాన్ని అప్పగించారు. పది జట్ల వల్ల రెండున్నర నెలలపాటు 94 మ్యాచ్‌లతో అతి భారీగా ఐపీఎల్‌ ఉండనుంది. అలాగే ఒక్కో రాష్ట్రానికి ఒక జట్టు మాత్రమే ఉండనుంది. ఈమేరకు ఇప్పటికే జట్లు కలిగిన తెలంగాణ, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి మరో జట్టును అనుమతించరు. అంతర్జాతీయ వేదికలు కలిగిన అహ్మదాబాద్‌, విశాఖపట్నం, రాజ్‌కోట్‌, తిరువనంతపురం, లక్నో కొత్త జట్ల రేసులో ఉన్నాయి.  


2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌

లాస్‌ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్‌ వేయాలన్న ఆలోచనలో ఐసీసీ ఉంది. అయితే, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నుంచి పూర్తి స్పష్టత తీసుకున్నాకే మద్దతివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మద్దతిస్తే.. బీసీసీఐ తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయి జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ) కిందికి వచ్చే అవకాశం ఉంది. ‘బీసీసీఐ స్వతంత్ర సంస్థ. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడితే బావుంటుంది. కానీ ఈ విషయంలో మాకున్న సందేహాలను లీగల్‌ టీమ్‌ ద్వారా నివృత్తి చేసుకుంటాం’ అని ఏజీఎం సభ్యుడు తెలిపాడు. 


పన్ను మినహాయింపు లేకపోతే..

భారత్‌లో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న కారణంగా, ఈ మెగా టోర్నీకి పూర్తి పన్ను మినహాయించాలని బీసీసీఐ కేంద్రాన్ని కోరనుంది. ఒకవేళ కేంద్రం అంగీకరించకపోతే.. ఐసీసీ ద్వారా తమకు లభించే వార్షికాదాయం రూ.2,900 కోట్ల నుంచి పన్ను మొత్తాన్ని మినహాయించుకునేందుకు ఏజీఎం అంగీకరించింది. దీంతో దాదాపు రూ.904 కోట్లను బీసీసీఐ కోల్పోనుంది. మరోవైపు బోర్డు గుర్తింపు ఉన్న అంపైర్లు, స్కోరర్ల రిటైర్మెంట్‌ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు.



గంగూలీ ‘కాన్‌ఫ్లిక్ట్‌’పై చర్చ లేదు
బీసీసీఐతో ఒప్పందాలు కలిగిన కంపెనీల ప్రత్యర్థులతో.. గంగూలీ కొనసాగడంపై ఏజీఎంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌ డ్రీమ్‌11కు పోటీ అయిన మై11సర్కిల్‌కు దాదా అంబాసిడర్‌గా ఉన్నాడు. ‘మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి ఏజీఎంలో ఎలాంటి చర్చ జరగలేదు. న్యాయపరంగా గంగూలీ స్పష్టంగా ఉన్నాడు’ అని ఓ రాష్ట్ర సభ్యుడు తెలిపాడు. ఇక ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాల్లో గంగూలీ డైరెక్టర్‌గా.. జైషా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. బీసీసీఐ నూతన ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌శుక్లా అధికారికంగా ఎంపికయ్యాడు.

Updated Date - 2020-12-25T09:30:42+05:30 IST