ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు.. బీసీసీఐకి రూ. 5 వేల కోట్లు!

ABN , First Publish Date - 2021-09-01T00:57:23+05:30 IST

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీ మరింత సంపన్నంగా మారనుంది. 2022 ఎడిషన్‌ ఐపీఎల్‌లో

ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు.. బీసీసీఐకి రూ. 5 వేల కోట్లు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ మరింత సంపన్నంగా మారనుంది. 2022 ఎడిషన్‌ ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏకంగా రూ. 5 వేల కోట్లు ఆర్జించనుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో 8 జట్లు మాత్రమే ఉన్నాయి. వచ్చే 2022 ఎడిషన్‌లో వీటి సంఖ్య 10కి పెరగనుంది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ విధివిధానాలు ఇప్పటికే ఖరారు కాగా, బీసీసీఐ నేడు ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం టెండర్లు పిలిచింది. ఫ్రాంచైజీ కొనుగోలుకు ఇది అక్టోబరు 5 వరకు అందుబాటులో ఉంది. 


10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయిన బిడ్ డాక్యుమెంటును కొనుగోలు చేసుకోవచ్చు. రెండు కొత్త జట్లకు కనీస ధరను గతంలో రూ. 1700 కోట్లుగా నిర్ణయించిన బీసీసీఐ తాజాగా, ఆ ధరను రూ.2 వేల కోట్లకు పెంచింది. బీసీసీఐ సీనియర్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అంతా అనుకున్నట్టు జరిగితే రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా బీసీసీఐకి రూ. 5 వేల కోట్లు, అంతకుమించి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ వచ్చే సీజన్‌లో 74 గేమ్స్ ఉంటాయి. దీంతో బరిలో నిలవాలంటే ప్రతీ జట్టుకు విజయం తప్పనిసరి కానుంది.


వార్షిక టర్నోవరు 3 వేల కోట్ల రూపాయలు కలిగిన కంపెనీ మాత్రమే బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొత్త జట్ల వేదికలలో అహ్మదాబాద్, లక్నో, పూణె ఉండే అవకాశం ఉంది. వీటిలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం, లక్నోలోని ఏకాంత స్టేడియాల సామర్థ్యం ఎక్కువ కావడంతో కొత్త ఫ్రాంచైజీలు వీటివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదానీ గ్రూప్, ఆర్‌పీజీ సంజీవ్ గోయెంక గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్, ప్రముఖ బ్యాంకర్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-09-01T00:57:23+05:30 IST