‘బయో’ దాటితే వేటే!

ABN , First Publish Date - 2020-08-06T09:32:15+05:30 IST

యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌కు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్‌ఓపీ)లను ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ బుధవారం రాత్రి ..

‘బయో’ దాటితే వేటే!

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ఐపీఎల్‌ ఫ్రాంచెజీలకు బీసీసీఐ హెచ్చరిక

ఎనిమిది హోటళ్లలో జట్ల బస


న్యూఢిల్లీ: యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌కు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్‌ఓపీ)లను ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ బుధవారం రాత్రి అందజేసింది. బయో సెక్యూర్‌ నిబంధనలను అన్ని జట్లు, యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా శిక్ష తప్పదని హెచ్చరించింది. బుధవారం ఎనిమిది  ఫ్రాంచైజీల అధికారులతో బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహించింది. ‘భారత్‌కు చెందిన క్రికెటర్లు, సహాయక సిబ్బంది తప్పకుండా కొవిడ్‌-19 పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. జట్టు సమావేశం కానున్న నగరంలో వారం రోజుల ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి’ అని ఈ భేటీలో బోర్డు సూచించింది. యూఏఈ వెళ్లడానికి ముందే జట్టు సభ్యుల మధ్య వైరస్‌ రిస్క్‌ నివారణకు ఈ పరీక్షలు దోహదం చేస్తాయని తెలిపింది. అలాగే బయో సెక్యూర్‌ నిబంధనలు అతిక్రమించిన ఆటగాళ్లు, సిబ్బందిని ఐపీఎల్‌ నియమ నిబంధనల ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది. కరోనా పాజిటివ్‌గా తేలినవారు 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాలని, ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో రెండు కొవిడ్‌ పరీక్షలకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఆ రెండింటిలో నెగెటివ్‌ వస్తే సదరు వ్యక్తి యూఏఈ వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పింది. ఈ నిబంధన విదేశీ క్రికెటర్లు, సహాయ సిబ్బందికీ వర్తిస్తుందని పేర్కొంది.


‘యూఏఈ చేరాక..1, 3, 6 రోజుల్లో కొవిడ్‌ పరీక్షలుంటాయి. ఆపై టోర్నమెంట్‌ ఆసాంతం ఐదురోజులకోసారి కరోనా పరీక్షలు జరుపుతారు’ అని తెలిపింది. ‘ఒక్కో జట్టు ఒక్కో హోటల్‌లో బస చేయాలి. ప్రత్యేక సెంట్రల్‌ ఎయిర్‌ కండీషన్‌ ఉన్న ప్రాంతంలో ఒక ఫ్లోర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకోవాలి. క్రికెటర్లకు వేర్వేరు గదుల్లో బస ఏర్పాటు చేయాలి. మూడో కరోనా పరీక్ష కూడా నెగెటివ్‌గా వచ్చిన తర్వాతే బయో సెక్యూర్‌ వాతావరణంలో జట్టులోని ఒక్కో సభ్యుడు మరొకరితో కలవాలి. మాస్క్‌ ధరించడంతోపాటు భౌతిక దూరం తప్పకుండా పాటించాలి’ అని బోర్డు వివరించింది. అందరూ ఒకేచోట భోజనం చేయడాన్ని నిషేధించింది. ఒక్కొక్కరూ భోజనాన్ని గదికే తెప్పించుకోవాలని సూచించింది. యూఏఈ ప్రయాణానికి చార్టర్డ్‌ విమానాలను ఉపయోగించడం ఉత్తమమని సూచించింది. 


ఫ్రాంచైజీల ఎస్‌ఓపీ వివరాలివే..

 ఎనిమిది జట్లు 8 విభిన్న హోటళ్లలో బస చేయాలి.

యూఏఈ వెళ్లడానికి ముందే జట్టులోని సభ్యులం దరికీ రెండు కొవిడ్‌-19 నెగటివ్‌ పరీక్షలు తప్పనిసరి.

 ఈ మార్చి 1నుంచి జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పర్యాటక, వైద్య చరిత్ర వివరాలు అందజేయాలి. యూఏఈ ప్రయాణానికి రెండు వారాల ముందు ఈ వివరాలు ఇవ్వాలి.

 ఆన్‌లైన్‌ ప్రశ్నావళి ద్వారా వివరాలు నమోదు చేయాలి. రోజువారీ టెంపరేచర్‌తోపాటు ఇతర లక్షణాలను పొందుపరచాలి. 

 క్రికెటర్ల కుటుంబీకులు బయో బబుల్‌ బయటఉన్న వారెవరినీ సంప్రదించకూడదు. 

 శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో కుటుంబ సభ్యులను క్రికెటర్లకు దగ్గరగా అనుమతించరు.

 కుటుంబీకులు ఆటగాళ్ల డ్రెసింగ్‌ రూమ్‌లోకి ప్రవేశిం చడం, జట్టు బస్సులో ప్రయాణించడం, క్రికెటర్లతో కలిసి ఆహారం తీసుకోవడం నిషేధం.

 ఆటగాళ్లు ఎవరి కిట్‌లు వారే వాడుకోవాలి. శిక్షణ కిట్‌లతోనే గ్రౌండ్‌కు రావాలి.

 గ్రౌండ్‌లోనూ ఆటగాళ్లు కిట్లు భద్రపరచుకోవచ్చు.

 డగౌట్లో పెన్నులు, ప్యాడ్లు కూడా ఒకరివి ఒకరు వాడకూడదు.

Updated Date - 2020-08-06T09:32:15+05:30 IST