‘ముక్కోటి’పై స్పష్టతేదీ?

ABN , First Publish Date - 2020-12-03T05:51:26+05:30 IST

కరోనా నేపఽథ్యంలో ఈ సారి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఈ ఉత్సవాల నిర్వహణకు మరో మూడు వారాలు మాత్రే గడువుండగా.. దేవాదాయశాఖ నుంచి స్పష్టత కోసం దేవస్థానం అధికారులు ఎదురు చూస్తున్నారు.

‘ముక్కోటి’పై స్పష్టతేదీ?

భద్రగిరిలో ఏకాదశి ఉత్సవాల నిర్వహణపై కొవిడ్‌ ప్రభావం

మరో మూడువారాల్లో వేడుకలు 

ఇంకా ఆదేశాలివ్వని దేవాదాయశాఖ కమిషనర్‌

మార్గదర్శకాల కోసం భద్రాద్రి అధికారుల ఎదురుచూపు 

ఈసారి గోదావరిలో రామయ్యకు తెప్పోత్సవం లేనట్లే!

భద్రాచలం, డిసెంబరు 2: కరోనా నేపఽథ్యంలో ఈ సారి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఈ ఉత్సవాల నిర్వహణకు మరో మూడు వారాలు మాత్రే గడువుండగా.. దేవాదాయశాఖ నుంచి స్పష్టత కోసం దేవస్థానం అధికారులు ఎదురు చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రతీ ఏటా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.80లక్షలతో పనులు చేపడతారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు 16రకాల పనులను రూ.50లక్షలతో చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే దానిపై దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. దీంతో ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీవో గౌతమ్‌ పలుసార్లు ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించారు. కమిషనర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ముక్కోటి ఏర్పాట్లను చేపట్టాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా, 24న తెప్పోత్సవం, 25న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తరద్వారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.   కమిషనర్‌ మార్గదర్శకాలు ఇంకా రాకపోయినా ప్రతి ఏటా ప్రాథమికంగా నిర్వహించే పనులను మాత్రం దేవస్థానం అధికారులు కొనసాగిస్తున్నారు. వాటిలో ఆలయానికి, ఉత్తరద్వారానికి రంగులు వేయడం, విద్యుత్‌ దీపాలంకరణ, పుష్పాలంకరణ తదితర పనులను చేపట్టనున్నారు.

తెప్పోత్సవం ఎక్కడ..?  

వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా ఉత్తరద్వార దర్శనానికి ముందు రోజున గోదావరిలో  సీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈసారి కరోనా నేపథ్యంలో తెప్పోత్సవాన్ని గోదావరి తీరంలో నిర్వహించడం లేదని ఇప్పటికే దేవస్థానం అధికారులు అంతర్గత సమీక్షలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోదావరిలో తెప్పోత్సవం సాగే మార్గంలో ఈసారి ఇసుకమేటలు భారీగా పేరుకుపోయాయని దీంతో నది నీటిమట్టం ఐదు అడుగులున్నా తెప్పోత్సవం నిర్వహించే పరిస్థితులు లేవని, దీనికి తోడు కొవిడ్‌ ప్రభావం ఉండటం కూడా కారణమేనని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెప్పోత్సవ నిర్వహణ నిర్వహణకు గాను చిత్రకూట మండపానికి ఎదురుగా.. గోశాల పక్కన ఉన్న యాగశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టనున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దశావతారాల్లో భాగంగా నిర్వహించే తిరువీధి సేవలు నిర్వహించడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రామాలయం నుంచి చిత్రకూట మండపానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

ఉత్తరద్వార దర్శనం ఎంతమందికి ?

వైకుంఠ ఏకాదశిని పురస్కరించకొని 25న నిర్వహించే ఉత్తరద్వారంలో స్వామి వారిని దర్శించేది ఎంత మంది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిఏటా 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటుండగా వివిధ సెక్టార్ల ద్వారా నాలుగు వేల టికెట్లను దేవస్థానం అధికారులు విక్రయించేవారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టేవారు. ఈసారి కొవిడ్‌ నేపథ్యంలో ఆ సంఖ్య 400కే పరిమితం చేయాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఇప్పటికే సూచించడంతో కమిషనర్‌ మార్గదర్శకాలు వచ్చిన అనంతరం ఆ సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉన్న మేరకు భక్తులకు టికెట్లను విక్రయించాలనే ఆలోచన కూడా దేవస్థానం అధికారుల్లో ఉంది. అయితే ఉత్సవాలకు ఇంకా మూడువారాలే గడువు ఉండగా కమిషనర్‌ మార్గదర్శకాల రాక ఆలస్యమవుతుండటం అధికారుల్లో ఆందోళన పెంచుతోంది. 

రేపటి నుంచి శ్రీరామ పునర్వసు దీక్షలు 

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీక్షాధారణ సందర్భంగా కార్తీక పునర్వసును పురస్కరించుకొని భద్రుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు దీక్షధారణ చేస్తారు. ఈ శ్రీరామ పునర్వసు దీక్షలు మార్గశిర పునర్వసు సందర్భంగా 31వ తేదీన ముగియనున్నాయి. దీక్షల ముగింపు రోజున గిరి ప్రదక్షిణ, పాదుకాపూజ, దీక్ష విరమణ, వెండి రథోత్సవం నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-12-03T05:51:26+05:30 IST