అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-09-17T05:04:11+05:30 IST

‘ఇన్నాళ్ళు పాలించిన నాయకులు కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి వాళ్ళు బాగుపడ్డారు తప్ప.. ప్రజలెవరూ బాగుపడలేదు.

అప్రమత్తంగా ఉండాలి
జడ్పీ మైదానంలో బహిరంగ సభకు హాజరైన జనం

రక్తం మరిగిన పులుల్లా నాయకులు వస్తున్నారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరులో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 16: ‘ఇన్నాళ్ళు పాలించిన నాయకులు కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి వాళ్ళు బాగుపడ్డారు తప్ప.. ప్రజలెవరూ బాగుపడలేదు. రక్తం మరిగిన పులుల్లా వస్తున్న వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ సమాజం కోసం పని చేస్తున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలి’ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మహబూబ్‌నగర్‌ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అది నచ్చని కొందరు ఇక్కడ కల్లోలం సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అరాచక శక్తుల ఆట కట్టించకపోతే మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయని, ఆ శక్తులను కట్టడిచేసేందుకు పోలీసులు చట్టానికి లోబడి నిఘా ఉంచాలన్నారు. పోలీసులే కాదు సమాజహితులు కూడా ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాలమూరులో ఐటీ టవర్‌ పూర్తయ్యిందని, ఫర్నిచర్‌ ఏర్పాటు చేస్తున్నారని, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలను కూడా తొందర లోనే పూర్తి చేసుకుంటామన్నారు.


రాష్ట్రమంతటా ..

సెప్టెంబరు 17ను ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్య మంత్రి కేసీఆర్‌ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను రాష్ట్రమంతటా గొప్పగా నిర్వహిస్తున్నా రన్నారు. తెలం గాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. మన బతుకులు మార్చిన వారి కోసం, పేద ప్రజల కోసం పని చేస్తున్న వారికోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్ళు వ్యవస్థలను చిన్నాభిన్నాం చేసిన, కులమతాలను అడ్డం పెట్టుకుని ఎదిగిన నాయకులు మళ్ళీ తామేదో ఉద్దరిస్తామని ముందుకువస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భారత పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదట తీర్మానం చేసిందని, తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంగా నామకరణం చేశారని చెప్పారు. ట్యాంక్‌బండ్‌ వద్ద 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, నాయకులు తాటిగణేష్‌, గోపాల్‌యాదవ్‌, పోతుల గిరిధర్‌రెడ్డి, చెరుకుపల్లి రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 


వేలాది మందితో ర్యాలీ

వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండాలతో పాలమూరులో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ దగ్గర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉద్యోగులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో మంత్రి జాతీయ జెండాతో పాల్గొన్నారు. ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ర్యాలీ జిల్లా పరిషత్‌ నుంచి బస్టాండ్‌ మీదుగా అశోక్‌ టాకీస్‌ చౌరస్తా, క్లాక్‌టవర్‌, పాతబస్టాండ్‌, తెలంగాణ చౌరస్తా మీదుగా బాలుర జూనియర్‌ కళాశాల వరకు సాగింది. దారిపొడవునా జాతీయ జెండాలతో ర్యాలీ చేయడంతో పురవీధులు కొత్తశోభను సంతరించుకున్నాయి. ట్రాఫిక్‌ స్తంభించింది. ర్యాలీలో దేశభక్తి గేయాలకు విద్యార్థులు నృత్యం చేశారు. వేదిక వద్ద విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిఽధులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-09-17T05:04:11+05:30 IST