క్రెడిట్‌ పాయింట్ల పేరుతో ఫోన్ వస్తోందా.. తస్మాత్ జాగ్రత్త

ABN , First Publish Date - 2021-11-15T17:05:30+05:30 IST

తాము బ్యాంకు ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంటారు.

క్రెడిట్‌ పాయింట్ల పేరుతో ఫోన్ వస్తోందా.. తస్మాత్ జాగ్రత్త

హైదరాబాద్‌ సిటీ : బోనస్‌ పాయింట్లు జత చేస్తామని కార్డు వివరాలు సేకరించి ఖాతా ఖాళీచేస్తున్న సైబర్‌నేరగాడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి చెందిన దీపక్‌ కుమార్‌, ముఖేష్‌లు కలిసి వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల వివరాలు సేకరించేవారు. నకిలీ వివరాలతో సిమ్‌ కార్డులను సమకూర్చుకునేవారు. అనంతరం ఈ సిమ్‌ల ద్వారా క్రెడిట్‌ కార్డుల ఖాతాదారులకు ఫోన్‌ చేసి, తాము బ్యాంకు ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంటారు.


క్రెడిట్‌ పాయింట్లు జత చేస్తామన్న  సాకుతో వారి కార్డు నెంబర్‌, సీవీవీ నెంబర్‌ తెలుసుకుంటారు. వివరాలు తెలుసుకున్న అనంతరం ఖాతాలో డబ్బును ఖాళీ చేస్తారు. ఇదే విధంగా నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు. ఢిల్లీకి వెళ్లి నిందితుల్లో ఒకడైన దీపక్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు ముఖేష్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-15T17:05:30+05:30 IST