ALERT : చల్లని వాతావరణంతో ఈ రోగాలు పొంచి ఉన్నాయ్.. జాగ్రత్త..

ABN , First Publish Date - 2021-07-23T14:03:31+05:30 IST

కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో గ్రేటర్‌లో చల్లని వాతావరణం నెలకొంది....

ALERT : చల్లని వాతావరణంతో ఈ రోగాలు పొంచి ఉన్నాయ్.. జాగ్రత్త..

  • జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు


హైదరాబాద్‌ సిటీ : కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో గ్రేటర్‌లో చల్లని వాతావరణం నెలకొంది. ప్రజలు చలి, జ్వరంతో మంచం ఎక్కుతున్నారు. వాంతులు, విరోచనాలు, తల, ఒళ్లు నొప్పులు, దగ్గు జలుబు బారిన పడుతున్నారు. మరో వైపు రోడ్లపై మురికినీటి ప్రవాహం, పేరుకుపోయిన చెత్తచెదారంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు పొంచి ఉన్నాయి. శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్బిణిలు, బాలింతలు ఈ వాతావరణంతో మరింత ఇబ్బంది పడుతున్నారు.


వైరల్‌ ఫీవర్ల తాకిడి

ప్రస్తుత వాతావరణంతో వైరల్‌ ఫీవర్లు పెరుగుతున్నాయి. జ్వరాలతో వైద్యులను  ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. వాంతులు, విరోచనాలు, గొంతునొప్పి, దగ్గు, టైఫాయిడ్‌ వ్యాధులు ప్రజలను పట్టిపిడీస్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారు ఫీవర్‌, ఛాతీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్తున్నారు.


ఫ్లూతో జర భద్రం

చల్లని వాతావరణంతో ఫ్లూ ముప్పు పొంచి ఉంది. వైద్యుల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పీసీఆర్‌ పరీక్షతో వందశాతం ఫలితం వస్తుందని వైద్యులు తెలిపారు. 


పెరిగిన శ్వాసకోశ వ్యాధులు 

- ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సీజన్‌లో పిల్లలకు నీళ్ల విరోచనాల(డయేరియా) ప్రభావం కూడా తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే కేసుల్లో అధిక శాతం ఈ రోటా వైరస్‌ దాడి చేసిన కేసులే ఉంటున్నాయి. 

- ఈ కాలంలో పిల్లలు స్వైన్‌ఫ్లూ బారిన పడే ప్రమాదముంది. రద్దీ ప్రాంతాల్లో పిల్లలను బయటకు పంపించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 


లక్షణాలు ఇలా..

- తీవ్రంగా వాంతులు, విరోచనాలు

- గొంతు, నాలుక ఎండిపోయినట్లు, చర్మం ముడతలు పడినట్లు ఉంటుంది

- శరీరంలో నీరు ఇంకిపోయి పొడారిన గుణాన్ని కోల్పోతోంది.

- విపరీతమైన దాహం వేస్తోంది.

- వ్యాధి బారిన పడిన వారు నీరసించి కదల్లేని స్థితికి వస్తారు. 


ఇంట్లో ఇలా ఉంచుకోవాలి

- ఇల్లు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

- ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా  జాగ్రత్తలు తీసుకోవాలి.

- దోమ తెరలు తప్పని సరిగ్గా వినియోగించాలి.

- ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి.


వ్యక్తిగత పరిశుభ్రత

- వెచ్చటి దుస్తులు ధరించాలి.

- రోజు రోజుకూ దుస్తులు మార్చాలి.

- వర్షంలో తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- 48 గంటలకు మించి జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

- వర్షాకాలం ఎక్కువగా పనిచేసేవారు ఎలకా్ట్రల్‌ పౌండర్‌ నీళ్లు ఎక్కువగా తాగాలి. 


ఆహారం 

- వేడి ఆహారం తీసుకోవాలి

- వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి

- పండ్లు, కూరగాయాలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.

- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. 

- నిమ్మరసం, బార్లీ, మజ్జిగ, గ్లూకోజ్‌ తరుచూ తాగాలి.

- ఒక లీటర్‌ నీటిలో చెంచా ఉప్పు, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగించాలి. 


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వాతావరణం తేమగా ఉంటే రోగాలు పొంచి ఉంటాయి. వెన్ను నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తంలో తక్కువ ప్లేట్‌లేట్ల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. విరోచనాలు, వాంతులు వంటి సమస్యలు పెరిగే ప్రమాదముంది. ఫ్ల్యూ, న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగే అవకాశం ఉంది. చల్లని వాతావారణంతో ఆస్తమా, బ్రాంకైటిస్‌ సమస్యలు పెరుగుతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు వడపోసి తాగడం మంచిది. - డాక్టర్‌ అనీష్‌ ఆనంద్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, అపోలో ఆస్పత్రి

Updated Date - 2021-07-23T14:03:31+05:30 IST