ఈసారైనా జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-04-18T05:47:26+05:30 IST

కరోనా మళ్లీ కరాళనృత్యం చేస్తోంది. దేశంలో రోజువారీ కేసులు 2 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా రోజురోజుకూ

ఈసారైనా జాగ్రత్త!

కరోనా మళ్లీ కరాళనృత్యం చేస్తోంది. దేశంలో రోజువారీ కేసులు 2 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. కొవిడ్‌ కోరల్లో చిక్కుకోకుండా మరింత జాగ్రత్తపడాల్సిన సమయమిది. అంతేకాదు, ఆర్థిక  అప్రమత్తత కూడా అవసరం. వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక భద్రత విషయంలో ఈసారైనా ముందు జాగ్రత్తపడండి. గత ఏడాది పరిస్థితులే ఇందుకు గుణపాఠం కావాలి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తదనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి. 


 మళ్లీ ఉగ్రరూపం దాల్చిన కరోనా 

 కుటుంబ, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు గత ఏడాది పరిస్థితులే గుణపాఠాలు..

 అత్యవసర నిధితో ఆపద గట్టెక్కు


గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నవారికి అత్యవసర నిధి ఆవశ్యకత గురించి ఇప్పటికే తెలిసివచ్చి ఉంటుంది. కరోనా మలి విడత సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి లేదా వ్యాపారం మూతపడి ఆదాయం నిలిచిపోతే ఏంటి పరిస్థితి..? గత ఏడాది లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలో కోట్లాది మందికి ఈ చేదు అనుభవం ఎదురై ఉంటుంది. ఈ సారైనా జాగ్రత్త పడండి. కనీసం 3-6 నెలలకు సరిపడా కుటుంబ ఖర్చులు, ఈఎంఐ చెల్లింపుల కయ్యే సొమ్ముతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. 

  


 ఆరోగ్య బీమా.. ఆ ధీమాయే వేరప్ప

 దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనైతే లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య బీమా మిమల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. కరోనా చికిత్సకు బీమా కవరేజీ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పాలసీలను సైతం తీసుకొచ్చింది. కుటుంబ మొత్తానికీ ఆరోగ్య బీమా కలిగి ఉండటం మేలు.  


పొదుపు పెంపు.. ఖర్చులకు కోత

 మున్ముందు పరిస్థితులెలా ఉంటాయో తెలియదు. కాబట్టి వీలైనంత సొమ్ము పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం వ్యయాలకు వీలైనంత కోత వేయండి. అత్యవసరమైతే తప్ప ఖర్చుకు దూరంగా ఉండటం ఉత్తమం. 


రుణం ఎన్నటికైనా భారమే.. 

 రుణాలపై మళ్లీ మారటోరియం (తిరిగి చెల్లింపులకు తాత్కాలిక విరామం) కల్పించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది.  కాబట్టి, ఈఎంఐలు సకాలంలో, క్రమం తప్పకుండా చెల్లించండి. ప్రసు ్తత సమయంలో రుణాలు తీసుకోవాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, మీ ఆర్థిక పరిస్థితిని పునఃసమీక్షించుకొన్నాకే తుది నిర్ణయం తీసుకోవడం మేలు. 



Updated Date - 2021-04-18T05:47:26+05:30 IST