Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడలో.. నయా మోసాలు!

తస్మాత్‌ జాగ్రత్త..!

నగరంలో విస్తరిస్తున్న నయా మోసాలు

కొంప ముంచుతున్న అత్యాశ


విజయవాడ:

- డీఆర్‌డీవోలో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే నమ్మేసి రూ.65 లక్షలు సమర్పించుకుని తల పట్టుకుంది ఓ న్యాయవాది. పోలీసులు ఆ మోసగాడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరో రెండు మోసాలు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది. 


- 2019లో ఘటన ఇది.. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్‌ ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కుక్కపిల్లల పేరు చెప్పి మోసం చేశాడు. విదేశాల్లో ఉండే ప్రముఖ జాతి కుక్క పిల్లలను తక్కువ ధరకు ఇప్పిస్తానని ఆ వ్యాపారవేత్తను నమ్మించాడు. విదేశాల నుంచి జాతి కుక్కపిల్లలు వస్తున్నాయని చెప్పి రూ.17లక్షలు కాజేశాడు. డబ్బు ఖాతాలో జమ అయ్యాక అక్కడి నుంచి మకాం మార్చాడు. విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అతడి గురించి గాలించినా ఫలితం లేదు. ఆ తర్వాత విజయవాడ వచ్చి వన్‌టౌన్‌లో ఇద్దరు యువకులకు ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. కొన్నాళ్లు రైస్‌ పుల్లింగ్‌ వ్యాపారం చేశాడు. తాను ఐపీఎస్‌ అధికారినని, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశానని నమ్మించాడు. ఓ మహిళా న్యాయవాదికి వల వేశాడు. ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేకుండా ఆమె పిల్లలిద్దరికీ డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె ఏకంగా రూ.65లక్షలను ఆయనకు ఆన్‌లైన్‌లో పంపింది. నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.


అత్యాశతోనే..

అజ్ఞానం గూడు కట్టుకున్న చోటే మోసం గుడ్డు పెడుతుందంటారు. ఇదిప్పుడు ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తోంది. మోసగాళ్లు విసురుతున్న వలలో ఇట్టే ఇరుక్కు పోతున్నారు అమాయకులు. వీటన్నింటికీ అత్యాశే కారణమని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. బంగారం బిస్కెట్ల వ్యవహారంలోనూ ఇదే జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తునిలో చీటీల పేరుతో మోసం చేసి విలాసాలకు రుచి మరిగింది నాగమణి. బంగారం బిస్కెట్లను ఎరగా వేయడంతో చాలామంది డబ్బు ఆశతో ఇరుక్కుపోయారు. కొద్దిరోజుల క్రితం వరకు ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) మోసాలు జరిగాయి. ఇప్పుడు అవి తగ్గి, స్కీమ్‌లు, ఉద్యోగాల పేరుతో దోచుకుంటున్నారు. 


ఒక్కసారి ఆలోచించండి 

ఎవరైనా ఏదైనా స్కీమ్‌ గురించి చెప్తే వెంటనే నమ్మకూడదు. దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటన్నది పరిశీలించుకోవాలి. ప్రజల్లో అత్యాశ పెరిగిపోతోంది. ఈ కారణంగానే మోసగాళ్ల మాయలో పడుతున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు దొరకడం లేదు. కొన్ని కేసుల్లో చిక్కినా విచారణలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 

- బాబూరావు, ఇన్‌చార్జి డీసీపీ

Advertisement
Advertisement