విప్లవోద్యమాల వెలుగుదివ్వె

ABN , First Publish Date - 2020-02-21T07:20:15+05:30 IST

ప్రపంచ దశ- దిశని మార్చేసిన పుస్తకం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ పుస్తకం రాసేనాటికి మార్క్స్ వయస్సు 29 ఏళ్లు. ఆయన సహచరుడు ఏంగెల్స్ వయస్సు 28 ఏళ్లు. రాజకీయ రచనల్లో కమ్యూనిస్టు ప్రణాళికకు దీటైన గ్రంథం మరోటి లేదు...

విప్లవోద్యమాల వెలుగుదివ్వె

గొంతెత్తి తమ అభ్యర్థన చెప్పుకునే స్వేచ్ఛ లేని జీవితాలకు, శతాబ్దాల తరబడి అలవాటు పడ్డ సాధారణ ప్రజానీకానికి, పిడికిలి బిగించి నినాదం ఇవ్వటం ఎలాగో నేర్పింది కమ్యూనిస్టు ప్రణాళిక. శ్రామిక ప్రజలు సమష్టిగా పెట్టుబడిదారీ సమాజాన్ని తమ పిడికిళ్లలో బంధిస్తే వచ్చే ప్రయోజనాలేమిటో వివరించటమే మన ముందున్న కర్తవ్యం.  దోపిడీ, వివక్ష, అణచివేత, మతోన్మాదాన్ని వ్యతిరేకించే అన్ని శక్తులు భాగస్వాములు కావల్సిన సమయం ఇది. 


ప్రపంచ దశ- దిశని మార్చేసిన పుస్తకం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ పుస్తకం రాసేనాటికి మార్క్స్ వయస్సు 29 ఏళ్లు. ఆయన సహచరుడు ఏంగెల్స్ వయస్సు 28 ఏళ్లు. రాజకీయ రచనల్లో కమ్యూనిస్టు ప్రణాళికకు దీటైన గ్రంథం మరోటి లేదు. ‘యూరప్‌ను ఓ భూతం ఆవహించింది’ అన్న తొలి వాక్యమే ప్రపంచంలో జరగబోయే పరిణామాల గురించిన హెచ్చరికగా ఉంటుంది. దారుణమైన దోపిడీ వ్యవస్థ మనుగడ కొసాగంచటంలో తాము కూడా భాగస్వాములై, చరిత్ర మోపిన భారం కింద నలిగిపోవాలా లేక సాయుధులై చరిత్రను తిరగరాయాలా అన్న మీమాంస కమ్యూనిస్టు ప్రణాళిక చదువుతున్నప్పుడు పాఠకుడికి కలుగుతుంది.


కమ్యూనిస్టు ప్రణాళిక తొలి పాఠకుడికి అంటే 1848 నాటి యూరోపియన్ కార్మికుడికి మేధోమధన సమాచార పత్రం కాదు. తక్షణ కార్యాచరణకై ఇచ్చిన పొలికేక. భూస్వామ్య వ్యవస్థ గర్భం నుండి విముక్తి పొందటానికి పురిటి నొప్పులు పడుతున్న బూర్జువా వ్యవస్థ తనను తాను నిలదొక్కుకోనే క్రమంలో కార్మికవర్గాన్ని పావులుగా మార్చుకుంటున్న వేళ ఆ మోసాన్ని కళ్లకు కట్టినట్టు విప్పి చెప్పి కార్మికుడిని బూర్జువా వ్యవస్థపై తిరుగుబాటుకు కార్యోన్ముఖుడిని చేసిన వ్యూహ రచన కమ్యూనిస్టు ప్రణాళిక. నేటి యువత ముందు కూడా అదే పరిస్థితి ఉంది. కాలంతో పాటు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఉత్థాన పతనాలున్నాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలకు మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్ట్ ప్రణాళిక మాత్రం శిలాశాసనంగా మిగిలే ఉంది.


రెండో శతజయంతికి చేరువవుతున్నా ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో స్ఫూర్తిదాయనిగా వెలుగుతూనే ఉంది. తొలి అడుగులు వేయటానికి కూడా నాడు కష్టపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ దశలోనే దోపిడీ, దాష్టీకం, లాభాపేక్షతో సాగించే యుద్ధకాంక్ష, వలసలు, ప్రపంచీకరణ, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని లాభార్జన కోసం పాదాక్రాంతం చేసుకుంటున్న తీరును కమ్యూనిస్టు ప్రణాళిక రెండు శతాబ్దాల క్రితమే అక్షర సత్యంగా గుర్తించిందంటే ప్రణాళిక మేధో విజయాన్ని తెలియచేస్తుంది. ప్రపంచీకరణ గురించి, హద్దుల్లేని పెట్టుబడి చలనం గురించి 1848లోనే మార్క్స్ ఏంగెల్స్ హెచ్చరించారు. దాంతో పాటు వచ్చే ముప్పును కూడా మన ముందుంచారు.


కమ్యూనిస్టు ప్రణాళికను నేడు చదువుతున్న వారెవరైనా నాడు మార్క్స్ ఏంగెల్స్‌లు వర్ణించిన పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు, నేడు నిత్య జీవితంలో 21వ శతాబ్దంలో చూస్తున్న లక్షణాలకు మధ్య చెప్పుకోదగ్గ తేడా లేకపోవటాన్ని ఇట్టే గుర్తిస్తారు. కమ్యూనిస్టు ప్రణాళిక రాసే సమయానికి ఆవిరి యంత్రాలే భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టే సాధనాలయ్యాయి. భూస్వామ్య వ్యవస్థ శిథిలాల నుండి బతికి బయటపడిన గ్రామీణ పేదలు కార్మికులుగా అవతారమెత్తి ఆవిరి యంత్రాలతో ఏర్పాటైన కొత్త కర్మాగారాల్లో రోజుకూలికి కుదిరి ప్రపంచాన్ని మార్చాల్సిన కార్మికవర్గంగా అవతారమెత్తుతున్న కాలం అది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ నాలుగు శతాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన సమాజాన్ని, సామాజిక ఆర్థిక సంబంధాలను సవాలు చేస్తున్న ఆధునిక ఉత్పత్తి సాధనాలు ఏమిటి? కృత్రిమ మేధ. ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఇవన్నీ కలిసి అప్పటి వరకు పెట్టుబడిదారీ సమాజంలో ‘శిలేసుకు పోయిన సంబంధాలను’ నిర్ద్వంద్వంగా పెకలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవే, కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లు ‘నిరంతరం తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ఆధునిక దశకు చేరుకుంటున్న ఉత్పత్తి సాధనాలు’. ఈ ఉత్పత్తి సాధనాలే ‘ఉత్పత్తి సబంధాలను నిరంతరం విప్లవాత్మకంగా మారుస్తూ అన్ని సామాజిక పరిస్థితులను పెకలించి వేస్తున్నాయి. అంతులేని ఆందోళనకు పునాదులేస్తున్నాయి’. 


పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతగా ఉత్పత్తి సామర్థ్యం పెంపొందించుకున్నా, ఉత్పత్తి పెరిగినా, సంపద కొండలుగా పోగుపడ్డా పేదరికం మాత్రం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగ సైన్యం పెరుగుతూనే ఉంది. అంటువ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. సమాజాన్ని ఆర్థికంగా రాజకీయంగా శాసిస్తున్న కంపెనీలే ఈ విలయానికి కారణమవుతున్నాయి. విలయంలో సైతం లబ్ధి పొందుతున్నాయి. 2008నాటి సంక్షోభాన్ని నేడు తాజా భారతదేశంలో వ్యక్తమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. బడా బూర్జువాలు ఎగ్గొట్టిన బ్యాంకు బకాయిలు కారణంగా దివాళాతీస్తుంటే ప్రభుత్వాలు మాత్రం అదే బడా బూర్జువాలకు లక్షల కోట్ల రాయితీలు కట్టబెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని చట్టాలు చేసినా శ్రమపై పెట్టుబడి ఆధిపత్యాన్ని సంరక్షించేందుకే దారితీస్తున్నాయి తప్ప కార్మికుల పక్షాన ఈ చట్టాలు పని చేయటం లేదు. ఉత్పత్తి సాధనాలపై ఉన్న వ్యక్తిగత ఆస్తి హక్కును రద్దు చేసి దాని స్థానంలో నూతన ఆస్తి రూపాలను, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పని భారం తగ్గేలా, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గేలా నూతన ఆస్థి రూపాలను ఉనికిలోకి తేవటం ఒక్కటే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం. ఈ పరిష్కారాన్ని 172 ఏళ్ల క్రితం సూచించిన గ్రం‍థమే కమ్యూనిస్టు ప్రణాళిక.


రెండో ప్రపంచ యుద్ధానంతరం కాస్తంత నాజూకుతనం వంటబట్టించుకున్న పెట్టుబడి 1990 దశకం వచ్చేటప్పటికి గానీ పూర్తి విశ్వరూపం ప్రదర్శించలేదు. ఈ పెట్టుబడి విశ్వరూపాన్నే మార్క్స్ ఏంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికలో అంచనా వేయగలిగారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక వ్యూహం, లక్ష్యం ఆచరణ రూపం తీసుకోవాలని కాంక్షించే కోట్లాదిమంది ముందు బూర్జువా మేధావులు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజాస్వామ్యరహిత ప్రభుత్వాలను స్వాగతిస్తున్నారా అన్నదే ఈ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి మనం ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం లేదు. వాల్ స్ట్రీట్ లేదా మన స్టాక్ మార్కెట్‌లో జరిగే మోసాలకు ఆడం స్మిత్‌పై ఆరోపణలు చేయగలమా? స్పెయిన్‌లో జరిగిన ఊచకోతకు కొత్త నిబంధన గ్రంథానిదే బాధ్యత అని ఆరోపించగలమా? ఇదే ప్రశ్నలు మార్క్స్ ఏంగెల్స్‌లకు వేస్తే వారి సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వటానికి కావల్సినంత సమయం వారికి దొరక్కముందే చనిపోయారు అన్న విషయాన్ని గుర్తించాలే తప్ప వారు చెప్పలేకపోయారు అని కాదు. మార్క్స్ ఏంగెల్స్ అందించిన గతితార్కిక పద్ధతిననుసరించి మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోగలము. పరిష్కరించుకోగలము. బూర్జువా మేధావులకు కమ్యూనిజంపై భావయుద్ధం ప్రకటించటానికి ఏ ఇతర కారణమూ దొరకటం లేదు కాబట్టే ఇటువంటి విషయాలకు పరిమితమవుతున్నారని కూడా మనం విడమర్చి చెప్పాల్సి ఉంటుంది.


కమ్యూనిస్టు ప్రణాళికను ఆచరణ రూపంలో పెట్టే ప్రయత్నంలో ఎదురైన కొన్ని ప్రశ్నలకు మార్క్సిజం ప్రతిపాదకులు అంచనా వేయలేకపోయారని చెప్పవచ్చు. సోవియట్ యూనియన్ వంటి విశాలదేశంలో ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించటంలో విజయం సాధించటమే కాక ప్రపంచంలో మూడో వంతు దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టుకున్న పార్టీలు అధికారానికి వచ్చాక పెట్టుబడిదారీ విధానం చూస్తూ ఊరుకుంటుందా? వందల ఏళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న తమ దోపిడీకి ప్రపంచాన్నే రంగ స్థలంగా మార్చుకున్న పెట్టుబడి మూడోవంతు భూభాగంలో తన పాచికలు పారటం లేదు, దోపిడీ ఆటలు సాగటం లేదు అంటే నిశ్చేష్టురాలై చూస్తూ ఉంటుందా? అనుభవాలన్నింటినీ రంగరించి కొత్త వ్యూహం తయారు చేస్తుంది. అదే జరిగింది. ఇది ద్వంద్వ వ్యూహం. ఓ వైపు పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నడూ అంగీకరించని సంక్షేమ పథకాలు అమలు చేయటం ప్రారంభించింది. రెండో వైపు సోషలిస్టు దేశాలను వెలివేసి ఒంటరి చేసి దొంగదెబ్బ తీసేందుకు సైనిక వ్యూహం అనుసరించింది. దీని ఫలితమే ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహం. దాని ఫలితాలు, పర్యవసానాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి.


ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వర్తమాన చరిత్రలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఓ ఉద్ర్గంథమే తయారవుతుంది. ముగింపు వాక్యాలుగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రణాళిక ఆటవిక రాక్షసుడి వంటి పెట్టుబడిదారీ వ్యవస్థకు సంక్షేమం అనే ఆభరణాలు తొడుక్కుని నాజూగ్గా కనిపించాల్సిన అవసరాన్ని కల్పించింది. గొంతెత్తి తమ అభ్యర్థన చెప్పుకునే స్వేచ్ఛ లేని జీవితాలకు శతాబ్దాల తరబడి అలవాటు పడ్డ సాధారణ ప్రజానీకానికి పిడికిలి బిగించి నినాదం ఇవ్వటం ఎలాగో నేర్పింది. ఈ పిడికిలి బిగువుకే వచ్చిన ప్రయోజనాలు చూసి అవాక్కయ్యేలా చేసింది. కేవలం పిడికిలి బిగిస్తేనే కార్మికవర్గం, పీడిత ప్రజానీకం ఇన్ని విజయాలు ప్రయోజనాలు సాధించి తమ జీవితాలను ఎంతో కొంత మెరుగ్గా జీవించగల పరిస్థితులను సృష్టించ గలుగుతున్నప్పుడు పెట్టుబడిదారీ సమాజాన్ని తమ పిడికిళ్లలో బంధిస్తేవచ్చే ప్రయోజనాలేమిటో వివరించటమే మన ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక 172వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో లక్ష కాపీల పంపిణీ ఉద్యమానికి వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో దోపిడీని, వివక్షను, అణచివేతను మతోన్మాదాన్ని వ్యతిరేకించే అన్ని శక్తులు భాగస్వాములు కావల్సిన సమయం ఇది. మన బిగించిన పిడికిలికున్న శక్తిని ప్రపంచానికి తెలియచెప్పాల్సిన తరుణం ఇది.

కొండూరి వీరయ్య

(నేడు కమ్యూనిస్టు ప్రణాళిక 172వ వార్షికోత్సవం)


రెడ్‌ బుక్స్‌ డే

పెట్టుబడి దారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. 1930 నాటి మహామాంద్యం కన్నా విస్తృతంగా, లోతుగా సాగుతున్న ఈ సంక్షోభానికి పరిష్కారం కనుక్కోలేక పండితులు సతమతమ వుతున్నారు. దీని దుష్ఫలితాలను మాత్రం ప్రజలే భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థగా సోషలిజం విశిష్టత గురించి ప్రజలలో ప్రచారం చేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 21వ తేదీని 

‘రెడ్‌ బుక్స్‌ డే’గా పాటించాలని నిశ్చయించాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రజల్లో తీసుకుపోవడానికి సభలు నిర్వహిస్తున్నాయి. అదే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్క్స్‌, ఏంగెల్స్‌ రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’తో పాటు, ఏంగెల్స్‌ రచించిన ‘కమ్యూనిజం సూత్రాలు’ అనే పుస్తకాన్ని కలిపి ప్రజాశక్తి బుక్‌హౌస్‌, పీకాక్‌ క్లాసిక్స్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, నవతెలంగాణ పబ్లికేషన్స్‌, నవచేతన పబ్లికేషన్స్‌ సమైక్యంగా లక్ష కాపీలను ప్రచురించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు 200 చోట్ల సభలు, సమావేశాలు, సెమినార్లు జరుపుతున్నాయి. 96 పేజీలున్న ఈ పుస్తకాన్ని రూ.10కే అందిస్తారు. 

ప్రచురణకర్తలు


Updated Date - 2020-02-21T07:20:15+05:30 IST