వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-14T10:08:10+05:30 IST

గోదావరికి వరద పెరుగుతున్న నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆదేశించారు.

వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి

సమీక్ష సమావేశంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 


కొత్తగూడెం కలెక్టరేట్‌, ఆగసు 13: గోదావరికి వరద పెరుగుతున్న నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు గోదావరి వరదలు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాలపై గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోదావరి పరివాహకం నుంచి వరద కొనసాగుతుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉంటుందని, రానున్న రెండు మూడు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.


వరద పరిస్థితులను  ఎదుర్కొనేందుకు తూర్పుగోదావరి నుంచి లాంచీలు తెప్పించి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండా తమ పరిధిలోని విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వరద ముంపు ప్రమాదం ఉన్న మండలాల్లో ఆరోగ్యకేంద్రాలు, రోడ్లు భవనాలు, పీఆర్‌, డీపీఓ, ఆర్డీఓ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు 24గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. వరదల సన్నదంపై శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న టెలీకాన్ఫరెన్స్‌కు అధికారులు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కె వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌ నాయక్‌, కొత్తగూడెం ఆర్డీఓ స్వర్ణలత, భద్రాచలం ఇరిగేషన్‌ ఈఈ రాంప్రసాద్‌, గోదావరి పరివాహక మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-14T10:08:10+05:30 IST